Thursday, October 9, 2025
E-PAPER
Homeమానవిసృజనాత్మకత ఉంటే చాలు...

సృజనాత్మకత ఉంటే చాలు…

- Advertisement -

పూలను ఇష్టపడని వారు ఎవరుంటారు చెప్పండీ! మన నిత్య జీవితంలో పూలు అనేక విధాలుగా ఉపయోగపడతాయి. అలంకరణ అనగానే ముందుగా గుర్తుకు వచ్చేది పూలే. కంటికి ఇంపుగా స్వచ్ఛమైన తాజా పూలతో చేసే అలంకరణ మనసుకు ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుంది. అయితే ప్రతి పండక్కి, చిన్నపాటి ఫంక్షన్స్‌కి పూలకోసం ఎంతో డబ్బును వెచ్చించే ఆర్ధిక స్థోమత అందరికి ఉండకపోవచ్చు. అటువంటప్పుడు చూడటానికి తాజాగా, ఎప్పుడూ వాడుకునే విధంగా కృత్రిమ పూలు, పూలమాలలు ఇంటి అలంకారం కొరకు తయారు చేస్తున్నారు దివ్య తేజస్విని. సృజనాత్మకత ఉండాలేకాని చిత్తు కాగితాన్ని కూడా అందమైన పువ్వుగా తయారు చేయవచ్చు అని నిరూపిస్తున్న ఆమె పరిచయం నేటి మానవిలో…

వ్యవసాయ కుటుంబానికి చెందిన దివ్య ఆంధ్రప్రదేశ్‌, పశ్చిమ గోదావరి జిల్లాలోని యర్రమల్ల గ్రామంలో పుట్టి పెరిగారు. చిన్నతనం నుండి చదువుతో పాటు కళల పట్ల అభిరుచి. ఎంఎస్సీ, బిఎడ్‌ చేసిన తర్వాత కొన్నాళ్ళు హైదరాబాద్‌లో జూనియర్‌ లెక్చరర్‌గా పని చేసారు. పెండ్లి తర్వాత భర్త ఉద్యోగ రీత్యా బెంగళూరులో స్థిరపడ్డారు. అక్కడకు వెళ్లిన తర్వాత ఖాళీగా ఉండటం ఇష్టం లేక తనకున్న అనుభవంతో హైస్కూల్లో టీచర్‌గా పని చేసారు.

అనుకోని సమస్యలు
జీవితం సాఫీగా సాగితే ఇంకా అనుకోవాల్సిన పని ఏముంటుంది? కరోన సమయంలో భర్త ఉద్యోగం పోవడంతో వారి జీవితం అనుకోని మలుపు తిరిగింది. ఆమె పని చేస్తున్న బడి కూడా మూసివేయడంతో ఆర్థిక ఇబ్బందులు చుట్టుముట్టాయి. అప్పుడు తన పాప కూడా చిన్నది కావడంతో బిడ్డను చూసుకుంటూనే ఇంట్లో ఉంటూ ఏదైనా వ్యాపారం చేయాలని సంకల్పించారు. భారతదేశంలో ఏ చిన్న పండుగ, శుభకార్యం, గృహప్రవేశం, వివాహం, ఏదైనా ఆధ్యాత్మిక కార్యక్రమం జరిగినా పూలు ముఖ్యమైన భాగంగా ఉంటాయి. పూజా మంటపం అలంకరణ, గోడల అందం, వేదికల శోభ… అన్నింటిలో పూలకే ప్రత్యేక స్థానం ఉంది. దీనికి తగ్గట్టుగా ప్రతి ఋతువుకి తగినట్టుగా అనేక రకాల పూలు సులభంగా అందుబాటులో ఉంటాయి. అందుకే చాలా మంది సహజమైన అందం కోసం వేడుకలకు పూలతో అలకరించుకుంటారు.

సహజ పూలలాంటి లుక్‌తో
ఇక్కడ నివసించే వారికైతే పూలకు పెద్ద సమస్య ఉండదు. కానీ విదేశాల్లో నివసిస్తున్న భారతీయులకు ఇది ఒక పెద్ద సమస్య. అక్కడ పూలు చాలా ఖరీదైనవి. ప్రతి పండుగకు, ప్రతి వేడుకకు పూలు కొనడం కష్టసాధ్యం. అంతేకాక పూలు కొద్ది గంటల్లో వాడిపోతాయి, వ్యర్థమవుతాయి. ఇలాంటి సమస్యకు ఇప్పుడు ఒక కొత్త పరిష్కారం లభిస్తోంది. అవే ప్రీమియం క్వాలిటీ ఫ్యాబ్రిక్‌ గార్లాండ్స్‌ (బట్టతో తయారైన పూలమాలలు). మృదువైన, సహజ పూలలాంటి లుక్‌తో ఇవి కనిపిస్తాయి. పైగా వాటిని శుభ్రం చేసి తిరిగి వాడుకోవచ్చు. కనుక ఒకసారి కొనుగోలు చేస్తే పలుమార్లు ఉపయోగించవచ్చు ప్రతి పండుగ, వివాహం, హోమం, గృహప్రవేశం మొదలైన సందర్భాలకు సరిపోయే డిజైన్లు దొరుకుతాయి. తాజా పూల అందంతో మనసుకు హత్తుకునేలా ఉంటున్నాయి. అన్ని విధాలుగా ఆలోచించి ఈ వ్యాపారాన్నే ప్రారంభించారు దివ్య.

భర్త ప్రోత్సాహంతో
వ్యాపారం ప్రారంభించిన కొత్తలో అనేక సమస్యలు ఎదుర్కొన్నారు. ఇది అంత లాభసాటి కాదని చాలా మంది భయపెట్టే ప్రయత్నం కూడా చేశారు. కానీ అవేవీ ఆమె పట్టించుకోలేదు. భర్త ప్రోత్సాహంతో ముందుకే నడిచారు. బిడ్డను చూసుకుంటూ చిన్నగా తన వ్యాపారాన్ని ప్రారంభించారు. అందమైన డిజైన్లతో విభిన్న రంగులలో అచ్చం పూలలా కనిపించే మాలలు తయారు చేయడం మొదలుపెట్టారు. ఎంతో ఆకర్షణీయంగా ఉండే ఆమె పూల మాలలను చాలా మంది ఇష్టపడ్డారు. చిన్న చిన్న ఫంక్షన్లు, వేడుకలతో మొదలైన ఆమె వ్యాపారం ఇప్పుడు ముందుకు దూసుకుపోతుంది. ఒకప్పుడు ఈ వ్యాపారం అంత గిట్టుబాటు కాదు అన్నవారే ఇప్పుడు ఆమెను మెచ్చుకుంటున్నారు.

ఆటుపోట్లు తప్పవు
కుటుంబాన్ని కలిపే శుభసందర్భాలలో పూలమాలలు ఒక సంప్రదాయం, ఒక ఆనందానికి ప్రతీక. ఇప్పుడు ఆ సంప్రదాయాన్ని కోల్పోకుండా ఖర్చు తగ్గించి, శాశ్వత సౌందర్యాన్ని పొందడం సాధ్యమైంది. భారతదేశం మాత్రమే కాదు ప్రపంచంలోని ఏ మూలలో ఉన్నా ఈ ప్రీమియం రియూజబుల్‌ గార్లాండ్స్‌తో ప్రతి వేడుకను మరింత అందంగా, మరింత ప్రత్యేకంగా చేసుకోవచ్చు. ప్రతీ మహిళా తన ఆలోచనా పరిజ్ఞానాన్ని ఎప్పటికప్పుడు మెరుగు పరచుకోవాలి. తనలోని శక్తి అనిర్వచనీయం. కుటుంబ నేపధ్యం వల్ల కాని, పరిస్థితుల వల్ల కాని ఎన్ని ఒడిదుడుకులు ఎదురైనా తాను ఎంచుకున్న మార్గంలో పట్టు వదలకుండా అనుకున్నది సాధించగలగాలి. ఒక స్త్రీ వ్యాపార రంగంలోకి వచ్చాక ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కోక తప్పదు. నన్ను భయపెట్టడానికి ప్రయత్నించిన వాళ్లే ఎక్కువ. అయినా అధైర్య పడకుండా మా వారు రవి ఇచ్చిన ప్రోత్సహంతో ఈ రంగంలోకి అడుగు పెట్టాను’ అని అంటున్నారు దివ్య తేజస్విని.

పాలపర్తి సంధ్యారాణి

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -