నేను భారతీయుడిని… ఐయామ్ యన్ ఇండియన్… అని ఎంత గొంతెత్తినా సరిపోలేదు. భారతీయుడిగా రుజువు చేసుకోవడానికి గుండెలోంచి వచ్చే మాటలు తప్ప ఇంకేం ఉన్నాయి గుర్తులు అతని వద్ద! అతను ప్రాణాలతో బతకడానికి ఆ ప్రకటన సరిపోలేదు. ఆధార్ కార్డు, పాన్‌కార్డు, నివాస స్థల ధృవీకరణ పత్రమా! ఇవ్వేవీ నిరూపణకు ఆధారాలు కాకుండా పోయాయి. ఇరువై నాలుగేండ్ల ఏంజెల్ చక్మా ప్రాణాలూ నిలువునా పోయాయి. అతడు భారతదేశపు ఈశాన్య ప్రాంతం త్రిపుర రాష్ట్రానికి చెందినవాడు. ఉన్నత చదువుల కోసం తమ్ముడితో కలిసి ఉత్తరాఖండ్‌లోని డెహ్రడూన్‌కు వచ్చారు. అక్కడ వస్తువులు కొనుక్కోవడానికి ఒక షాపులోకి వెళ్లారు. అంతే! అక్కడ దేశభక్త పరివారమూక ఒకటి చక్మా ముఖంలోకి చూసింది. వాళ్లకు అనుమానమొచ్చింది. చక్మా కళ్లు, వాళ్లకు భారతీయుడివిలా కనపడలేదు. నేపాల్ నీది అన్నారు. చైనాయుడివీ అన్నారు. కాదు, నేను భారతీయుడిని అన్నాడు. నమ్మకం కుదరలేదు. ఈ మూక మెదళ్లలో చక్మా ఇండియన్‌గా రికార్డు కాలేదు. గొడవ పెంచారు. ఇనుపరాడ్లు, కర్రలు, కత్తులు తీశారు. తలప్తె కొట్టారు. రోడ్డుపై పడిపోయేదాకా దాడిచేశారు. పదహారు రోజులు ఆస్పత్రిలో ద్వేషానికి ప్రాణానికి మధ్య ఘర్షణ సాగింది. చివరకు ప్రాణాలు విడిచాడు. ద్వేషమే పై చేయిదయింది. ఇది నేటి దేశపుస్థితి. దేశీయుల దుస్థితి.
ఈశాన్య ప్రాంతవాసుల ముఖాలు చూసి, భారతీయులుగా లేరని అనుమానించి, జాతి విద్వేషమూకలు కొట్టి చంపుతుంటే,ఈ దేశం ఎంతటి అనాగరికుల చేతుల్లోకి పోతున్నదో అర్థమవుతున్నది. వాళ్ల ముఖాలు భారతీయులుగా కనపడేందుకు వాళ్లేమి చేయాలో ఇపుడెవరికీ అర్థం కాని విషయం. న్యాయాన్ని, చట్టాన్ని, పౌరసత్వాన్ని, దేశీయతను నిర్ణయించేది, తీర్పునిచ్చేది దేశంలోని సంఘ్ పరివార్ ప్రయివేటు మూకలా! ఈ దేశంవాడు ఎవడో, కానివాడు ఎవడో చెప్పడానికి వీళ్లెవరు! ఇది ఒక చిన్న గొడవకు సంబంధించిన హత్యకాదు. ఈ దేశం కొన్ని వందల సంవత్సరాలుగా కాపాడుకుంటూ వస్తున్న భిన్నత్వంలో ఏకత్వం అనే సూత్రాన్ని నిలువునా కూల్చేస్తున్న దుశ్చర్య ఇది. అనేక జాతుల, మతాల, ప్రాంతాల సమహారంగా ఉన్న భారతదేశపు విలువను, ఔన్నత్యాన్ని, అందాన్ని హత్యచేస్తున్న దుర్మార్గం. ఇంత దారుణం జరుగుతుంటే, దేశభక్తులమని తమకు తామే భుజకీర్తులు తలిగించుకునే సంఘపరివారులు, బీజేపీ నాయకులు, దేశానికి నాయకుడుగా ఉన్న ప్రధాని ఒక్కమాటా మాట్లాడరేమి! మౌనంగా ఎందుకున్నారు? ఏంజెల్ చక్మా ఎవరో తెలుసా! అతని తండ్రి సరిహద్దులలో కాపలా కాస్తూ ఈ దేశాన్ని కాపాడే ఒక సైనికుడు.
దేశ రక్షణ చేయగలిగాడు కానీ దేశంలోనే తన కుమారున్ని రక్షించుకోలేకపోయాడు. ఆ తల్లిదండ్రుల దు:ఖాన్ని ఎవరాపగలరు! ఈ దు:ఖం తల్లిదండ్రులదే కాదు, ఈశాన్యప్రాంత ప్రజలందరూ పడుతున్నారు. వాళ్లింకా ఇలా అడుగుతున్నారు. ‘మేము భారతీయులమని చాటడానికి ఏ గుర్తులు చూపించాలి? ఏమి ఇవ్వాలి మీకు? సర్టిఫికెట్లు కావాలా! మా నుదుటిమీద రాసుకుని తిరగాలా? ఏం చేయాలి? మా దేశంలో మేమెవరమో నిరూపించుకోవాలా! ఓ ఈశాన్య ప్రాంత ముఖ్య మంత్రులారా! నాయకులారా! ఎంతకాలం మౌనంగా ఉంటారు? అని శోకతప్త హృదయంతో ప్రశ్నిస్తున్నారు.
చక్మాపై దాడి జరిగిన తర్వాత, అతని సోదరుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేస్తే, అసలు ఫిర్యాదు తీసుకోవడానికి, ఎఫ్‌ఐఆర్ బుక్ చేయడానికే వెనుకాడారు. స్థానిక విద్యార్థి సంఘాలు, కుటుంబ సభ్యులు నిరసన చేపడితే కాని కేసు బుక్ చేయలేదంటే, అక్కడి డబులింజన్ సర్కార్ ఎవరిపక్షం వహిస్తున్నదీ, ఏ మూకలకు వంత పాడుతున్నది అనే విషయం అర్థమవుతున్నది. దాడి అనంతరం పదహారు రోజుల తర్వాత తీరిగ్గా, ఉత్తరాఖండ్ ముఖ్యమంత్రి థామీ చక్మా తండ్రికి ఫోన్‌చేసి చర్యలు తీసుకుంటామని నింపాదిగా మాట్లాడారు.
ఇందులోని డ్రామా ఏమంటే, ఫోన్ చేస్తున్న దృశ్యాన్ని ఎంచక్కా వీడియో తీయించి, ప్రజలకు చూపించేందుకు సోషల్ మీడియాలో పోస్టు చేయించాడు. ఇదీ వారి మొసలికన్నీరు. దాడి జరిగేటప్పుడు పోలీసులు కాస్త ముందుగా స్పందించి ఉంటే ఇంత ఘోరం జరిగేది కాదు. అంతేకాదు, పోలీసులు హత్యాప్రయత్న నేరం కింద మొదట కేసును రిజిస్టరు చేయకపోవటం, వారు ఏ పక్షమో స్పష్టపడుతున్నది. ఇది కేవలం ఈశాన్యప్రాంతవాసులు ఎదుర్కొంటున్న సమస్యనే కాదు. దేశమంతా ఎదుర్కొంటున్నది. ముఖ్యంగా గత పదకొండేండ్లుగా దేశ ప్రజల్లో విద్వేష ఆలోచనలు నింపుతున్న మతతత్వశక్తులు, ఇప్పుడీ అరాచకాలనూ ప్రోత్సహిస్తున్నారు. మణిపూర్‌లో జాతుల మధ్య చిచ్చును ఎగదోసి, మారణకాండ సృష్టించారు. మొన్న క్రిస్మస్ పండగనూ ద్వేషంతో నింపి గొడవలకు పూనుకున్నారు. ఇటీవల కేరళలో ఛత్తీస్‌గఢ్ నుండి వచ్చిన కూలీ రామ్ నారాయణ్‌ను కూడా నువ్వు బంగ్లాదేశ్ వాడివని కొట్టి చంపారు. ఇప్పుడు చక్మాను. ఎంజిల్ చక్మా తను ప్రాణాలు విడుస్తూ చెప్పిన మాటేమిటంటే, నేను చైనా కాదు. భారతీయున్ని అని. ఈ మాటలు మతతత్వ మూకలకు, జాతి విద్వేషకుల తలకెక్కుతాయా! అప్రమత్తమవ్వాల్సిన తరుణమిది.
నేను భారతీయుడిని!
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



