Saturday, December 13, 2025
E-PAPER
Homeజాతీయంమీరన్నట్టే సెట్‌చేశా..

మీరన్నట్టే సెట్‌చేశా..

- Advertisement -

రష్యా చమురు వాణిజ్య చర్చల నేపథ్యంలో ట్రంప్‌-మోడీ టెలిఫోన్‌ చర్చలు

న్యూఢిల్లీ : రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్‌ పుతిన్‌ వారం రోజుల క్రితం భారత్‌లో పర్యటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్‌ ట్రంప్‌, ప్రధాని నరేంద్ర మోడీ మధ్య గురువారం జరిగిన టెలిఫోన్‌ సంభాషణ ప్రాధాన్యత సంతరించుకుంది. ట్రంప్‌ హెచ్చరికల తర్వాత రష్యా నుంచి భారత్‌ చమురు దిగుమతులను తగ్గించుకుంది. మరోవైపు ద్వైపాక్షిక ఒప్పందంపై అమెరికా వాణిజ్య ప్రతినిధి బృందం మన దేశంలో చర్చలు కొనసాగిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో ట్రంప్‌, మోడీ మధ్య టెలిఫోన్‌ సంభాషణ సాగింది. చర్చలు స్నేహపూర్వక, ఆసక్తికర వాతావరణంలో జరిగాయని మోడీ తెలిపారు. ప్రాంతీయ, అంతర్జాతీయ పరిణామాలపై పరస్పరం అభిప్రాయాలు పంచుకున్నామని ఆయన సామాజిక మాధ్యమ వేదిక ఎక్స్‌లో వివరించారు.

అయితే అమెరికా అధ్యక్ష భవనం నుంచి కానీ, ట్రంప్‌ నుంచి కానీ ఇప్పటి వరకూ ఎలాంటి ప్రకటన వెలువడలేదు. అంతకుముందు మోడీ, ట్రంప్‌ మధ్య అక్టోబర్‌ 9వ తేదీన చర్చలు జరిగాయి. గాజాలో శాంతి స్థాపన కోసం ట్రంప్‌ చేస్తున్న ప్రయత్నాలను మోడీ అభినందించారు. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు కూడా ఈ సందర్భంగా ప్రస్తావనకు వచ్చాయి. ఆ తర్వాత కొద్ది రోజులకే ట్రంప్‌ చేసిన ప్రకటన భారత్‌లో రాజకీయ దుమారాన్ని రేపింది. రష్యా నుంచి ముడి చమురు కొనుగోలును తగ్గిస్తామని మోడీ తనకు హామీ ఇచ్చారని ట్రంప్‌ చెప్పారు. దీనిపై విదేశాంగ శాఖ ఆచితూచి స్పందించింది. తన ప్రకటనలో ఎక్కడా ట్రంప్‌ పేరును తీసుకురాకుండా ఇంధన విధానంలో భారత్‌ తన సార్వభౌమత్వ వైఖరిని కొనసాగిస్తుందని తెలిపింది.

రష్యా చమురు కొనుగోలును పెంచుతున్న ‘నయారా’
రష్యాతో ఇంధన సంబంధాలు కొనసాగిస్తున్నందుకు ప్రతిగా ట్రంప్‌ ప్రభుత్వం భారతీయ వస్తువులపై దిగుమతి సుంకాన్ని ఏకంగా ఇరవై ఐదు నుంచి యాభై శాతానికి పెంచేసింది. ముడి చమురును అమ్ముతున్నందుకు భారత్‌ నుంచి తీసుకుంటున్న సొమ్మును ఉక్రెయిన్‌ యుద్ధంలో రష్యా ఖర్చు చేస్తోందని అమెరికా ఆరోపిస్తోంది. అయితే ఈ ఆరోపణను భారత్‌ తోసిపుచ్చింది. రష్యాతో యూరప్‌కు వాణిజ్య సంబంధాలు ఉన్నాయని గుర్తు చేస్తూ అమెరికా ద్వంద్వ ప్రమాణాలు పాటిస్తోందని విమర్శించింది. భారత్‌కు ఎలాంటి అంతరాయం లేకుండా చమురును సరఫరా చేస్తామని మన దేశంలో పర్యటించిన సందర్భంగా పుతిన్‌ హామీ ఇచ్చారు. ఏదేమైనా ట్రంప్‌ హెచ్చరికలను దృష్టిలో పెట్టుకొని భారత్‌లోని ప్రభుత్వ రంగ చమురు సంస్థలు, ప్రైవేటు సంస్థలు రష్యా నుంచి కొనుగోలును తగ్గించాయి.

అయితే అదే సమయంలో రోస్‌నెఫ్ట్‌ యాజ మాన్యంలోని నయారా ఎనర్జీ సంస్థ రష్యా ముడి చమురు కొనుగోలును పెంచింది. ఈ సంస్థ ఇప్పటికే యూరోపియన్‌ యూని యన్‌ ఆంక్షలను ఎదుర్కొంటోంది. నయా రాకు చెందిన వదినార్‌ రిఫైనరీ నవంబరులో రష్యా నుంచి రోజుకు 4,31,000 బ్యారల్స్‌, డిసెంబరులో 6,58,000 బ్యారల్స్‌ కొనుగోలు చేసింది. ఈ రిఫైనరీ రోజువారీ సామర్ధ్యం 4,05,000 బ్యారల్స్‌ మాత్రమే. అంటే నయారా తన ముడి చమురు నిల్వలను పెంచుకుంటోందని దీనిని బట్టి అర్థమవుతోంది. రష్యా నుంచి సరఫరాలను తగ్గించుకున్న భారతీయ రిఫైనరీలు మధ్యప్రాచ్యం, లాటిన్‌ అమెరికా, పశ్చిమ ఆఫ్రికా, కెనడా, అమెరికా నుంచి సేకరణను పెంచాయి. అమెరికా నుంచి అక్టోబరులో రోజుకు 5,68,000 బ్యారల్స్‌ ముడి చమురు సరఫరా జరిగింది. 2021 మార్చి తర్వాత ఈ స్థాయిలో అమెరికా చమురు సరఫరా జరగడం ఇదే మొదటిసారి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -