Saturday, December 13, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంగ్రామానికి అంబులెన్స్‌ ఇప్పిస్తా.. గెలిపించండి

గ్రామానికి అంబులెన్స్‌ ఇప్పిస్తా.. గెలిపించండి

- Advertisement -

హామీలు గుప్పిస్తున్న సర్పంచ్‌ అభ్యర్థి ముంగే శ్రీకాంత్‌ రెడ్డి
సంగారెడ్డి జిల్లా గొర్రెకర్‌ గ్రామంలో వినూత్న ప్రచారం


నవతెలంగాణ-వట్‌పల్లి
‘గ్రామానికి అంబులెన్స్‌ ఇప్పిస్తా.. సర్పంచ్‌గా గెలిపించండి..’ అంటూ సంగారెడ్డి జిల్లా వట్‌పల్లి మండలం గొర్రెకల్‌ గ్రామ సర్పంచ్‌ అభ్యర్థి ముంగే శ్రీకాంత్‌ రెడ్డి అన్నారు. మండలంలో రెండో విడతలో గ్రామపంచాయతీలకు జరుగుతున్న ఎన్నికల ప్రచారంలో అభ్యర్థులు గ్రామాల అభివృద్ధికి హామీల వరాలు కురిపిస్తున్నారు. ఈనెల 14న పోలింగ్‌ జరగనున్న నేపథ్యంలో శుక్రవారం అభ్యర్థులు ప్రచారానికి ముగింపు పలికారు. ఆఖరి రోజున తామంటే తామని ఓటర్లను ఆకట్టుకునే పనిలో ప్రచారాన్ని ముమ్మరం చేశారు. గొర్రెకల్‌ గ్రామపంచాయతీ సర్పంచ్‌ స్థానానికి ముగ్గురు అభ్యర్థులు బరిలో నిలవగా.. ఎవరికి వారు గ్రామ అభివృద్ధిపై హామీలు గుప్పిస్తూ ప్రచారాన్ని కొనసాగించారు. అందులో కాంగ్రెస్‌ రెబల్‌ అభ్యర్థి ముంగే శ్రీకాంత్‌ రెడ్డి తనదైన శైలిలో వినూత్నంగా ప్రచారం చేశారు.

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ‘మా అన్న రవీందర్‌ రెడ్డి ఆశీస్సులతో ఆయన ఆశయాన్ని నెరవేర్చడానికి మీ ముందుకు వస్తున్నాను. సర్పంచ్‌ అభ్యర్థిగా గెలిపించినట్లయితే మండల కేంద్రంలోని వట్‌పల్లిలో గొర్రెకల్‌ శివారుని సరిహద్దుగా గుర్తించి గొర్రెక్కల పరిధిలోకి తెచ్చే విధంగా పోరాడుతాను. గ్రామానికి అత్యవసర వైద్యం కొరకు అంబులెన్స్‌ను ఇప్పిస్తాను. పేదింటి ఆడపడుచుల వివాహాలకు పెండ్లి కానుకగా రూ.21 వేలు, పేద విద్యార్థులు సివిల్స్‌కు ప్రిపేర్‌ అయ్యేందుకు ఉచితంగా స్టడీ మెటీరియల్‌ను ఇస్తాను. అంతేకాకుండా ఆరు నెలలకు ఒకసారి ఉచిత ఆరోగ్య క్యాంపు, నిరుద్యోగులకు జాబ్‌ మేళా నిర్వహించి ప్రయివేటు కంపెనీల్లో ఉద్యోగాలు కల్పిస్తాను. గ్రామంలోని అసైన్డ్‌ భూమిని గుర్తించి కబ్జాదారుల నుంచి విడిపించి గ్రామాభివృద్ధికి తోడ్పాటు అందిస్తాను.’ అంటూ హామీలు కురిపిస్తూ ఇంటింటి ప్రచారాన్ని నిర్వహిస్తున్నారు. కాగా, ఆదివారం జరిగే ఎన్నికల్లో వీరి భవితవ్యం తేలనుంది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -