: కాంగ్రెస్ నేత కేసీ వేణుగోపాల్‌పై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆదివారం కేరళలోని అలెప్పీలో కేసీ వేణుగోపాల్ రచించిన పుస్తకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొని మాట్లాడారు. కేసీ వేణుగోపాల్ ఎల్లప్పుడూ పేదల పట్ల, అణగారిన వర్గాల కోసం పోరాడుతూనే ఉన్నారని ప్రశంసించారు. అణిచివేతకు, అన్యాయానికి గురవుతున్న బాధితుల తరఫున గొంతుకగా నిలుస్తున్నారని అన్నారు.
ఆయన కేరళ రాష్ట్రానికే కాకుండా యావత్ దేశంలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, మైనారిటీ, ప్రత్యేకించి మహిళలు, పిల్లల న్యాయం కోసం, వారి అభ్యున్నతి కోసం నిరంతరం పాటుపడుతున్నారని చెప్పారు. 2006లో వేణుగోపాల్ ప్రారంభించిన పొంథువల్ (ఎంపీ) మెరిట్ అవార్డులకు దేశంలోనే చాలా ప్రత్యేకత ఉంది. 10వ తరగతి, 12వ తరగతి విద్యార్థినీ విద్యార్థుల్లో అత్యుత్తమ ప్రతిభను గుర్తించి వారిని ప్రోత్సహించడానికి, వారిలో ఒక స్ఫూర్తిని నింపడానికి ఈ మెరిట్ అవార్డులు ఎంతగానో దోహదపడుతున్నాయని అన్నారు. ‘ఈ ఏడాది వందశాతం ఫలితాలను సాధించిన 150 పాఠశాలల్లో దాదాపు 3,500 లకుపైగా ప్రతిభ కలిగిన విద్యార్థులకు అవార్డులు అందిస్తున్నారు. దేశంలో విద్యకు, కేరళ రాష్ట్రానికి బలమైన సంబంధం ఉంది.
దేశంలో వందశాతం అక్షరాస్యత సాధించిన తొలి రాష్ట్రం కేరళ. ఈ రాష్ట్రంలో అమలు చేస్తున్న వయోజన విద్యా కార్యక్రమం అన్ని రాష్ట్రాలకు ఆదర్శంగా నిలుస్తోంది. కేరళ రాష్ట్రంలో విద్యా రంగానికి ఎంతో ప్రాధాన్యత ఇస్తున్నారు. 10వ, 12వ తరగతి తర్వాత.. సున్నా శాతం డ్రాప్ అవుట్స్ సాధించడమంటే అందులో ఆశ్చర్యమేమీ ఉండదు. విద్య అనేది మనకు లభించిన ఒక గొప్ప బహుమతి. విద్య అన్నది ఒక గొప్ప ఆయుధం. అదే అందరికీ గొప్ప శక్తి.. అని నేను చాలా బలంగా విశ్వసిస్తా. అలాంటి విద్యకు ప్రాధాన్యతనిస్తున్న దైవ భూమి కేరళ. అందుకే అందరితో పాటు నాకు కూడా కేరళను చూస్తే అసూయగా ఉంది’ అని రేవంత్ రెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు.