మారంరెడ్డి నాగేశ్వరమ్మ… అక్షరం సమాజాన్ని చైతన్య పరచగలదని బలంగా నమ్మిన టీచర్. తెలుగు ఉపాధ్యాయురాలిగా మాతృభాషాభివృద్ధికి తన వంతు కృషి చేస్తున్నాను. తాను పని చేస్తున్న పాఠశాలల్లో విద్యార్థులను రచయితలుగా తీర్చిదిద్దుతున్నారు. అనునిత్యం పిల్లల్ని చదువులో ప్రోత్సహిస్తూ వారిని సమాజ మార్పులో భాగస్వాములను చేసేందుకు ప్రయత్నిస్తున్న ఆ ఆదర్శ ఉపాధ్యాయురాలి పరిచయం నేటి మానవిలో…
1977లో నంద్యాల జిల్లాలోని ఉయ్యాలవాడ మండలంలోని ఇంజేడు గ్రామంలో పుట్టాను. అమ్మ పుల్లమ్మ, నాన్న మారంరెడ్డి లక్ష్మిరెడ్డి. నాన్నమ్మ, తాతయ్య, అమ్మ, నాన్న, అన్న, అక్కల మధ్య నా బాల్యం హాయిగానే గడిచిపోయింది. ప్రాథమిక విద్య ఇంజేడులోని ప్రభుత్వ పాఠశాలలో పూర్తిచేశాను. ఇంటికొచ్చాక అక్కలతో, ఇరుగు పొరుగు పిల్లలతో కాసేపు ఆడుకునేదాన్ని. అప్పట్లో టి.వి.లు, సెల్ఫోన్లు లేవు. రేడియో మాత్రమే ఉండేది. రాత్రి అమ్మ దగ్గర కథలు చెప్పించుకొని వినేదాన్ని. హైస్కూల్ విద్య చదవాలంటే మా ఊరికి మూడు కిలో మీటర్లు దూరంలో ఉండే ఉయ్యాలవాడ వెళ్లాలి. అలా ఊళ్లోని ఆడపిల్లంతా కలిసి సరదాగా నడుచుకుంటూ, కథలు చెప్పుకుంటూ వెళ్లేవాళ్లం.
పెండ్లి తర్వాత…
6 నుండి10 వరకు తెలుగు బోధించే ఉపాధ్యాయులు పాఠాలు మాకు చక్కగా చెప్పేవారు. వారివల్లనే తెలుగు పట్ల ఆసక్తి కలిగింది. మా పాఠశాలలో 10వ తరగతిలో 40 మంది మగపిల్లలు ఉంటే 7గురు మాత్రమే అమ్మాయిలం. మా ఏడుగురిలో 10వ తరగతి ఫైనల్ పరీక్షల్లో నేనొక్కదాన్నే పాసయ్యాను. ఇంటర్, డిగ్రీ ఉయ్యాలవాడ లోనే పూర్తి చేశాను. తర్వాత ఇంట్లో ఒప్పించి హైదరాబాద్‌లో ఉండి ఏడాదిన్నర పాటు గ్రూప్స్‌కు కోచింగ్ తీసుకున్నా. 2000లో ఎస్.చెన్న కేశవరెడ్డితో నా పెండ్లి జరిగింది. 2001లో బాబు సందీప్ పుట్టిన తర్వాత ఉస్మానియా యూనివర్సిటీ దూరవిద్య ద్వారా ఎమ్.ఎ. తెలుగు పూర్తి చేశాను. 2004లో పాప విష్ణు శిరీష పుట్టిన తర్వాత ఇంట్లోనే ఉండి చదువుకుంటూ తెలుగు పండిత శిక్షణ ప్రవేశ పరీక్ష రాసి రాష్ట్రస్థాయిలో 6వ ర్యాంక్ సాధించాను.
ఉద్యోగ జీవితం
2007లో తాడిపత్రిలోని టి.పి.టి కాలేజీలో శిక్షణ పూర్తి చేశారు. 2008 డి.యస్సీలో లాంగ్వేజ్ పండిట్‌గా తొలి ప్రయత్నంలోనే ఉద్యోగం పొందగలిగాను. 2009 అక్టోబర్ 21న పెద్ద కందుకూరు హైస్కూల్లో ఎల్.పి (తెలుగు)గా ఉద్యోగ బాధ్యతలు చేపట్టాను. ఎనిమిదేండ్ల తర్వాత బోడెమ్మనూరు హైస్కూల్‌కు బదిలీపై వచ్చాను. అక్కడి నుండి రెండేండ్ల తర్వాత ప్రమోషన్ (ఎస్.ఏ.తెలుగు) మీద పెద్ద బోదనం పాఠశాలో పోస్టింగ్ తీసుకున్నాను. గత ఆరేండ్ల నుండి ఈ పాఠశాలలోనే పనిచేస్తున్నాను.
తెలుగు వ్యాకరణాంశాలతో…
ఉద్యోగంలో చేరినప్పటి నుండి విద్యార్థులకు అవసరమైన తెలుగు వ్యాకరణాంశాలను నా పరిమిత జ్ఞానంతో క్రోడీకరించి, అనేక ఉదాహరణలు చేర్చి, ఒక పుస్తకం రాసుకొన్నాను. దీని ఆధారంగా విద్యార్థులకు స్పష్టంగా చెప్పగలిగేదాన్ని. కొన్ని అంశాలను జిరాక్స్ చేయించి 10 వ తరగతి విద్యార్థులకు ప్రతి ఏడాది ఉచితంగా అందించేదాన్ని. అయితే పుస్తక రూపంలో ఈ వ్యాకరణాంశాలను తీసుకుని వస్తే బాగుంటుంది అనే ఆలోచన వచ్చింది. పుల్లా రామాంజనేయులు ‘బడిపిల్లల టలెంట్’ యూట్యూబ్ ఛానల్లో విద్యార్థుల వీడియోలు అప్లోడ్ చేస్తారని తెలిసి, మా విద్యార్థులకు నేర్పించిన అంశాలను వీడియో తీసి వారికి పంపేదాన్ని. అలా ఇప్పటి వరకు సుమారు 230 వీడియోలు చేశాను.
కరదీపికలు..
కొంత కాలానికి ఆంధ్ర సారస్వత పరిషత్తులో సభ్యురాలిగా ఎన్నికయ్యాను. అయితే రామాంజనేయులు సార్ విద్యార్థులతో కథలు రాయించి, పుస్తకాలు ముద్రిస్తున్నట్లు తెలిసింది. ఆయన సహకారం తీసుకొని, కొన్ని మార్పులు చేర్పులతో ‘విద్యార్థి కరదీపిక’ పేరుతో తెలుగు వ్యాకరణం పుస్తకాన్ని 2022లో తొలి ప్రింట్ చేయించాను. అప్పటి నుండి ప్రతి ఏడాది నేను పనిచేస్తున్న పాఠశాలలో 10వ తరగతి విద్యార్థులకు వీటిని ఉచితంగా ఇస్తున్నాను. 2023లో పుస్తకంలో మరికొన్ని మార్పులు చేసి ద్వితీయ ముద్రణ చేయించాను.
నీతి పరిమళ పుష్పాలు
రామాంజనేయులు సార్ స్ఫూర్తితోనే మా విద్యార్థులచే కథలు రాయించి ‘నీతి పరిమళ పుష్పాలు’ పేరుతో సంకలనాన్ని నా సొంత ఖర్చుతో ముద్రించాను. తిరుపతిలోని లోటస్ చిల్డ్రన్ హోంకు కరదీపికలు 80, నీతి పరిమళ పుష్పాలు 80 ఉచితంగా అందించాను. ఇప్పటి వరకు సుమారు 600 కరదీపికలు ఉచితంగాను, 700 పుస్తకాల వరకు 100 రూపాయలతో (ముద్రణకు అయిన ఖర్చు కంటే తక్కువకు, లాభాపేక్ష లేకుండా)అందిచాను. 10వ తరగతిలో తెలుగులో మంచి మార్కులు సాధించిన విద్యార్థులకు ప్రతి ఏడాది 1000 రూపాయల నగదు బహుమతి లేదా ఏదైనా బహుమతిని అందిస్తున్నాను.
పిల్లలను ప్రోత్సహిస్తూ…
ఒక తెలుగు ఉపాధ్యాయురాలిగా కథలు, సమీక్షలు మొదలైన పోటీలలో మా పాఠశాల విద్యార్థులు పాల్గొనేలా ప్రోత్సాహిస్తున్నాను. 2024లో వురిమళ్ల పౌండేషన్ వారు జాతీయ స్థాయిలో నిర్వహించిన పుస్తక సమీక్ష పోటీలో మా విద్యార్థి డి.యశ్వంత్ విజేతగా నిలిచి, తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో చోటు దక్కించుకున్నాడు. ఈ ఏడాది జాతీయ స్థాయి కథల పోటీలో మా విద్యార్థులు ముగ్గురు విజేతలుగా నిలిచి కథా పురస్కారాలను అందుకున్నారు. మాచిరాజు కథల పోటీలలోను, నంది వారోత్సవాల్లోను పాల్గొని బహుమతులు అందుకున్నారు.
సాహిత్య ప్రయాణం
మొదట నేను బోడెమ్మనూరులో పనిచేస్తున్న సమయంలో ఓ పత్రికా విలేకరి కవిత రాసి ఇవ్వమన్నారు. అప్పుడు ఒక్క కవిత రాసి ఇస్తే పత్రికలో ప్రచురించారు. తర్వాత కుదరక పత్రికకు రాసి ఇవ్వలేదు. కాని తర్వాత కొన్ని సోషల్ మీడియా గ్రూప్‌ల చేరి రచనలు చేస్తున్నాను. ఇటీవలి కాలంలో సుధామ గారి అద్భుత సృష్టి ‘సప్తపదులు’ గ్రూప్‌లో చేరి సప్తపదులు రాస్తూ, మా విద్యార్థులచేత కూడా రాయిస్తున్నాను. అలాగే అష్టాక్షరి కూడా రాస్తున్నాను. తపస్వి మనోహరం పత్రికలో అప్పుడప్పుడు కొన్ని రచనలు చేస్తున్నాను. మనుషుల్లో భేద భావాలు తొలగి, సమ సమాజ నిర్మాణం జరగడానికి, విద్యార్థుల్లో నైతిక విలువలు పెంపొందించడానికి, సమాజంలోని దురాచారాలు రూపుమాపడానికి ఇలా ఎన్నో మంచి మార్పులు జరగడానికి సాహిత్యం దోహదపడుతుందని నమ్ముతున్నాను.
తెలుగు భాషాభివృద్ధికై…
చిన్నతనం నుండి ప్రతి విషయంలో నాకు మా అమ్మనాన్నల సహకారం ఉంది. పెండ్లి తర్వాత నా భర్తకు రచనలు చేయడం అంతగా ఇష్టం లేకున్నా పూర్తిగా వ్యతిరేకి కాదు. స్కూలు, ఇంటి పనులు చూసుకుంటూ దొరికిన కాస్త ఖాళీ సమయంలో టి.వి.చూడకుండా రచనలకే కేటాయిస్తున్నాను. కుదరక కొన్ని రచనలు చేయడం లేదు. కానీ సాధ్యమైనంత వరకు రాయడానికే ప్రయత్నిస్తున్నాను. కవి సాయంత్రం గ్రూప్‌లో నిర్వహించిన జాతీయస్థాయి కవితా పోటీలో, విశ్వ సాహితీ కళావేదిక నిర్వహించిన కవితల పోటీలలో విజేతగా నిలిచాను. వివిధ సంకలనాలలో చేసిన రచనలకు ప్రశంసాపత్రాలను అందుకున్నాను. మన మాతృభాషాభివృద్ధికి నా వంతు ప్రయత్నం చేయడం ఒక రచయితగా నా కర్తవ్యం. అలాగే సమాజంలో చైతన్యం తీసుకురావడం నా బాధ్యతగా భావిస్తున్నాను. భవిష్యత్తులో మరిన్ని గొప్ప రచనలు చేయడానికి, సమయాన్ని సద్వినియోగం చేసుకునేలా ప్లాన్ చేసుకోవాలి. ఇప్పటి వరకు బాల సాహితీ మిత్ర, కీర్తి చక్ర, కీర్తి రత్న వంటి పురస్కారాలు అందుకున్నాను.
- అచ్యుతుని రాజ్యశ్రీ



