ప్రేమించడం, ప్రేమించ బడడం అనేవి మధురమైన అనుభూతులు. అటువంటి ప్రేమ అందరికీ దక్కుతుందని చెప్పలేము. ప్రేమించుకున్న వారందరూ జీవితాంతం కలిసి జీవిస్తారని కూడా చెప్పలేము. అయితే ప్రేమించడం, పెండ్లి చేసుకోవడం గొప్ప కాదు జీవితాంతం ఆ ప్రేమను కాపాడుకోవడమే గొప్ప విషయం. అలాంటి కథనమే ఈ వారం ఐద్వా అదాలత్ (ఐలమ్మ ట్రస్ట్)లో చదువుదాం.
సూరజక్‌కి సుమారు 28 ఏండ్లు ఉంటాయి. అతనికి నీలిమతో వివాహం జరిగి మూడేండ్లు అవుతుంది. ఇద్దరూ కాలేజీలో చదువుతున్నప్పటి నుండి ఒకరినొకరు ఇష్టపడుతున్నారు. పెద్దలను ఒప్పించి పెండ్లి చేసుకున్నారు. అయితే నీలిమను కాలేజీలో వున్నప్పుడు సూరజ్‌తో పాటు మరో ముగ్గురు అబ్బాయిలు ప్రేమించారు. ఈ విషయం సూరజ్‌కు కూడా తెలుసు. వారిలో ఇద్దరు సూరజ్, నీలిమల ప్రేమ గురించి తెలుసుకొని తప్పుకున్నారు. కానీ వివేక్ మాత్రం ఇప్పటికీ నీలిమను ప్రేమిస్తూనే ఉన్నాడు. ప్రేమించడమే కాదు ఆమెను ఎలాగైనా సొంతం చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాడు.
మిగిలిన ఇద్దరు మాత్రం ఆమె ఎక్కడ ఉన్నా సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నారు. ఎప్పుడైనా వాళ్ల ఇంటికి వచ్చినా నీలిమతో పెద్దగా మాట్లాడరు. ‘నీలిమా నువ్వు సంతోషంగా ఉందా? సూరజ్ ఎలా చూసుకుంటున్నాడు’ అంటూ కామన్ స్నేహితుల ద్వారా తెలుసుకుంటుంటారు. అయితే ఈ మధ్య నీలిమలో చాలా మార్పు వచ్చింది. దాంతో అతను సలహా కోసం ఐద్వా లీగల్‌సెల్‌కు వచ్చి ‘ఈ మధ్య నీలిమ నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. రెండు నెలల నుండి నన్ను వదిలేసి వాళ్ల పుట్టింటికి వెళ్లింది. రమ్మని చెప్పినా రావడం లేదు. నేను అక్కడకు వెళ్లినా నాతో మాట్లాడడం లేదు. నాకు కొంచెం టైం కావాలి అంటుంది. వాళ్ల అమ్మానాన్న చెప్పినా విడనం లేదు. మీకు కూడా నేను భారం అయితే చెప్పండి బయట హాస్టల్లో ఉంటాను అంటూ వాళ్లను బెదిరిస్తుంది.
నెల ముందు నాకు లాయర్‌తో నోటీసు కూడా పంపించింది. నేను ఆమెను హింసిస్తున్నాను, అనుమానిస్తున్నాను అని అందులో ఉంది. నీలిమ అంటే నాకు చాలా ఇష్టం. నా భార్య నాకు మాత్రమే సొంతం అనుకోవడంలో తప్పేం లేదు కదా! మరి ఎందుకు నీలిమ ఇలా నాకు నోటీసు పంపించింది. నాకు మీరే న్యాయం చేయండి’ అంటూ చెప్పుకొచ్చాడు. మేము నీలిమను పిలిచి మాట్లాడితే ‘సూరజ్‌కు నాపై అనుమానం ఎక్కువంది. నన్ను నా స్నేహితులతో కూడా మాట్లాడనీయకుండా ఆపుతున్నాడు. ఏదైనా వస్తువులు కొనగానే కోపగించుకుంటాడు. నేను కూడా అతనితో పాటు ఉద్యోగం చేస్తున్నాను కానీ నేను సంపాదించిన డబ్బులు నాకు నచ్చిన విధంగా ఖర్చు చేయడానికి లేదు. అన్నింటికీ ఆంక్షలు పెడతాడు.
పిల్లల భవిష్యత్తు కోసం అంటూ ఇప్పటి నుండే పొదుపు చేయాలి అంటాడు. మాకు పిల్లలే లేరు. లేని పిల్లల భవిష్యత్తు ఏమిటి, ప్రతి దానికీ నో అనే అంటాడు. పెండ్లికి ముందు ఇలా లేడు. ఈ మధ్య కాలంలోనే ఇలా తయారయ్యాడు. నేను వివేక్‌తో మాట్లాడితే సూరజ్‌కు అస్సలు నచ్చదు. అతనితో మాట్లాడితే చాలా గొడవ చేస్తాడు. వివేక్ నాకు మాత్రమే ఫ్రెండ్ కాదు సూరజ్‌కు కూడా అతను ఫ్రెండే. అతని ముందు మాత్రం బాగానే ఉంటాడు. కానీ తర్వాత మాత్రం గోల చేస్తాడు. అసలు అతనంటే సూరజ్‌కు ఎందుకు నచ్చడం లేదో నాకు చెప్పడు. చెబితేనే కదా నాకు అర్థమయ్యేది. ఏమీ చెప్పకుండా మాట్లాడొద్దు, కలవొద్దు అంటే ఎలా కుదురుతుంది?
దానికి సూరజ్ ‘వాడి క్యారెక్టర్ అంత మంచిది కాదు. వివేక్ అమ్మాయిలను ఫ్లాట్ చేస్తాడు. అందుకే వాడి మాటలు నీకు బాగా నచ్చుతాయి. మనిద్దరం కాలేజీలో ఉన్న రోజుల నుండే అతనికి వ్యామోహం. ఎలాగైనా ఒక్కసారైనా తనను దక్కించుకోవాలని చూస్తున్నాడు. వాడికి ప్రేమ లాంటివి ఏమీ లేవు. నిజంగా ప్రేమించినవాడే అయితే నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటాడు. కానీ వివేక్ అలా కాదు. ఎప్పుడూ అవకాశం కోసం చూస్తున్నాడు. కానీ నువ్వు అదేం అర్థం చేసుకోకుండా నాకంటే వాడికే ప్రాధాన్యం ఇస్తుంది. వద్దని చెప్పినా విడనం లేదు. అతనితో చనువుగా మాట్లాడితే నేను ఎలా భరిస్తాను. వాడి గురించి నాకే కాదు అందరికీ లేదు. కానీ ఎవ్వరు చెప్పినా నువ్వు పట్టించుకోవడం లేదు. పైగా కారణం లేకుండా నేను అనుమానిస్తున్నాను అంటున్నావు. నిజంగా అనుమానించేవాడినే అయితే మిగిలిన వాళ్లతో మాట్లాడితే ఎందుకు ఊరుకుంటాను? ఆ మాత్రం అర్థం చేసుకోపోతే ఎలా?
ఇక ఖర్చులు అంటావా, దుబారా ఖర్చులు ఎక్కువైతే మన భవిష్యత్తుకు కష్టం. ఇప్పుడు పిల్లలు లేకపోవచ్చు. పుట్టిన తర్వాత చూసుకుందాం అనుకుంటే ఎలా? అప్పటి వరకు కొంత సేవింగ్స్ ఉంటే మనకీ, మన పిల్లలకే మంచిది. ఆ ఉద్దేశంతో చెబుతున్నాను తప్ప నీపై కోపంతోనో, ద్వేషంతోనో కాదు. అవసరం ఉన్నా లేకపోయినా కొనడం తిరిగి అరు నెలల్లోనే వాటిని మార్చేయడం ఇలా ఎన్నో సార్లు జరిగింది. ఇలా వేస్ట్ ఖర్చులతో మనం పొదుపు ఎలా చేస్తాం, అవసరమైన వస్తువులు కొను క్కుంటే నేను ఎప్పుడైనా ఏమైనా అన్నానా? ఒక్కసారి నువ్వే ఆలోచించుకో’ అన్నాడు. వాళ్లిద్దరి మాటలు విన్న తర్వాత ‘చూడు నీలిమా సూరజ్ చెప్పేదాంట్లో నిజం ఎంత ఉందో ఆలోచించు. మరో వ్యక్తి కోసం అనవసరంగా నీ జీవితాన్ని పాడుచేసుకోవద్దు. నీకు ఎంతో మంది స్నేహితులు ఉన్నారు కానీ వివేక్ ఒక్కడి విషయంలోనే సూరజ్ ఇలా ఉంటున్నాడు. కాబట్టి నువ్వు అర్థం చేసుకుంటే మంచిది. లేని పోని ఊహలతో ప్రేమించిన వ్యక్తిని దూరం చేసుకోవద్దు.
ఇప్పటికే పెండ్లి జరిగి మూడేండ్లు అవుతుంది. ఇక పిల్లలకు ప్లాన్ చేసుకోండి. అప్పుడు మీ మధ్య ఉన్న సమస్యలు కూడా తగ్గిపోతాయి. ప్రేమించడం, పెండ్లి చేసుకోవడం గొప్ప కాదు. ఆ ప్రేమను కాపాడుకోవడమే గొప్ప. ఎంతో ఇష్టపడి పెండ్లి చేసుకున్నారు. జీవితాంతం సంతోషంగా ఉండండి. అలా ఉండాలంటే ఒకరి నొకరు అర్థం చేసుకోవాలి. ఒకరు చెప్పింది ఒకరు వినాలి. ఎందుకు చెబుతున్నారో అర్థం చేసుకోవాలి. అప్పుడే మీ ఇద్దరి మధ్య సమస్యలు ఉండవు’ అని అర్థమయ్యేలా చెప్పాము. దాంతో నీలిమా ‘సరే మేడమ్ మీరు చెబుతున్న దాంట్లో కూడా నిజం వుంది. మిగిలిన విషయాల్లో సూరజ్‌తో నాకు ఎలాంటి సమస్యా లేదు. ఒక్క వివేక్ విషయంలో తప్ప. అనవసరంగా అతని కోసం నేను సూరజ్‌ను ఇబ్బంది పెట్టాను. ఇకపై అలా చెయ్యను. నేను చేసిన పొరపాటు ఏంటో నాకు అర్థమయింది’ అని చెప్పి సూరజ్‌తో కలిసి ఇంటికి వెళ్లింది.
- వై వరలక్ష్మి, 9948794051



