– హాస్టల్‌లో విద్యార్థిని ఆత్మహత్య
నవతెలంగాణ-నల్లగొండటౌన్
తనకు ఇప్పుడే పెండ్లి చేసుకోవడం ఇష్టం లేదని.. ఇంకా చదువుకుంటానని చెప్పినా తల్లిదండ్రులు పెండ్లి సంబంధాలు చూస్తుండటంతో మనస్తాపానికి గురైన విద్యార్థిని ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన నల్లగొండ జిల్లా కేంద్రంలో మంగళవారం జరిగింది. నల్లగొండ టూటౌన్ ఎస్‌ఐ సైదులు తెలిపిన వివరాల ప్రకారం.. మర్రిగూడ మండలం కొట్టాల గ్రామానికి చెందిన బొర్ర శృతి(20) నల్లగొండ పట్టణంలోని రవీంద్రనగర్ బీసీ గర్ల్స్ హాస్టల్‌లో ఉంటూ ఎన్జీ కళాశాలలో బీకాం ఫైనలియర్ చదువుతుండేది. ఆమెకు పెండ్లి చేయాలని తల్లిదండ్రులు సంబంధాలు చూడటం మొదలుపెట్టారు. అయితే, తనకు ఇప్పుడే పెండ్లి వద్దని.. ఇంకా చదువుకోవాలని ఉందని ఆమె తల్లితో చెప్పింది. తల్లిదండ్రులు మాత్రం వివాహం చేయాలని నిర్ణయించుకున్నారు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన శృతి మంగళవారం హాస్టల్ బాత్రూమ్‌లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఆమె ఎంతసేపైనా బయటకు రాకపోవడంతో తోటి విద్యార్థినులు పిలిచారు. అయినా స్పందన లేకపోవడంతో బాత్రూం డోర్‌ను పగులగొట్టి.. ఉరేసుకున్న శృతిని వెంటనే ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే విద్యార్థిని మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతురాలి కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
పెండ్లి ఇష్టం లేదని..
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



