45 రోజుల్లో ఖర్చుల లెక్క చెప్పాల్సిందే..
నవతెలంగాణ – మల్హర్ రావు
ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు ఎన్నికల సంఘం నిబంధనల మేరకు ఎన్నికల్లో చేసిన ఖర్చుల లెక్కలను 45 రోజుల్లో అప్పగించాల్సిందే.నిర్లక్ష్యం చేస్తే అనర్హత వేటు తప్పదని ఎన్నికల అధికారులు సూచిస్తున్నారు. 2019లో జరిగిన గ్రామపంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు సభ్యులుగా పోటీ చేసిన జిల్లాలోని పలువురిపై ఎన్నికల సంఘం వేటు వేసినట్లుగా తెలిసింది. సర్పంచ్ అభ్యర్థులుగా పోటీ చేసి ఓడిపోయిన వారిపై అనర్హత వేటు పడినట్లుగా తెలిసింది.ఎన్నికల్లో ఎలాగూ ఓడిపోయాం కదా అని.. లెక్కలు ఇవ్వకపోవడంతో వారిపై ఎన్నికల సంఘం అనర్హత వేటు వేసింది. దీంతో వారు మూడేళ్లపాటు మరే ఇతర పదవులకు పోటీ చేసే అవకాశా న్ని కోల్పోయారు. ఇక మరికొంత మంది వార్డు సభ్యులుగా గెలుపొందిన వారు కూడా లెక్కలు ఇవ్వ కపోవడంతో అనర్హత వేటు పడి పదవిని కోల్పోయారు.వార్డు సభ్యులుగా పోటీ చేసిన ఓడిపోయిన వారిలో చాలా మంది లెక్కలు ఇవ్వకపోవడంతో వారిపైనా అనర్హత వేటు పడింది.
ప్రతి అభ్యర్థి లెక్కలు ఇవ్వాలి…
గ్రామ పంచాయతీ ఎన్నికల్లో సర్పంచ్, వార్డు మెంబర్లుగా పోటీ చేసే అభ్యర్థులు కచ్చితంగా లెక్కలు ఇవ్వాలి. నామినేషన్ దాఖలు చేసినప్పటి నుంచి పోలింగ్ వరకు ఎంత డబ్బు ఖర్చు చేశారో వాటికి సంబంధించిన ఆధారాలతో కూడిన వివరాలను ఎన్నికల అధికారులకు అందించాలి. లేదంటే గెలిచిన వారు పదవులు కోల్పోతారు. మూడేళ్లపాటు పోటీకి అనర్హులు అవుతారు. ఓడిన వారు కూడా ఇవ్వాల్సిందే. లేదంటే వారిపైనా మూడేళ్ల పాటు అనర్హత వేటు పడుతుందని అధికారులు చెబుతున్నారు.


