పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్థి శాఖ మంత్రి సీతక్క
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
రాష్ట్రంలో అత్యంత పేదరికంలో జీవిస్తున్న కుటుంబాలను గుర్తించాలని పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క అధికారులను ఆదేశించారు. సోమవారం హైదరాబాద్‌లోని బీఆర్.అంబేద్కర్ సచివాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ కేవలం గణాంకాల ఆధారంగా కాకుండా, గ్రామీణ స్థాయిలో వాస్తవ పరిస్థితులను ప్రతిబింబించే విధంగా పేదరిక గుర్తింపు జరగాలని స్పష్టం చేశారు. ఇందుకోసం స్పష్టమైన ప్రమాణాలు రూపొందించి, కుటుంబం జీవన స్థితి, ఆదాయ వనరులు, నివాస పరిస్థితులు, ఆరోగ్యం, ఉపాధి అవకాశాలు తదితర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అత్యంత పేదలను గుర్తించే ప్రక్రియలో మహిళా స్వయం సహాయక బందాల పాత్ర కీలకమని మంత్రి పేర్కొన్నారు. అర్హుల గుర్తింపు కోసం విలేజ్ యూనిట్‌గా సోషల్ మ్యాపింగ్ చేయాలని ఆదేశించారు. గ్రామ సభల తరహాలో పారదర్శకంగా లబ్ధిదారుల ఎంపిక జరుపుతామని అన్నారు. అత్యంత పేద కుటుంబాలను గుర్తించిన అనంతరం, వారికి ఉపాధి, నివాసం, ఆరోగ్యం, పోషణ, విద్య, నైపుణ్యాభివద్ధి వంటి రంగాల్లో విడతల వారీగా సమగ్ర సహాయం అందించే కార్యాచరణ రూపొందించాలని ఆదేశించారు. దీనికి సంబంధించి త్వరలో సీఎం నేతత్వంలో సమావేశం నిర్వహించి తుది నిర్ణయం తీసుకుంటామన్నారు. ఈ సమావేశంలో పంచాయతీరాజ్ గ్రామీణ అభివద్ధి శాఖ ప్రిన్సిపల్ సెక్రెటరీ ఎన్.శ్రీధర్, డైరెక్టర్ శతి ఓజా, మహిళా శిశు సంక్షేమ శాఖ కార్యదర్శి అనితా రామచంద్రన్, సెర్ప్ సీఈవో దివ్య దేవ రాజన్ పాల్గొన్నారు.


