– రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజలకు సేవ చేస్తా.. :ఎమ్మెల్యే మల్లారెడ్డి
నవతెలంగాణ- మేడ్చల్ : మాజీ మంత్రి, మేడ్చల్ ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 73 సంవత్సరాల వయస్సులో బీజేపీ, టీడీపీ.. వేరే ఇతర పార్టీల వైపు చూసే అవసరం తనకు లేదన్నారు. అసలు రాజకీయమే వద్దనుకుంటున్నానని హాట్ కామెంట్స్ చేశారు. శనివారం రాఖీ పౌర్ణమి సందర్భంగా హైదరాబాద్ బోయిన్‌పల్లిలోని తన క్యాంప్ కార్యాలయానికి వచ్చిన నియోజకవర్గ మహిళలు పలువురు ఆయనకు రాఖీలు కట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మీడియాతో మాట్లాడుతూ.. తాను ఇప్పుడు బీఆర్‌ఎస్‌లో ఉన్నానని, ఏ పార్టీ వైపు చూసే పరిస్థితి లేదన్నారు. ఎంపీగా, మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్యేగా కొనసాగుతున్నానని, మరో మూడు సంవత్సరాలు తన పదవీకాలం ఉందన్నారు. రాజకీయాలకు దూరంగా ఉండి ప్రజలకు సేవ చేస్తానని చెప్పారు. మరిన్ని కాలేజీలు, యూనివర్సిటీలు నడిపిద్దామనుకుంటున్నానని తెలిపారు. గతంలో రాఖీ పౌర్ణమి రోజే తన తొలి ఇంజినీరింగ్ కళాశాలను ప్రారంభించినట్టు గుర్తు చేశారు. త్వరలోనే ఉత్తరప్రదేశ్ వెళ్లి అక్కడి ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ను కలిసి 50 ఎకరాల్లో హెల్త్ సిటీ ప్రారంభిస్తానని తెలిపారు. అంతేకాకుండా బీహార్, పశ్చిమబెంగాల్, వైజాగ్ ఇలా దేశంలోని ముఖ్య పట్టణాల్లో యూనివర్సిటీలు ప్రారంభించేందుకు ప్రణాళికలు రూపొందించినట్టు చెప్పారు.
ఏ పార్టీ వైపు చూసే అవసరం నాకు లేదు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES