Tuesday, December 30, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంపీఆర్సీ జాప్యం చేస్తే ఉద్యమ కార్యాచరణ

పీఆర్సీ జాప్యం చేస్తే ఉద్యమ కార్యాచరణ

- Advertisement -

అన్ని పెండింగ్‌ బిల్లులు మంజూరు చేయాలి
ఎన్జీఓల జోక్యం నిరోధించాలి : టీఎస్‌యూటీఎఫ్‌ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్‌

నవతెలంగాణ -జనగామ
పీఆర్సీ వెంటనే అమలు చేయాలని, జాప్యం జరిగితే ఉద్యమ కార్యాచరణ ప్రకటిస్తామని తెలంగాణ రాష్ట్ర ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్‌(టీఎస్‌ యూటీఎఫ్‌) రాష్ట అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు చావ రవి, ఎ.వెంకట్‌ అన్నారు. జనగామ జిల్లాలో నిర్వహించిన యూటీఎఫ్‌ రాష్ట కమిటీ విస్తృత సమావేశాల్లో భాగంగా రెండో రోజు సోమవారం ప్రతినిధుల సభలో చావ రవి మాట్లాడారు. రాష్ట్రంలోని ఉపాధ్యాయ ఉద్యోగులకు పీఆర్సీని జులై 1, 2023 నుంచి వెంటనే అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. మ్యానిఫెస్టోలో పెట్టిన విధంగా ఉద్యోగుల అన్ని రకాల పెండింగ్‌ బిల్లులను క్లియర్‌ చేయాలని, పెండింగ్‌ డీఏ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. ప్రభుత్వ ఉపాధ్యాయులను ఆందోళనకు గురిచేస్తున్న టెట్‌ సమస్యపై కేంద్రం ఉదాసీనత సరికాదన్నారు.

రాష్ట్రంలో 45 వేల మంది, దేశవ్యాప్తంగా 25 లక్షల మందిపై ప్రత్యక్షంగా ప్రభావం చూపుతున్న టెట్‌పై సుప్రీంకోర్టు తీర్పు వచ్చి నాలుగు నెలలు గడుస్తున్నా కేంద్ర ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉపాధ్యాయుల ప్రయోజనాలను కాపాడాలని డిమాండ్‌ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు కల్పించి, తరగతికొక ఉపాధ్యాయుడిని నియమించి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేయాలని అన్నారు. కానీ, అందుకు బదులుగా ఫిజిక్స్‌ వాలా, ఖాన్‌ అకాడమీ వంటి సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకుని ఏర్పాటు చేస్తున్న క్లాసులు నిరుపయోగంగా ఉన్నాయని అన్నారు. ఉపాధ్యాయులను స్వేచ్ఛగా పాఠాలు చెప్పనివ్వండని, బోధనేతర పనుల భారం నుంచి విముక్తులను చేసి ఆన్‌లైన్‌ నివేదికలు పంపడానికి బోధనేతర సిబ్బందిని కేటాయించాలని డిమాండ్‌ చేశారు.

రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎ.వెంకట్‌ మాట్లాడుతూ.. పాఠశాల విద్యాశాఖలో కొనసాగుతున్న ట్రైనింగ్‌లు(ఉన్నతి, ఎఫ్‌ఎల్‌ఎస్‌, లక్ష్య, ఎఫ్‌ఆర్‌ఎస్‌) ఇతర కార్యక్రమాల పేరుతో విద్యాబోధనలకు ఆటంకంగా ఉన్న విధానాలపై సమీక్షించాలని అన్నారు. ఉపాధ్యాయులకు శిక్షణ పేరిట పాఠశాలలో ఎన్జీవోల జోక్యం సరైంది కాదన్నారు. కేజీబీవీ, మోడల్‌ స్కూల్‌, గురుకులాల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్‌ చేశారు. ఈ సమావేశంలో యూటీఎఫ్‌ రాష్ట్ర ఉపాధ్యక్షులు కె.జంగయ్య, చావ దుర్గా భవాని, కోశాధికారి టి.లక్ష్మారెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు కె.సోమశేఖర్‌, ఎం.రాజశేఖర్‌ రెడ్డి, డి.సత్యానంద్‌, జి.నాగమణి, కె.రంజిత్‌ కుమార్‌, ఎస్‌.మల్లారెడ్డి, జి.శ్రీధర్‌, ఆడిట్‌ కమిటీ కన్వీనర్‌ జె.యాకయ్య, జనగామ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు పి.చంద్రశేఖర్‌రావు, మడూరు వెంకటేష్‌ తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -