టారిఫ్ బిల్లులో ట్రంప్ ప్రతిపాదన
వాషింగ్టన్ : భారత్, చైనా సహా రష్యాతో వాణిజ్య సంబంధాలు కొనసాగించే దేశాలపై ఏకంగా ఐదు వందల శాతం సుంకాలు విధించాలని అమెరికా అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ ప్రతిపాదించిన టారిఫ్ బిల్లు సూచిస్తోంది. ఈ బిల్లును వచ్చే నెలలో సెనెట్ ముందు ఉంచే అవకాశం ఉంది. సెనెటర్ లిండ్సే గ్రహం ఏబీసీ న్యూస్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో భారీ సుంకాల ప్రతిపాదనను బయటపెట్టారు. ‘మీరు రష్యా నుంచి ఉత్పత్తులు కొనుగోలు చేసినా, ఉక్రెయిన్‌కు సాయం అందించకపోయినా అమెరికాలో ప్రవేశించే మీ వస్తువులపై ఐదు వందల శాతం సుంకం విధిస్తారు.
భారత్, చైనాలు రష్యా చమురులో 70 శాతం కొనుగోలు చేస్తున్నాయి. తద్వారా ఆ దేశాలు పుతిన్ యుద్ధానికి బాసటగా నిలుస్తున్నాయి’ అని ఆయన తెలిపారు. రష్యా నుంచి చమురు, ఇతర వస్తువులు కొనుగోలు చేయకుండా భారత్, చైనా వంటి దేశాలపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ బిల్లును ఉద్దేశించామని, దీని ద్వారా రష్యా యుద్ధాన్ని బలహీనపరచి ఉక్రెయిన్‌తో చర్చలు జరిపేలా మాస్కోను ఒప్పించాలని భావిస్తున్నామని గ్రహం చెప్పారు. బిల్లును కో-స్పాన్సర్ చేసిన వారిలో గ్రహం కూడా ఉన్నారు.
కాగా పశ్చిమ దేశాలు ఎంతగా ఒత్తిడి చేస్తున్నప్పటికీ భారత్, చైనా దేశాలు రష్యా నుంచి రాయితీతో కూడిన చమురును కొనుగోలు చేస్తున్నాయి. సుంకాల బిల్లుకు సెనెట్ ఆమోదం తెలిపితే భారత్, చైనాలతో అమెరికా వాణిజ్య సంబంధాలు దెబ్బతినే అవకాశం ఉంది. అమెరికాను మన దేశం అతి పెద్ద ఎగుమతి మార్కెట్‌గా భావిస్తోంది. ఈ నేపథ్యంలో సుంకాల బిల్లుకు ఆమోదం లభించిన పక్షంలో విస్తృత స్థాయిలో ఆర్థిక, దౌత్య పరిణామాలు చోటుచేసుకునే అవకాశం ఉంది.
అతి తక్కువ సుంకాలతోనే వాణిజ్య ఒప్పందం : ట్రంప్
భారత్‌తో కుదుర్చుకోబోయే వాణిజ్య ఒప్పందం కారణంగా అమెరికా కంపెనీలపై సుంకాల భారం అతి తక్కువగానే పడుతుందని అధ్యక్షుడు డోనాల్డ్ ట్రంప్ తెలిపారు. ద్వైపాక్షిక వాణిజ్య చర్చలు తుది దశకు చేరుకున్న నేపథ్యంలో ట్రంప్ బుధవారం ఎయిర్ ఫోర్స్ వన్ విమానంలో విలేకరులతో మాట్లాడారు. వాణిజ్య ఒప్పందం అమెరికా కంపెనీలకు అతి తక్కువ సుంకాలనే నిర్ధారిస్తుందని ఆయన చెప్పారు. ‘భారత్ మన దేశంతో ఒప్పందానికి వస్తుందని అనుకుంటున్నాను. ఈ ఒప్పందం భిన్నంగా ఉంటుంది. మనం భారత్‌లో ప్రవేశించి పోటీ పడవచ్చు. ప్రస్తుతం భారత్ ఎవరినీ లోపలికి అనుమతించడం లేదు. కానీ మనకు ఆ అవకాశం ఇస్తుందని భావిస్తున్నా. వారు అలా చేస్తే మనం అతి తక్కువ సుంకాలకే ఒప్పందం కుదుర్చుకుంటాం’ అని ట్రంప్ తెలిపారు.
అమెరికా నుంచి భారత్‌కు దిగుమతి అయ్యే ఉత్పత్తులపై సుంకాలు తక్కువగా ఉండేలా రెండు దేశాలు ఒప్పందం కుదుర్చుకోబోతున్నాయని అమెరికా ఆర్థిక మంత్రి స్కాట్ బెస్సెంట్ చెప్పిన కొద్ది గంటల వ్యవధిలోనే ట్రంప్ ఈ వ్యాఖ్య చేశారు. కాగా అమెరికాతో వాణిజ్య ఒప్పందం కుదుర్చుకునేందుకు భారత ప్రతినిధి బృందం తన పర్యటనను పొడిగించుకుంది. సుంకాల అమలుకు ట్రంప్ ఇచ్చిన 90 రోజుల గడువు ఈ నెల 9వ తేదీన ముగుస్తున్న తరుణంలో ఆ లోగానే ఒప్పందం కుదుర్చుకోవాలని భారత్ కోరుకుంటోంది. చర్చలు తుది దశకు చేరుకున్నాయని విదేశాంగ మంత్రి జైశంకకర్ కూడా చెప్పారు.