విశాఖకు చెందిన జ్యోతి యర్రాజీ ఆర్థిక పరిస్థితులు సహకరించకపోయినా.. అంతర్జాతీయ స్థాయిలో అథ్లెటిక్స్‌లో రాణిస్తోంది. ఇప్పటి వరకు తొమ్మిది సార్లు జాతీయ రికార్డులు తిరగరాసింది. 20కి పైగా అంతర్జాతీయ పతకాలు సాధించింది. ఇప్పటికే భారత్‌లో వేగంగా పరిగెత్తే మహిళా హర్డ్‌లర్‌గా గుర్తింపు తెచ్చుకుంది. ఇటీవల దక్షిణ కొరియాలో జరిగిన 2025 ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో మహిళల 100 మీటర్ల హర్డిల్స్ 12.96 సెకన్లలో పూర్తి చేసి స్వర్ణం సాధించింది. 13 సెకన్లలోపు దీన్ని సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించింది. స్టేడియంలో అంతగా ప్రేక్షకులు లేకున్నా.. ఆమె అద్భుత ప్రదర్శనతో దేశానికే గర్వకారణంగా నిలిచింది. దీంతో సామాజిక మాధ్యమాల్లో ఆమె పేరు మార్మోగిపోయింది. ఇన్ని రికార్డులు, పతకాలు సాధిస్తున్నా ఇప్పటికీ తగిన గుర్తింపు, ప్రోత్సాహం లభించట్లేదని క్రీడాభిమానులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆంధ్రప్రదేశ్‌లోని విశాఖపట్నం సమీపంలోని పొంబరం గ్రామంలో 1999 ఆగస్టు 28న జన్మించింది జ్యోతి యర్రాజీ. 2025లో దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన ఆసియా ఛాంపియన్‌షిప్‌లో వర్షం కారణంగా ఖాళీ స్టేడియంలో 12.96 సెకన్లతో ఛాంపియన్‌షిప్ రికార్డు సృష్టించి టైటిల్ డిఫెండ్ చేసింది. తైవాన్ ఓపెన్‌లోనూ గోల్డ్ సాధించింది.
కష్టాల హర్డిల్స్ దాటి
పేదరికం అనే అతిపెద్ద హర్డిల్ దాటుకుంటూ, ఆమె సాధిస్తున్న విజయాలు నేటి తరానికి స్ఫూర్తిదాయకంగా నిలుస్తున్నాయి. భారత క్రీడా రంగంలో ఒక సామాన్య మధ్యతరగతి యువతి అసాధారణ శిఖరాలను అధిరోహించిన వైనం జ్యోతి యర్రాజీ సొంతం. జ్యోతి యర్రాజీ తండ్రి సూర్యనారాయణ స్థానికంగా సెక్యూరిటీ గార్డు. తల్లి కుమారి ఓ ప్రయివేట్ ఆసుపత్రిలో పని చేస్తూ తమవంతు సహాయం సహకారాలు అందించారు. తన క్రీడా కలలకు తన పేదరికం సంకెళ్లు వేయకుండా జ్యోతి జాగ్రత్త పడ్డారు. ఆసియా అథ్లెటిక్స్ ఛాంపియన్‌షిప్‌లో 100 మీటర్లు హర్డిల్స్ విభాగంలో ఆమె సాధించిన స్వర్ణ పతకం కేవలం ఒక క్రీడా విజయం మాత్రమే కాదు. అది పేదరికంపై పట్టుదల సాధించిన విజయం. ఒక నిశ్శబ్ద పోరాటం సాధించిన గెలుపుకు సంకేతం.

ఆర్థిక పరిమితులు, మౌలిక వసతుల కొరత ఉన్నప్పటికీ, ఆమె తన సంకల్పాన్ని వదల్లేదు. హర్డిల్స్ రేసులో అడ్డంకులు ఎలాగైతే ఉంటాయో, తన జీవితం లోనూ ఎదురైన సామాజిక, ఆర్థిక అవరోధాలను ఆమె తన మనోధైర్యంతో దాటుకుంటూ, అంతర్జాతీయ వేదికపై త్రివర్ణ పతాకాన్ని రెపరెపలాడించారు. ఆమె ఓడిశాలోని రిలయెన్స్ ఫౌండేషన్ అథ్లెటిక్స్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో ప్రఖ్యాత బ్రిటిష్ కోచ్ జేమ్స్ హిలియర్ పర్యవేక్షణలో శిక్షణ పొందుతున్నారు. తన కోచ్ మార్గదర్శకత్వంలో 12.70 సెకన్ల కంటే తక్కువ సమయాన్ని లక్ష్యంగా పెట్టుకుని, ఒలింపిక్ పతకం కోసం ఆమె కఠోరంగా శ్రమిస్తున్నారు.
క్రికెట్ ఆర్భాటం లేదు.. కానీ!
జ్యోతి యర్రాజీ విజయం సాధించిన వేళ క్రీడా మైదానంలో ఆర్భాటాలు లేవు, చప్పట్లు మోత లేదు. క్రికెట్ వంటి క్రీడలకు లభించే అపరిమితమైన ప్రజాదరణ, వాణిజ్య వెల్లువుతో పోలిస్తే.. ఒక అథ్లెట్ తన రక్తాన్ని చెమటగా మార్చి దేశానికి కీర్తి తెస్తున్నప్పుడు స్టేడియం నిశ్శబ్దంగా ఉండటం మన క్రీడా సంస్కతిలోని లోపాన్ని ఎత్తిచూపుతోంది. అయినప్పటికీ, ”వెయ్యి మంది కేకల కంటే తనలోని గెలవాలనే తపనే మిన్న” అని ఆమె నిరూపించారు. నిజమైన ఛాంపియన్‌కు చప్పట్లు స్ఫూర్తినివ్వవచ్చు, కానీ! వాటి కోసం వారు తమ లక్ష్యాన్ని ఆపకూడదని ఆమె చాటి చెప్పారు.
మానసిక స్థైర్యమే విజయ రహస్యం
హర్డిల్స్ అనేది కేవలం శారీరిక వేగానికి సంబందించిన క్రీడ కాదు. అది సెకనులో వందవ వంతు కాలంతో సాగే మేధో పోరాటం. జ్యోతి యార్రాజీ చూపిన ఏకాగ్రత, మానసిక స్థైర్యం అద్భుతమైనవి. దక్షిణ కొరియాలోని గుమిలో జరిగిన ఆసియా ఛాంపియన్ షిప్‌లో వర్షం కారణంగా స్టేడియం ఖాళీగా ఉన్నా, 12.96 సెకన్లతో రికార్డు సష్టించి టైటిల్ డిఫెండ్ చేయడం ఆమె చిత్తశుద్ధికి నిదర్శనం. తైవాన్ ఓపెన్‌లోనూ పసిడి సాధించిన జ్యోతి, వనరుల కొరతను సాకులుగా చూపించకుండా ఉన్నదానితోనే ఉత్తమమైన దానిని సాధించవచ్చునని నిరూపించారు.
మొదట ఆటలు వద్దనుకున్నారు
జ్యోతి విశాఖపట్నం డీఎల్‌బీ (డాక్ లేబర్ బోర్డు) పాఠశాలలో చదివారు. అక్కడి పీటీ ఉపాధ్యాయులు శ్రీనివాసరెడ్డి జ్యోతి ప్రతిభను గుర్తించారు. జ్యోతిని క్రీడల్లో ప్రొత్సహిస్తే బాగుంటుందని తల్లిదండ్రులకు సూచించారు. ”ఆడపిల్ల అని మొదట్లో ఆటల్లో ప్రొత్సహించేందుకు ఇష్టపడలేదు. కానీ జ్యోతి ఆసక్తిని గమనించి పంపించాం. ఒలింపిక్స్ వరకు వెళ్తుందని మాత్రం ఊహించలేదు.” అని తల్లిదండ్రులు చెప్పారు. ”ఆడపిల్లను ఆటలు ఆడేందుకు పంపిస్తావా అంటూ చుట్టుపక్కల వాళ్లు అనేవారు. ఆ మాటలను మేం పట్టించుకోలేదు. ఇప్పుడు ఒలింపిక్స్‌కు వెళ్లిందంటే వాళ్లే మమ్మల్ని పొగుడుతున్నారు. నేను హౌటల్‌లో వంట పని చేస్తూ జ్యోతిని పెంచిన రోజులు గుర్తుకొస్తున్నాయి” అని అంటారు జ్యోతి తల్లి కుమారి.
తన రికార్డులను తానే తిరగరాసి..
భువనేశ్వర్ హై-పెర్ఫార్మెన్స్ సెంటర్‌లో కోచింగ్ తర్వాత నా ప్రతిభ అందరికీ తెలిసింది. కర్ణాటకలో జరిగిన ఆలిండియా ఇంటర్-యూనివర్శిటీ అథ్లెటిక్స్ మీట్‌లో 13.03 సెకన్లతో స్వర్ణం గెల్చుకుంది. 2020 ఫిబ్రవరిలో జరిగిన ఖేలో ఇండియా యూనివర్సిటీ గేమ్స్‌లో మరో స్వర్ణం సాధించిదామె. ఆ తర్వాత ఏడాది అంతర్జాతీయ ఈవెంట్లకు సిద్ధమైంది. కోవిడ్ కారణంగా 2021 వథాగా పోయింది. ఆ తర్వాత 2022లో భువనేశ్వర్‌లో జరిగిన ఆలిండియా ఇంటర్ యూనివర్సిటీ మీట్‌తో మళ్లీ తన కెరీర్ ను పున:ప్రారంభించింది.
2022 సెప్టెంబర్‌లో గుజరాత్‌లో జరిగిన జాతీయ పోటీల్లో 12.79 సెకన్లతో తన టైమ్ ను మెరుగుపర్చుకుంది. 13 సెకన్ల కంటే తక్కువ సమయంలో రేసును పూర్తి చేసిన మొదటి భారతీయ మహిళగా గుర్తింపు పొందింది. 2022 మే నుంచి ఇప్పటివరకు అనేక సార్లు తన రికార్డును తానే తిరగరాసుకుంది. జ్యోతి ఇప్పటికే చాలాసార్లు జాతీయ రికార్డుల్ని బద్దలు కొట్టారు. ఇప్పటికీ 100మీ. హర్డిల్స్‌లో జాతీయ రికార్డు (12.78 సెకన్లు) ఆమె పేరు మీదనే ఉంది. గతేడాది ఆసియా అథ్లెటిక్స్ చాంపియన్‌షిప్‌లో స్వర్ణాన్ని సాధించారు. తర్వాతి ఆసియా క్రీడల్లో రజతం, ప్రపంచ యూనివర్సిటీ గేమ్స్‌లో కాంస్యాన్ని సాధించారు. ఆమె ఇప్పటి వరకు మూడుసార్లు జాతీయ చాంపియన్‌గా నిలిచారు.
ప్రస్తుతం జ్యోతి యర్రాజీ భారత అథ్లెటిక్స్‌కు ఒక కొత్త దిక్సూచి. ప్రభుత్వం, సమాజం ఇలాంటి ప్రతిభావంతులను ప్రాథమిక స్థాయిలోనే గుర్తించి ప్రోత్సహించాల్సిన అవసరం ఉంది. జ్యోతి పరుగు ఇక్కడితో ఆగదు.ఒలింపిక్స్ వంటి విశ్వవేదికలపై ఆమె భారత్ కీర్తిని మరింత ఎత్తుకు తీసుకెళ్తారని ఆశిద్దాం. ఆమె ప్రస్థానం కేవలం అడ్డంకుల మీద సాగుతున్న ప్రయాణం కాదు. విజయ తీరాల వైపు సాగుతున్న ఒక ప్రభంజనం. జ్యోతి యర్రాజీ ప్రేరణాత్మక ప్రయాణం భారత అథ్లెటిక్స్‌కు కొత్త ఆశలు కలిగించింది!
– అనంతోజు మోహన్‌కృష్ణ 88977 65417



