త్యాగాలు కమ్యూనిస్టులవి భోగాలు బీజేపీవా?
మహోన్నత పోరాటంపై మతోన్మాదులకు మాట్లాడే హక్కు లేదు
సామాజిక అణచివేతను వర్గ దోపిడీపై జమిలి ఉద్యమం
కెవిపిఎస్ సెమినార్ లో ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షుడు సారంపల్లి మల్లారెడ్డి
నవతెలంగాణ హైదరాబాద్:
కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన విరోచిత తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంతో విషపురుగులైన కాషాయ ఉన్మాదులకు ఏమిటి సంబంధమని, మట్టి మనుషుల మహోన్నత పోరాట చరిత్ర గురించి మాట్లాడే నైతిక అర్హత మతోన్మాద బీజేపీకి లేదని ఆల్ ఇండియా కిసాన్ సభ జాతీయ ఉపాధ్యక్షులు సారంపల్లి మల్లారెడ్డి విమర్శించారు. సోమవారం హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం (కెవిపిఎస్) ఆధ్వర్యంలో ‘తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం – వాస్తవాలు – వక్రీకరణలు అనే అంశంపై సెమినార్ నిర్వహించారు. కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టి. స్కైలాబాబు అధ్యక్షతన జరిగిన ఈ సెమినార్ లో సారంపల్లి మల్లారెడ్డి ప్రధాన వక్తగా హాజరై ప్రసంగించారు.
ఆయన మాట్లాడుతూ 1946 సెప్టెంబర్ 11 నుండి 1951 సెప్టెంబర్ 17 వరకు జరిగిన విరోచిత వీర తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో మచ్చుకైనా కనిపించని మతోన్మాదులు ఆ పోరాటానికి వారసులమంటూ సభలు పెట్టడం విడ్డూరంగా ఉందన్నారు. 1913లో హిందూ మహాసభ 1925లో ఆర్ఎస్ఎస్ 1951లో జనసంఘ్ ఏర్పడితే ఆ పోరాటం జరిగిన కాలంలో మీరెందుకు ఆ పోరాటంలో పాల్గొనలేదని ప్రశ్నించారు. నైజాం తెలుగు మాట్లాడకూడదు అంటూ ఉర్దూ మాత్రమే ఉండాలని చెప్పిన్నట్లుగానే నేడు బీజేపీ హిందీ మాత్రమే మాట్లాడాలి అని మాతృభాష మాట్లాడకూడదని అంటుందన్నారు. నైజాంకు నరేంద్ర మోడీ ప్రభుత్వానికి మధ్యల అవినాభావ సంబంధం ఉందని తెలిపారు. విస్నూర్ రామచంద్రారెడ్డి ఎర్రబాడు దొరలు భూస్వాములు జాగిర్ధరులు నిజాం సైన్యంలో అత్యధికలు తెలంగాణ గడ్డలోని మట్టి మనుషులను నానా చిత్ర హింసలు పెట్టారని దోపిడీ చేశారని చెప్పారు విసునూర్ రామచంద్రారెడ్డిది ఏ మతమని ప్రశ్నించారు. అది హిందూ ముస్లింల పోరాటం కాదని దోపిడీదారులు, దోపిడీకి గురైన పేదలు కూడా హిందువులేనని చెప్పారు. దోపిడి పీడనకు వ్యతిరేకంగా జరిగిన తిరుగుబాటు అని చెప్పారు.
ముస్లిం నైజాం రజాకారులకు వ్యతిరేకంగా పోరాడిన వారిలో ఈ మట్టి గడ్డమీద పుట్టిన మైనార్టీ లైన ముస్లింలు ప్రాణ త్యాగాలు చేశారని చెప్పారు. మఖ్దూం మొహియుద్దీన్ కామ్రేడ్స్ అసోసియేషన్ స్థాపించారని షోయబుల్లాఖాన్ సీనియర్ జర్నలిస్టుగా ఇమ్రేజ్ అనే పత్రిక నడిపించి నైజాం నిరంకుశ చర్యలను ఎండగడుతూ కథనాలు రాశారని నిలబెట్టి కాళ్లు చేతులు నరికి కాచిగూడ రైల్వే స్టేషన్ లో చిత్రహింసలు పెట్టింది రజాకారులు కాదా అని ప్రశ్నించారు. ఆ పోరాటంలో మొదటగా ప్రాణాలు ఇచ్చింది షేక్ బందగీ ముస్లిం కాదా అని చెప్పారు ఆ ఉద్యమంలో అడుగడుగున ముస్లింలు ముస్లిం రాజుకు వ్యతిరేకంగా పోరాడారని గుర్తు చేశారు. మూడువేల గ్రామాలను విముక్తి చేసి గ్రామరాజ్య కమిటీ ఏర్పాటు, చేసి 10లక్షల ఎకరాల భూములు పంచి 4000 మంది అమరులైన విరోచిత పోరాట గాధ అని కొనియాడారు. ఆర్ఎస్ఎస్ బీజేపీ హైజాక్ చేస్తామంటే చరిత్ర క్షమించదని హెచ్చరించారు.
నిజాం రాజైన మీరు ఉస్మాన్అలీ ఖాన్ కు రాజ్య ప్రముఖ్ ప్రకటించి కిరీటం పెట్టిందది నెహ్రు పటేల్ ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. రాజాకార్ సైన్యాధిపతిగా ఉన్న ఖాసిం రజ్విని కమ్యూనిస్టుల పోరాటానికి భయపడి రహస్యంగా పాకిస్తాన్ కు పంపింది ఎవరో చెప్పాలన్నారు. కమ్యూనిస్టుల పోరాట వారసత్వాన్ని ఈ తరానికి అందించకుండా దానిని మతం రంగు పులిమి యువతరాన్ని తప్పుదోవ పట్టించేందుకు కుట్రలు చేస్తున్నారని విమర్శించారు. తెలంగాణ సాయుధ పోరాట వాస్తవ చరిత్ర వారసులు ముమ్మాటికి కమ్యూనిస్టులేననిచెప్పారు.
తెలంగాణ గడ్డలో కమ్యూనిస్టు పార్టీ ప్రధాన ప్రతిపక్షంగా భవిష్యత్ లో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నాయని నెహ్రూ పటేల్ కలిసి కమ్యూనిస్టులను అణిచివేయడానికి సైన్యాన్ని పంపారే కానీ నైజాంకు వ్యతిరేకంగా పటేల్ సైన్యాలు రాలేదని మల్లారెడ్డి చెప్పారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటాన్ని విద్యార్థులు యువతరం క్షుణ్ణంగా అధ్యయనం చేయాలని వాస్తవ చరిత్రను వంట పట్టించుకోని మతోన్మాదులకు తగిన బుద్ధి చెప్పాలని ఆయన పిలుపునిచ్చారు.
తెలంగాణ సాయుధ పోరాట వారసత్వం కమ్యూనిస్టులదే.. దున్నేవానికి భూమి కావాలని వెట్టి చాకిరి అంతం చేయాలని జరిగిన మహత్తర పోరాట వారసత్వం కమ్యూనిస్టులదేనని టిపిఎస్కే రాష్ట్ర కన్వీనర్ జి రాములు అన్నారు. చాలామంది నేటితరం విద్యార్థులు యువకులలో కేసీఆర్ కాలంలో జరిగిన తెలంగాణ పోరాటం కమ్యూనిస్టుల నాయకత్వంలో జరిగిన వీర తెలంగాణ సాయుధ పోరాటం ఒకటి కాదన్నారు. నాటి పోరాటం ప్రపంచ చరిత్ర పుటల్లో సజీవంగా నిలుస్తుందన్నారు. ఆ పోరాటంలో కమ్యూనిస్టులు రాత్రిపూట బడులు గ్రంథాలయాలు అక్షరాస్యత ఉద్యమాన్ని నిర్మించారని చెప్పారు ఆ పోరాటం కుల పీడనకు వ్యతిరేకంగా పీడిత వర్గాన్ని ఏకం చేసిందని చెప్పారు. ఆ పోరాటం అనేక రకాల పన్నులు రద్దుచేసిందని తెలిపారు.
కమ్యూనిస్టుల చేతుల్లోకి అధికారం పోతుందనే భయంతో నెహ్రూ పటేల్ కలిసి రజాకార సైన్యాల ముసుగులో కమ్యూనిస్టుల పైన దాడులు దౌర్జన్యాలు చేశారని చెప్పారు. విరోచిత త్యాగాలు చేసిన అనేకమంది కమ్యూనిస్టు యోధుల ఆశయాలు కొనసాగించాలన్నారు. తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో భీమిరెడ్డి సుందరయ్య మొదలుకొని మల్లు స్వరాజ్యం వరకు ఆరుట్ల కమలాదేవి చిట్యాల ఐలమ్మ లాంటి అనేకమంది ప్రాణ త్యాగాలు చేశారని, అనేక చిత్రహింసలకు గురయ్యారని చెప్పారు. ఈ పోరాట వాస్తవ చరిత్ర నేటితరం నేర్చుకోవాలన్నారు ప్రభుత్వాలు విద్యార్థులకు పాఠ్యాంశంగా చేర్చి తెలంగాణ గడ్డమీద జరిగిన విరోచిత పోరాటాన్ని విద్యార్థులకు తెలియజేయాలని పిలుపునిచ్చారు.
ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎర్రజెండా పాతి బీజేపీ సభ పెట్టాలి

ఎర్రజెండా నాయకత్వంలో జరిగిన పోరాట గురించి బీజేపీ సెప్టెంబర్ 17న ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో ఎర్ర జెండా పాతి సభ నిర్వహించాలని ఆవాజ్ రాష్ట్ర కార్యదర్శి ఎం డి అబ్బాస్ అన్నారు. ఎగ్జిబిషన్ గ్రౌండ్లో బీజేపీ ఏ అర్హతతో సభ పెడుతున్నారని విమర్శించారు నాటి తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటం ఎర్రజెండా వారసుల చరిత్ర అన్నారు. ఆ చరిత్రను వక్రీకరిస్తూ ఎలా సభలు పెడతారని ప్రశ్నించారు. కమ్యూనిస్టుల రక్తాక్షరాలతో నిర్మించిన ఈ చరిత్రని ఏమాత్రం సంబంధంలేని మీకు ఎందుకు అంత ఆర్భాటం అని ప్రశ్నించారు. నాడు నైజాం, భూస్వాములు కలిసి మహిళలను బట్టలూడదీసి బతుకమ్మ లాడిచ్చి చిత్రహింసల పాలు చేస్తే నేటి ఆధునిక యుగంలో బీజేపీ పాలనలో డబుల్ ఇంజన్ సర్కార్ మణిపూర్ లో సైతం ఇద్దరు మహిళలను బట్టలూడదీసి నగ్నంగా ఊరేగింపు చేశారని విమర్శించారు. రెండేళ్లలో 24 దేశాలు పర్యటించిన నరేంద్ర మోడీ మణిపూర్లో ఇద్దరు మహిళలని నగ్నంగా ఊరేగింపు చేస్తే నోరు మెదపలేదని గుర్తుచేశారు. నైజాం నవాబ్ నరేంద్ర మోడీ ప్రభుత్వం బీజేపీ విధానం కవల పిల్లలాంటివేనని చెప్పారు. దోపిడీదారులు మతోన్మాదులు కలిసి పాలన చేసిన సందర్భంలో నేడు ప్రజలు అనేక అభద్రతలో జీవిస్తున్నారని చెప్పారు. నాడు ఉర్దూ మాత్రమే చదవాలని నైజాం చెబితే, నేడు హిందీ మాత్రమే మాట్లాడాలని నరేంద్ర మోడీ చెబుతున్నాడని విమర్శించారు. వాస్తవ చరిత్రకు వక్రీకరణ చేయడం ద్వారా చరిత్ర మారదని, చరిత్ర క్షమించదని ఆయన విమర్శించారు.
కుల మత ఉన్మాదాలను తులనాడిన వర్గ పోరాటం

కులం మత ఉన్మాదాలను తలనాడి పీడిత వర్గాన్ని ఏకం చేసిన వర్గ పోరాటం వీర తెలంగాణ సాయుధ పోరాటమని కెవిపిఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి టీ.స్కైలాబ్ బాబు అన్నారు. వెట్టిచాకిరికి వ్యతిరేకంగా సాగిన ఈ పోరాటంలో మహిళలు ప్రముఖ పాత్ర పోషించారని చెప్పారు. పరిమిత చదువులున్న రోజుల్లోనే మహిళలు తుపాకీ పట్టి రజాకార సైన్యాలకు విసునూర్ రామచంద్రారెడ్డికి వ్యతిరేకంగా పోరాడిన చరిత్ర నాటి ఆంధ్ర మహాసభ కమ్యూనిస్టులదేనని అని చెప్పారు. నాడు కమ్యూనిస్టులు పంచిన పది లక్షల ఎకరాల భూమిలో నేడు పాలకులు సుమారు మూడు లక్షల ఎకరాల భూమిని వివిధ రూపాలలో స్వాధీనం చేసుకున్నారని అన్నారు. ఈ పోరాటం ద్వారా భూసంస్కరణ చట్టం, రక్షిత కౌలుదారి చట్టం ఏర్పడిందన్నారు. నేడు దళితులకు అసైన్డ్ భూములు ఇచ్చినప్పటికీ అవి వారి చేతుల్లో లేకుండా పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అసైన్డ్ భూములు ఉన్న దళితులందరికీ తక్షణమే పట్టాలివ్వాలని ఆయన డిమాండ్ చేశారు. దున్నేవానికి భూమి కావాలని నాటి పోరాట నినాదం నేటికీ అనుసరణీయమేనని తెలిపారు. కుల వివక్ష అంటరానితనానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటం భూమి కోసం ప్రకృతి వనరుల సాధన కోసం అట్టడుగు వర్గాలు ఐక్యంగా ఉద్యమించాలని పిలుపునిచ్చారు. మహోన్నత చరిత్ర గురించి మతోన్మాదులకు మాట్లాడే నైతిక అర్హత లేదని విమర్శించారు.
ఈ సెమినార్ లో ఐలు రాష్ట్ర కార్యదర్శి పార్థసారథి, జిఎంపిఎస్ రాష్ట్ర కార్యదర్శి ఉడుత రవీందర్, పంచాయతీ రాజ్ విశ్రాంత ప్రత్యేక అధికారి ఈ. నర్సింగరావు, కెవిపిఎస్ మేడ్చల్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.కృపా సాగర్, ఎన్.బాలపీరు హైదరాబాద్ సెంట్రల్ జిల్లా కార్యదర్శి బి.సుబ్బారావు, రాష్ట్ర కమిటీ సభ్యులు గంధం మనోహర్, కెవిపిఎస్ నాయకులు జి.రాములు, బి.పవన్, డి.రమేష్, పి.భాగ్య నిహారిక, లక్ష్మీ కళ్యాణి, స్వాతి, మధు శ్రీరాములు తదితరులు పాల్గొన్నారు.
