కాంగ్రెస్ నేతలకు కేటీఆర్ సవాల్
సోనియాను బలిదేవత, రాహుల్‌ను ముద్దపప్పు అన్నది నిజం కాదా?
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
సోనియా గాంధీని బలిదేవత, రాహుల్‌గాంధీని ముద్దపప్పు అన్న సీఎం రేవంత్‌రెడ్డిని నిలదీయాలని కాంగ్రెస్ నేతలకు బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కె తారక రామారావు (కేటీఆర్) సవాల్ విసిరారు. గాంధీ కుటుంబాన్ని రేవంత్‌రెడ్డి తిట్టిన మాటలు నిజం కాదా?అని ప్రశ్నించారు. ఆయన చేసిన దూషణలను మరిచిపోయి తనపై మాట్లాడటం ఏంటని అడిగారు. గురువారం హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో శేరిలింగంపల్లి నియోజకవర్గానికి చెందిన గొట్ట నరేందర్ యాదవ్ భారీ ఎత్తున అనుచరులు, కార్యకర్తలతో కేటీఆర్ సమక్షంలో బీఆర్‌ఎస్ పార్టీలో చేరారు. వారికి గులాబీ కండువా కప్పి పార్టీలో ఆహ్వానించారు. రాహుల్ గాంధీని, సోనియా గాంధీని అడ్డగోలుగా తిట్టిన రేవంత్‌రెడ్డిని తెచ్చి ముఖ్యమంత్రిని చేసుకున్న విషయాన్ని కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, మంత్రులు, నేతలు మరిచిపోయారని ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీపై తాను చేసిన వ్యాఖ్యలు గతంలో రేవంత్‌రెడ్డి అనేకసార్లు చేశారని గుర్తు చేశారు. కాంగ్రెస్ నాయకులకు దమ్ముంటే రేవంత్‌రెడ్డిపై ప్రతాపం చూపించాలని కేటీఆర్ సవాల్ విసిరారు. రేవంత్ రెడ్డిని తప్పుపట్టడం చాతగాని కాంగ్రెస్ నేతలు తనపై మాట్లాడుతున్నారని అన్నారు. ఆరు గ్యారంటీల అమలుపై రేవంత్‌రెడ్డిని, రాహుల్ గాంధీని తప్పకుండా ప్రశ్నిస్తూనే ఉంటామని స్పష్టం చేశారు. శేరిలింగంపల్లి నియోజకవర్గంలో బీఆర్‌ఎస్ తరఫున గెలిచి కేవలం భూములను కాపాడుకోవడం కోసం రేవంత్‌రెడ్డి పక్కన ఎమ్మెల్యే అరెకపూడి గాంధీ చేరి డబ్బులకు అమ్ముడుపోయాడని ఎద్దేవా చేశారు. ఆయన బీఆర్‌ఎస్‌కు ద్రోహం చేసి వెళ్లిపోయారని అన్నారు. ”హైడ్రా” పేరుతో నియోజకవర్గంలో పేదల ఇండ్లు కూలగొడుతున్న తీరును ప్రతి ఒక్కరికి తెలపాలని కేటీఆర్ పిలుపునిచ్చారు.



