Monday, October 6, 2025
E-PAPER
Homeకరీంనగర్''నేనున్నా మీకోసం''

”నేనున్నా మీకోసం”

- Advertisement -

– ప్రజల ముందుకు వెలిచాల రాజేందర్ రావు
నవతెలంగాణ – కరీంనగర్

కరీంనగర్ లోక్ సభ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్‌ఛార్జ్ వెలిచాల రాజేందర్ రావు ప్రజల సమస్యల పరిష్కారానికి సరికొత్త మార్గాన్ని ఎంచుకున్నారు. ‘నేనున్నా మీకోసం’ అనే నినాదంతో ఆయన చేపట్టిన ఉదయం నడక (మార్నింగ్ వాక్) కార్యక్రమం ఆదివారం ప్రారంభమైంది. తీగలగుట్టపల్లిలో మార్నింగ్ వాక్‌లో పాల్గొన్న ఆయన, స్థానిక సమస్యలను స్వయంగా పరిశీలించి వాటి పరిష్కారానికి హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా, నగునూరు శివారులోని దుర్గామాత ఆలయానికి వెళ్లే రోడ్డు సమస్యపై రాజేందర్ రావు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఈ రోడ్డు మార్గం సరిగా లేకపోవడంతో రైతులు, స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆయన దృష్టికి తీసుకొచ్చారు. పొలాలకు వెళ్ళేందుకు, ప్రజలు రాకపోకలు సాగించేందుకు ఈ రోడ్డు లేకపోవడం వల్ల పడుతున్న కష్టాలను రైతులు వివరించారు.

దీనిపై వెంటనే స్పందించిన రాజేందర్ రావు, ఇప్పటికే ఆర్డీఓతో మాట్లాడినట్లు, త్వరలోనే సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. ఆయన కేవలం ఒక సమస్యతో ఆగకుండా, ఆరెపల్లి నుంచి రాణిపూర్ వరకు ఉన్న మరో రోడ్డు సమస్యను కూడా పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. ఈ సమస్య పరిష్కారానికి స్థానిక ప్రజలతో మాట్లాడి, వారిని ఒప్పించేందుకు తాను ముందుంటానని ఆయన తెలిపారు. ఈ రెండు రోడ్లు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే, దుర్గామాత టెంపుల్, రేకుర్తి, తీగలగుట్టపల్లె, ఆరెపల్లి వంటి ప్రాంతాలకు రాకపోకలు సులభతరం అవుతాయని రాజేందర్ రావు వివరించారు.

అధికారులతో సంప్రదింపులు, మంత్రి దృష్టికి సమస్యలు వెలిచాల రాజేందర్ రావు ఈ రోడ్డు సమస్యల పరిష్కారానికి అధికారులతో మాట్లాడటమే కాకుండా, ఈ విషయాన్ని మంత్రి పొన్నం ప్రభాకర్ దృష్టికి తీసుకెళ్లి వెంటనే చర్యలు తీసుకుంటానని స్పష్టం చేశారు. కరీంనగర్‌లో ఏ సమస్య ఉన్నా తన దృష్టికి తీసుకురావచ్చని, వాటిని పరిష్కరించడానికి అన్ని విధాలా కృషి చేస్తానని ఆయన ప్రజలకు హామీ ఇచ్చారు. ప్రజా సమస్యల పరిష్కారం కోసం ఈ విధంగా మార్నింగ్ వాక్ నిర్వహించడంపై స్థానిక రైతులు, ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు మూల రవీందర్ రెడ్డి, మూల ప్రభాకర్ రెడ్డి, భూమయ్య, చంద్రారెడ్డి, మూల రాజిరెడ్డి తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -