అంగీకారయోగ్యంకాని ప్రతిపాదనలకు నో : పుతిన్
మాస్కో : యూరోపియన్ దేశాలతో తాము యుద్ధాన్ని కోరుకోవడం లేదని రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్ చెప్పారు. అయితే మాస్కోతో ఘర్షణకు దిగాలని వారు కోరుకుంటే తామూ అందుకు సిద్ధమేనని స్పష్టం చేశారు. ‘యూరప్‌తో యుద్ధం చేయాలని మేము కోరుకోవడం లేదని ఇప్పటికే చెప్పాను. అయితే వారు అకస్మాత్తుగా యుద్ధాన్ని కోరుకొని దానిని మొదలు పెడితే మేమూ అందుకు సిద్ధమే. ఆ విషయంలో సందేహమే లేదు’ అని అన్నారు. రష్యాతో యూరప్ యుద్ధాన్ని ప్రారంభిస్తే ఇక చర్చలకు అవకాశమే ఉండదని హెచ్చరించారు. ఉక్రెయిన్‌లో యుద్ధాన్ని ఆపేందుకు అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని యూరోపియన్ దేశాలు ప్రయత్నిస్తున్నాయని, అవి తమకు అంగీకారయోగ్యం కాని ప్రతిపాదనలను ముందుకు తెస్తున్నాయని ఆరోపించారు.
పైగా శాంతిని కోరుకోవడం లేదని రష్యాపై నింద మోపాలని చూస్తున్నాయని విమర్శించారు. ఉక్రెయిన్ విషయంలో జరుగుతున్న శాంతి చర్చల నుంచి యూరోపియన్ దేశాలు తమకు తాముగా వైదొలిగాయని, రష్యాతో అవి సంబంధాలు తెంచుకోవడమే దీనికి కారణమని పుతిన్ చెప్పారు. వారు యుద్ధాన్ని కోరుకుంటున్నారని ధ్వజమెత్తారు. నల్ల సముద్రంలో రష్యా టాంకర్లపై ఉక్రెయిన్ డ్రోన్ దాడులు చేస్తోందని ఆయన ఆరోపిస్తూ సముద్రంలో ఉక్రెయిన్ ప్రవేశాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. ఉక్రెయిన్ స్థావరాలు, వాహనాలపై దాడులను ఉధృతం చేస్తామని, దానికి సాయం చేసే దేశాల ట్యాంకర్లపై చర్యలు తీసుకుంటామని పుతిన్ తెలిపారు.
అమెరికా-రష్యా చర్చలు విఫలం
ఉక్రెయిన్ యుద్ధానికి ముగింపు పలికేందుకు అమెరికా, రష్యా మధ్య జరిగిన చర్చలు విఫలమయ్యాయి. భూభాగం విషయంలో రాజీ పడే ప్రసక్తే లేదని రష్యా స్పష్టం చేసింది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అల్లుడు జేర్డ్ కుష్నర్, ప్రత్యేక ప్రతినిధి స్టీవ్‌విట్‌కాఫ్‌లతో రష్యా అధ్యక్షుడు పుతిన్ సమావేశమయ్యారు. ఆక్రమిత ఉక్రెయిన్ ప్రాంతాలపై రాజీ కుదరలేదని, అయితే కొన్ని అమెరికా ప్రతిపాదనలపై చర్చించే అవకాశం ఉన్నదని సమావేశానంతరం రష్యా అధ్యక్షుడి సహాయకుడు యురి ఉషాకోవ్ చెప్పారు. నాలుగు సంవత్సరాల యుద్ధానికి ముగింపు పలికే విషయంలో పురోగతి సాధించడం అంత తేలికేమీ కాదని ట్రంప్ వ్యాఖ్యానించారు.
యుద్ధానికి యూరప్ సిద్ధమైతే మేమూ రెడీ
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



