Monday, January 12, 2026
E-PAPER
Homeజాతీయం'సర్‌'తో ఐ-ప్యాక్‌ సంబంధాలు

‘సర్‌’తో ఐ-ప్యాక్‌ సంబంధాలు

- Advertisement -

అది తృణమూల్‌ కోసం పనిచేస్తోంది : సీపీఐ(ఎం) ఆరోపణ
కోల్‌కతా :
పశ్చిమ బెంగాల్‌లో జరుగుతున్న ‘సర్‌’ ప్రక్రియపై సీపీఐ (ఎం) నిరసన వ్యక్తం చేసింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల అధికారికి లేఖ అందజేసింది. సర్‌ ప్రక్రియలో అనేక అవకతవకలు చోటు చేసుకున్నాయని సీపీఐ (ఎం) రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు, మాజీ ఎంపీ సమిక్‌ లాహిరి ఆ లేఖలో ఆరోపించారు. ఓటర్లకు సంబంధించిన సమాచారాన్ని ఎలక్టొరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఈఆర్‌ఓలు), అసిస్టెంట్‌ ఎలక్టొరల్‌ రిజిస్ట్రేషన్‌ అధికారులు (ఏఈఆర్‌ఓలు) నిర్వహించడంపై ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఓటర్ల నుంచి బీఎల్‌ఓలు తీసుకున్న పత్రాలను ప్రైవేట్‌ కాంట్రాక్ట్‌ సిబ్బంది అప్‌లోడ్‌ చేస్తున్నారని, వారికి అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ తరఫున పనిచేస్తున్న ఐ-ప్యాక్‌ సంస్థతో సంబంధం ఉన్నదని తెలిపారు.

‘ఓటరు జాబితాలను తయారు చేసే పనిని ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేస్తున్న సంస్థ సిబ్బందికి అప్పగించడం అంటే నేరుగా పరస్పర విరుద్ధ ప్రయోజనాన్ని కలిగించడమే అవుతుంది. రాజ్యాంగంలోని ఆర్టికల్‌ 324ను అది ఉల్లంఘిస్తోంది. ఎన్నికల జాబితాపై నియంత్రణ పూర్తిగా స్వతంత్ర కమిషన్‌ చేతిలోనే ఉండాలని ఆ ఆర్టికల్‌ నిర్దేశిస్తోంది. పక్షపాత వైఖరితో పనిచేసే సిబ్బంది డేటా రూమ్‌లో ఉండడం వల్ల అధికార పార్టీ కీలక ఓటరు డేటాను అనధికారికంగా చేజిక్కించుకోవచ్చు. తద్వారా ఓటరు జాబితాలో చేర్పులు, తొలగింపులకు పాల్పడవచ్చు’ అని లాహిరి తన లేఖలో వివరించారు.

ఈఆర్‌ఓ కార్యాలయాలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్‌ సిబ్బంది సమాచారాన్ని బహిర్గతం చేయాలని, ఎలక్టొరల్‌ పత్రాల అప్‌లోడింగ్‌కు ఉపయోగించిన ఐపీ అడ్రస్‌లను పరిశీలించాలని, ఓటరు డేటా వ్యవహారాలు చేస్తున్న వారికి పోలీస్‌ వెరిఫికేషన్‌ జరపాలని సీపీఐ (ఎం) డిమాండ్‌ చేస్తోంది. దక్షిణ 24 పరగణాలు…ముఖ్యంగా డైమండ్‌ హార్బర్‌, ఫాల్టా శాసనసభ స్థానాలలో ఎన్నికల కమిషన్‌ దారుణంగా విఫలమైందని ఆరోపించింది. చనిపోయిన వేలాది మంది పేర్లు ఇప్పటికీ ఓటరు జాబితాలలో ఉన్నాయని సీపీఐ (ఎం) గుర్తు చేసింది. కాగా ఐ-ప్యాక్‌ కార్యాలయాలపై ఈడీ దాడులు చేయడాన్ని నిరసిస్తూ తృణమూల్‌ కాంగ్రెస్‌ అధినేత, రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రదర్శన నిర్వహించిన విషయం తెలిసిందే. ఈడీ, మమత ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ సుప్రీంకోర్టును ఆశ్రయించారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -