నవతెలంగాణ – హైదరాబాద్: పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కథానాయకుడిగా ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిన ‘హరిహర వీరమల్లు’ చిత్రం నుంచి తాను ఎందుకు తప్పుకోవాల్సి వచ్చిందో ప్రముఖ దర్శకుడు క్రిష్ జాగర్లమూడి మరోసారి స్పష్టత ఇచ్చారు. కొన్ని వ్యక్తిగత సమస్యలతో పాటు, కోవిడ్ మహమ్మారి కారణంగా షూటింగ్ షెడ్యూళ్లలో వచ్చిన మార్పుల వల్లే ఈ ప్రాజెక్ట్ నుంచి బయటకు రావాల్సి వచ్చిందని ఆయన వెల్లడించారు. పవన్ కల్యాణ్ అంటే తనకు ఎంతో అభిమానమని, నిర్మాత ఏ.ఎం.రత్నంపై అపారమైన గౌరవం ఉందని ఆయన పేర్కొన్నారు. తాను వైదొలిగిన తర్వాత ఈ చిత్రాన్ని జ్యోతికృష్ణ దర్శకత్వంలో పూర్తి చేశారని తెలిపారు. అనుష్క శెట్టి, విక్రమ్ ప్రభు ప్రధాన పాత్రల్లో తాను దర్శకత్వం వహించిన ‘ఘాటి’ చిత్రం ప్రమోషన్లలో భాగంగా క్రిష్ మీడియాతో మాట్లాడారు. సెప్టెంబర్ 5న విడుదల కానున్న ఈ సినిమా ఒక అగ్నిపర్వతం లాంటిదని, దానిని ప్రేక్షకులకు అందించడానికి ఎంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నానని ఆయన ధీమా వ్యక్తం చేశారు. చింతకింది శ్రీనివాసరావు అందించిన కథతో ఈ చిత్రం తెరకెక్కింది.
ఈ సందర్భంగా ‘ఘాటి’ విశేషాలను పంచుకున్నారు. గంజాయి మాఫియా నేపథ్యంలో సాగే ఈ కథను ఒక మహిళ దృక్కోణంలో చెబితేనే భావోద్వేగాలు మరింత బలంగా పండుతాయని భావించి అనుష్కను ఎంచుకున్నట్లు తెలిపారు. ఒకవేళ ఇదే చిత్రాన్ని ఒక స్టార్ హీరోతో తీసి ఉంటే అందులో కొత్తదనం ఉండేది కాదని, అనుష్క స్టార్‌డమ్, ఆమె గ్రేస్ సినిమా స్థాయిని పెంచుతాయని అభిప్రాయపడ్డారు. విష్ణుదీప్ పాత్రకు జగపతిబాబు వైఖరి సరిగ్గా సరిపోతుందని భావించి ఆయనను తీసుకున్నట్లు చెప్పారు. సినిమా ప్రమోషన్లలో అనుష్క పాల్గొనకపోవడం పూర్తిగా ఆమె వ్యక్తిగత నిర్ణయమని, అయితే ఆమె నటన ఈ చిత్రాన్ని తప్పకుండా నిలబెడుతుందని క్రిష్ విశ్వాసం వ్యక్తం చేశారు.