తుంగతుర్తి ఎమ్మెల్యే సామెల్ కు కృతజ్ఞతలు
తెలంగాణ ఉద్యమకారుల ఫోరం జిల్లా ప్రధాన కార్యదర్శి మండ్ల దేవన్న నాయుడు
నవతెలంగాణ- వనపర్తి
తెలంగాణ ఉద్యమం సందర్భంగా రాష్ట్ర సాధన కోసం అహర్నిశలు కష్టపడి పనిచేసిన నిజమైన ఉద్యమకారులను ప్రభుత్వం గుర్తించాలని తెలంగాణ ఉద్యమకారుల పోరం వనపర్తి జిల్లా ప్రధాన కార్యదర్శి, కాంగ్రెస్ నాయకులు మండ్ల దేవన్న నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉద్యమకారుల గుర్తింపు అంశంపై అసెంబ్లీ సమావేశాల్లో తుంగతుర్తి ఎమ్మెల్యే మందుల సామెల్ కాంగ్రెస్ ప్రభుత్వం మేనిఫెస్టోలో ఇచ్చిన హామీని స్పీకర్ గడ్డం ప్రసాద్ దృష్టికి తీసుకురావడం హర్షించదగ్గ విషయమని, ఆయనకు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలిపారు. గత బి ఆర్ ఎస్ ప్రభుత్వం ఉద్యమకారులను అణిచివేసిందని పేర్కొన్నారు.
రాష్ట్ర సాధన కోసం ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొని ఉద్యమాలు చేసి రాష్ట్రాన్ని సాధించుకున్నామన్నారు. ఉద్యమకారుల ఆశయ సాధన కోసం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కోరారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిజమైన ఉద్యమకారులను గుర్తించడానికి కమిటీ వేసి వారిని గుర్తించి, గుర్తింపు ఇవ్వాలని, 250 చదరపు గజాలు స్థలంతో పాటు ఇండ్లను కేటాయించాలని దేవన్న నాయుడు కోరారు. ఉద్యమకారుల సమస్యలపై హైదరాబాదు అల్వాల్ లోని జయశంకర్ ప్రాంగణంలో తెలంగాణ ఉద్యమకారుల ఫోరం రాష్ట్ర అధ్యక్షులు చీమ శ్రీనివాస్ ఆధ్వర్యంలో ఆదివారం నుంచి రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయని, ఈ దీక్షలను ఉద్యమకారులు అంతా పాల్గొని విజయవంతం చేయాలని ఆయన ఈ ప్రకటనలో కోరారు.



