– బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్న కాంగ్రెస్ : బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్
– హైదరాబాద్‌లో బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం ఆధ్వర్యంలో మహాధర్నా
నవతెలంగాణ – ముషీరాబాద్
కాంగ్రెస్ ప్రభుత్వం బీసీలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నదని, బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు కాకుంటే భూకంపం సృష్టించి తమ నుంచి అధికారాన్ని లాక్కుంటామని బీఆర్‌ఎస్ నాయకులు, మాజీ మంత్రులు తలసాని శ్రీనివాస్ యాదవ్, శ్రీనివాస్ గౌడ్, గంగుల కమలాకర్ అన్నారు. స్థానికసంస్థల ఎన్నికల్లో చట్టబద్ధంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతనే ఎన్నికలు నిర్వహించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం హైదరాబాద్‌లోని ఇందిరా పార్క్(ధర్నాచౌక్) వద్ద బీసీ ప్రజాప్రతినిధుల ఫోరం (బీసీపీఎఫ్) ఆధ్వర్యంలో మహాధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తలసాని శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వానికి బీసీలపై నిజంగా ప్రేమ, వారి అభివృద్ధి, సంక్షేమంపై చిత్తశుద్ధి ఉంటే 42 శాతం రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. కులగణన లెక్కలు తప్పులతడకగా ఉన్నాయని ఆరోపించారు. బీసీ రిజర్వేషన్ బిల్లుపై చట్టసభల్లో మాట్లాడటం లేదని, క్యాబినెట్‌లో పెట్టినా పబ్లిక్ డొమైన్‌లోకి రాలేదన్నారు. హడావుడిగా అసెంబ్లీలో బీసీ బిల్లు ప్రవేశపెట్టి కేంద్రానికి పంపారని, ఇది బ్రహ్మపదార్థం అని నమ్మించడానికి కాంగ్రెస్ ప్రయత్నం చేస్తోందన్నారు. బీసీ రిజర్వేషన్ బిల్లుకు చట్టబద్ధత వచ్చాకే సీఎం రేవంత్‌రెడ్డి ఎన్నికలకు వెళ్లాలని తెలిపారు. ఈ బిల్లు కోసం కేంద్రంపై ఒత్తిడి తీసుకొచ్చి అమలు చేయించాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ ఇప్పడు డిక్లరేషన్ అంటుందని, మరి బిల్లు ఎందుకు ప్రవేశపెట్టారని ప్రశ్నించారు. శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. కామారెడ్డి బీసీ డిక్లరేషన్‌ను ఒక బీసీ ముఖ్యమంత్రి సిద్ధ రామయ్యతో చెప్పించారని, రిజర్వేషన్ల కోసం అవసరమైతే కర్నాటక వెళ్లి సిద్ధ రామయ్యతో చర్చిస్తామని తెలిపారు. నాడు 33 శాతం రిజర్వేషన్ల కోసం బీఆర్‌ఎస్ ప్రయత్నాలు చేస్తే స్వప్న రెడ్డితో కేసు వేయించి కొట్టి వేయించారన్నారు. తాము నిరక్షరాస్యులం కాదని, బీసీ రిజర్వేషన్లు, ఆర్డినెన్స్ గురించి తెలుసన్నారు. పక్క రాష్టాల్లో రిజర్వేషన్లను న్యాయస్థానాలు కొట్టివేశాయని గుర్తుచేశారు. ఒక్క జీవోతో రిజర్వేషన్లు ఇస్తామనడం మోసం చేయడమేనని అన్నారు. ఇంజినీరింగ్, మెడికల్ అడ్మిషన్లు జరుగుతున్న ఈ సమయంలో ఈ బీసీ రిజర్వేషన్ల జీవో ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. క్యాబినెట్‌లో యాదవ్, గొల్ల కురుమలకు స్థానం కూడా ఇవ్వలేదన్నారు. ఈ ధర్నాలో ఎమ్మెల్యేలు ముఠా గోపాల్, గంగుల కమలాకర్, మాజీ ఎమ్మెల్యే జోగు రామన్న, మాజీ స్పీకర్ మధుసూదనా చారి, స్వామి గౌడ్, రిటైర్డ్ ఐఏఎస్ చిరంజీవులు, బాలరాజు గౌడ్, మాజీ ఎమ్మెల్యేలు, సీనియర్ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.
రిజర్వేషన్ అమలు చేయకుంటే అధికారాన్ని లాక్కుంటాం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES