హౌంగార్డుల స్థాపక దినోత్సవంలో డీజీపీ శివధర్‌రెడ్డి ప్రకటన
నవతెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
రాష్ట్ర పోలీసు శాఖలో కీలక పాత్రను పోషిస్తున్న హౌంగార్డులకు త్వరలోనే శుభవార్త చెబుతానని డీజీపీ బత్తుల శివధర్‌రెడ్డి ప్రకటించారు. శనివారం హౌంగార్డుల స్థాపక దినోత్సవాన్ని పురస్కరించుకొని డీజీపీ కార్యాలయంలో జరిగిన ప్రత్యేక సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. ఈ సందర్భంగా సీనియర్ హౌంగార్డుల చేత కేకును ఆయన కట్ చేయించారు. రాష్ట్ర పోలీసు శాఖలో నేరాల అదుపు శాంతి భద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, ప్రకృతి వైపరీత్యాలలో ప్రజలను రక్షించడం తదితర విధులను నిర్వర్తిస్తూ హౌంగార్డులు చేస్తున్న సేవ ఎనలేనిదని శివధర్‌రెడ్డి కొనియాడారు. వారి సేవలను గుర్తించి ఇచ్చే ప్రతిరోజూ పారితోషకాన్ని రూ.900 నుంచి రూ.వెయ్యికి పెంచడం జరిగిందన్నారు.
అలాగే హెచ్‌డీఎఫ్‌సీ, యాక్సిస్ బ్యాంకులలో ఖాతాలున్న హౌంగార్డులలో ఎవరైనా విధి నిర్వహణలో మరణిస్తే వారికి రూ.32 లక్షల నష్ట పరిహారాన్ని ఆ బ్యాంకులు చెల్లిస్తున్నాయని తెలిపారు. అదే సమయంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా రూ.5 లక్షలు నష్టపరిహారాన్ని చెల్లిస్తుందని చెప్పారు. వారి ఆరోగ్య పరిస్థితులను మెరుగుపర్చడానికి తగిన ఆలోచనలు చేస్తున్నామనీ, ముఖ్యంగా ఆరోగ్యశ్రీ పథకాన్ని హౌంగార్డులకు వర్తింపజేసే ప్రతిపాదన ఉందన్నారు. మరోవైపు హౌంగార్డులకు డబుల్ బెడ్రూమ్ స్కీం కూడా వర్తింపజేసే అంశాన్ని ప్రభుత్వం నిశితంగా పరిశీలిస్తున్నదనీ, వీటిపై త్వరలోనే సానుకూల స్పందన వచ్చే అవకాశమున్నదని డీజీపీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర శాంతి భద్రతల విభాగం అదనపు డీజీ మహేశ్ భగవత్, హౌంగార్డుల విభాగం అదనపు డీజీ స్వాతి లక్రా, సీఐడీ అదనపు డీజీ చారుసిన్హా, ప్రొవిజన్స్ అండ్ లాజిస్టిక్స్ ఐజీ రమేశ్‌తో పాటు పలువురు ఉన్నతాధికారులు పాల్గొన్నారు.
మీకు త్వరలోనే శుభవార్త చెబుతా
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



