ప్రజల సొమ్ము దోచుకుంటామంటే ఊరుకోం
డీపీఆర్ లేకుండా ప్రజల ఇండ్లకు మార్కింగ్ ఎట్లా ఇస్తారు
బఫర్ జోన్ పేరుతో పేదలను తరిమికొడుతున్నారు
సీఎం రేవంత్‌రెడ్డి మాటల విలువ జీరో
3,300 ఎకరాల పేదల భూములపై కన్ను
కాంగ్రెస్‌కు కూల్చడం తప్పా నిర్మాణం తెలియదు
మూసీపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్‌లో బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్
నవతెలంగాణ – రంగారెడ్డి ప్రాంతీయ ప్రతినిధి
మూసీ సుందరీకరణకు, అభివృద్ధికి తాము ఏమాత్రం వ్యతిరేకం కాదని బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి లక్షల కోట్ల అవినీతి ప్రణాళికలకు వ్యతిరేకమని, కచ్చితంగా అవినీతిని అడ్డుకుంటామని తెలిపారు. శనివారం రంగారెడ్డి జిల్లా రాజేందర్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని హిమాయత్‌సాగర్ ప్రాంతంలో ‘మూసీ పునరుజ్జీవం-పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ వర్సెస్ పబ్లిక్ పాయింట్’ అనే కార్యక్రమాన్ని బీఆర్‌ఎస్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి బీఆర్‌ఎస్ రాజేందర్‌నగర్ ఇన్‌చార్జి పటోళ్ల కార్తీక్‌రెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భం గా కేటీఆర్ మాట్లాడారు.. పేదల భూముల విలువ ‘ జీరో ‘ అంటున్న సీఎం రేవంత్‌రెడ్డి మాటలకు విలువ లేదని అన్నారు. పేదల భూముల విలువ రూ. లక్షా 50 వేల కోట్లని, ఆ విలువైన భూములపై కన్నేసిన ముఖ్యమంత్రి .. మూసీ ప్రణాళికను తెరపైకి తెచ్చారని ఆరోపించారు.
‘రాష్ట్ర ప్రభుత్వం బఫర్ జోన్ పేరు చెప్పి ప్రజలను భయపెట్టి వారి ఇండ్లను కూలుస్తోంది. సీఎం రేవంత్ రెడ్డి సొంత ఇల్లు రెడ్డి కుంట బఫర్ జోన్‌లో ఉన్నది నిజం కాదా, దాని గురించి ఎందుకు మాట్లాడటం లేదు. సీఎం సోదరుడి ఇల్లు హైదరాబాద్‌లో బఫర్ జోన్‌లో ఉంది. మంత్రుల ఫామ్‌హౌస్‌లు, ఇండ్లు కూడా బఫర్ జోన్‌లో ఉన్నాయి. వాటిపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు’ అని కేటీఆర్ ప్రశ్నించారు. 20ఏండ్ల కింద కట్టుకున్న అపార్ట్‌మెంట్లను, ఇండ్లను కూలగొడతా అంటున్న ముఖ్యమంత్రి ఇప్పుడు మూసీ బఫర్ జోన్‌లో కడుతున్న రియల్ ఎస్టేట్ సంస్థల అపార్ట్‌మెంట్‌లను మాత్రం ముట్టుకోను అనడంలో అర్థం ఏంటనీ ప్రశ్నించారు.
ఒకటి, రెండు అపార్ట్‌మెంట్ వాసులకు ఇండ్లు కట్టించి తగిన స్థలం ఇస్తామని చెబుతున్న రేవంత్‌రెడ్డి, అదే సూత్రం అదే న్యాయం బాధితులందరికీ వర్తింపజేస్తారా అనే ప్రశ్నకు సమా ధానం చెప్పాలన్నారు. రేవంత్‌రెడ్డికి తమ కాంగ్రెస్ ప్రభుత్వమే తీసుకువచ్చిన 2013 భూసేకరణ చట్టం ప్రకారం ఇవ్వాల్సిన పరిహారం ఎంతో అనే అంశంపై అవగాహన కూడా లేదన్నారు. గతంలో బీఆర్‌ఎస్ ప్రభుత్వం కేవలం రూ.16వేల కోట్లతో ఒక్క ఇల్లు కూడా కూల్చకుండా మూసీని అభివృద్ధి చేసే ప్రణాళికలు సిద్ధం చేసిందన్నారు. ఎలాంటి డీటెయిల్స్ ప్లానింగ్ రిపోర్టు (డీపీఆర్) లేకుండా సోషల్ ఇంఫాక్ట్ స్టడీ, ఎన్విరాన్మెంటల్ ఇంపాక్ట్ స్టడీ వంటి నివేదికలు, ప్రజలతో ఎలాంటి చర్చలు లేకుండా ఇండ్లను కూలగొడతామని భయాందోళనకు గురిచేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
గత ప్రభుత్వంలో కేసీఆర్ పీపీటీ ప్రజెంటేషన్ ద్వారా నదుల నీటి వినియోగం ప్రాజెక్టుల నిర్మాణం గురించి వివరిస్తే, రేవంత్‌రెడ్డి పీపీటీ ద్వారా ఎవరి ఇల్లు ఎట్లా కూలగొట్టాలి, ఎవరి భూములు ఎట్లా లాక్కోవాలి.. అనే విధ్వంసం గురించి పీపీటీ ఇచ్చార న్నారు. వందల కిలోమీటర్ల నమోమి గంగాకి ఖర్చు కేవలం రూ.42 వేల కోట్లు అయితే, 55 కిలోమీటర్ల మూసీకి రూ.1.50 లక్షల కోట్లు ఎందుకు ఖర్చవుతుందనే ప్రశ్నకు రేవంత్‌రెడ్డి సమాధానం చెప్పాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు వివేకానందగౌడ్, సబితా ఇంద్రారెడ్డి, లక్ష్మారెడ్డి, ఎమ్మెల్సీ శంబీపూర్ రాజు, శాసనమండలి మాజీ చైర్మెన్ స్వామి గౌడ్, పార్టీ నేత ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్, పార్టీ నేతలు, తదితరులు పాల్గొన్నారు.



