మతతత్వశక్తులకు నితీశ్ కుమార్ మద్దతు : ప్రతిపక్ష సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్
నవతెలంగాణ-పాట్నా బ్యూరో
బీహార్‌లో ఇండియా బ్లాక్ అధికారంలోకి వస్తే వక్ఫ్ సవరణ చట్టాన్ని చెత్త బుట్టలో పడేస్తానని ప్రతిపక్ష సీఎం అభ్యర్థి తేజస్వి యాదవ్ అన్నారు. ఆదివారం కతిహార్ జిల్లాలో జరిగిన బహిరంగ సభలో ఆయన మాట్లాడారు. తన తండ్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ దేశంలోని మతతత్వ శక్తులతో ఎప్పుడూ రాజీపడలేదని అన్నారు. కానీ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ ఎల్లప్పుడూ అలాంటి శక్తులకు మద్దతు ఇస్తున్నారని విమర్శించారు. ఆయన కారణంగానే ఆర్‌ఎస్‌ఎస్, దాని అనుబంధ సంఘాలు రాష్ట్రంలోనూ, దేశంలోనూ మత విద్వేషాన్ని వ్యాపింపజేస్తున్నాయని దుయ్యబట్టారు. బీజేపీని భారత్ జలావ్ పార్టీ అని పిలవాలని అన్నారు. 20 ఏండ్ల నితీశ్ కుమార్ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలు విసిగిపోయారని పేర్కొన్నారు.
ముఖ్యమంత్రికి తెలివి లేదని, ప్రభుత్వంలోని ప్రతి విభాగంలోనూ అవినీతి విపరీతంగా పెరిగిపోయిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా కుప్పకూలిపోయాయన్నారు. సీమాంచల్ ప్రాంత అభివృద్ధికి ఎన్‌డిఎ ప్రభుత్వం ఏమీ చేయలేదని పేర్కొన్నారు. తాము అధికారంలోకి వస్తే, ఈ ప్రాంతం సమగ్ర అభివృద్ధి కోసం సీమాంచల్ అభివృద్ధి అథారిటీని ఏర్పాటు చేస్తామని అన్నారు. తాను చేస్తున్న ఎన్నికల వాగ్దానాలను ఎన్డీఏ ప్రభుత్వం కాపీ కొడుతోందని అన్నారు. వృద్ధాప్య పెన్షన్ పెంచుతామని తాము హామీ ఇచ్చామని, నితీశ్ సర్కార్ దానిని నెలకు రూ.400 నుంచి నెలకు రూ.1,100కు పెంచిందని అన్నారు. అయితే దానిని తాము అధికారంలోకి వచ్చిన తరువాత నెలకు రూ.2,000కు పెంచుతామని అన్నారు.
జేడీయూలో అసమ్మతి కుంపటి మాజీ మంత్రులతో సహా 16 మందిపై జేడీయూ వేటు
బీహార్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేతృత్వంలోని జేడీయూకు రెబల్స్ బెడద భయపెడుతోంది. అసమ్మతి సెగల్ని ఆ పార్టీ నాయకత్వం తట్టుకోలేకపోతోంది. ఇప్పటివరకు సీట్లు దక్కక వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు, పార్టీ నిర్ణయాలను ధిక్కరించినందుకు మాజీ మంత్రులతో సహా 16 మంది నాయకులను బహిష్కరించింది. వారి పార్టీ ప్రాథమిక సభ్యత్వం నుంచి సస్పెండ్ చేసినట్టు జేడీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చందన్ కుమార్ సింగ్ విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. బహిష్కరణకు గురైన వారిలో మాజీ మంత్రి శైలేష్ కుమార్, మాజీ ఎమ్మెల్యేలు శ్యామ్ బహదూర్ సింగ్, సుదర్శన్ కుమార్, మాజీ ఎమ్మెల్సీలు సంజయ్ ప్రసాద్, రణ విజయ్ సింగ్ ఉన్నారు.



