కన్నడ సూపర్ స్టార్ శివరాజ్ కుమార్
పాల్వంచలో ఘనంగా గుమ్మడి నర్సయ్య సినిమా ప్రారంభం
నవతెలంగాణ-పాల్వంచ
ప్రజా నాయకుడు.. మంచి మనిషి గుమ్మడి నరసయ్యలో మా నాన్నను చూశానని కన్నడ సూపర్ స్టార్, గుమ్మడి నరసయ్య సినిమా కథానాయకుడు శివరాజ్ కుమార్ అన్నారు. సినీ నిర్మాత శ్యామల గోపాలన్ ఎడ్యుకేషనల్ సొసైటీ చైర్మెన్ నల్ల సురేష్ రెడ్డి ఆధ్వర్యంలో ప్రవల్లిక ఆర్ట్స్ క్రియేషన్ బ్యానర్‌పై గుమ్మడి నరసయ్య సినిమా ప్రారంభోత్సవం శనివారం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలంలోని హెచ్ కన్వెన్షన్ హాల్లో వైభవంగా జరిగింది. ఈ కార్యక్రమంలో శివ రాజ్ కుమార్ ఐదుసార్లు ఎమ్మెల్యేగా గెలిచిన గుమ్మడి నరసయ్య చేతుల మీదగా అంబేద్కర్‌కు పూలమాల వేశారు. అనంతరం పట్టణంలో భారీ ర్యాలీతో పెద్దమ్మతల్లి గుడికి చేరుకొని నల్ల సురేష్‌రెడ్డి, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డితో కలిసి పూజలు చేశారు. అలాగే, నటుడు శివరాజ్‌కుమార్ గుమ్మడి నరసయ్య స్వగ్రామంలో ఆయన ఇంటికి వెళ్లి వచ్చారు. ఆ ఇంటిని చూస్తుంటే చిన్నప్పటి తన ఇంటిని చూస్తున్నట్టే ఉందని సంతోషం వ్యక్తం చేశారు.
సినిమా ప్రారంభోత్సవం కార్యక్రమంలో శివరాజ్ కుమార్ సతీమణి గీత క్లాప్ కొట్టగా.. మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి కెమెరా స్విచ్ ఆన్ చేశారు. సినీ షూటింగ్ షెడ్యూలు త్వరలో ప్రకటిస్తామని పాల్వంచ కిన్నెరసాని, ములుగు పలు ప్రాంతాల్లో ప్రారంభం కానున్నదని చెప్పారు. ఈ సందర్భంగా శివరాజ్ కుమార్ మాట్లాడుతూ.. ఒక మంచి మనిషి చరిత్రలో తాను నటించడం అదృష్టంగా భావిస్తున్నానని చెప్పారు. అలుపెరుగని నాయకుడిగా ప్రజాసేవలో గుమ్మడి నరసయ్య తీరు ఆదర్శనీయమని, ఆయనలో మా నాన్నను చూసుకుంటున్నానని చెప్పారు.మాజీ ఎమ్మెల్యే గుమ్మడి నరసయ్య మాట్లాడుతూ.. నా జీవిత చరిత్రను సినిమా తీయడానికి ముందు వచ్చిన నల్ల సురేష్‌రెడ్డికి, సినిమా బృందానికి, కథానాయకుడు శివరాజ్ కుమార్‌కి కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు, జాగీతి అధ్యక్షులు కల్వకుంట్ల కవిత మాట్లాడారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే జారే ఆదినారాయణ, పాయం వెంకటేశ్వర్లు, గుమ్మడి నరసయ్య కుమార్తె, సీపీఐ జిల్లా అధ్యక్షులు సాబీర్‌పాషా, కోనేరు చిన్ని, పోటు రంగారావు, కాంగ్రెస్ పట్టణ అధ్యక్షులు రంగారావు తదితరులు పాల్గొన్నారు.



