Saturday, August 30, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుకదిలిస్తే కన్నీరే..

కదిలిస్తే కన్నీరే..

- Advertisement -

భవనమెత్తు నీటితో బతుకుతామనుకోలే
కామారెడ్డిలో ప్రజల దీనస్థితి
సెల్ఫ్‌లు ఎక్కి ప్రాణాలు కాపాడుకున్న పలువురు
చుట్టు చిమ్మచీకట్లు.. పదిగంటల పాటు నరకయాతన
కన్నెత్తి చూడని అధికారులు, ఎమ్మెల్యే
ఇండ్లల్లో పేరుకున్న అడుగులోతు బురద
ఇప్పట్లో తేరుకోవడం కష్టమే
ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించి
ఆదుకోవాలని జనం వినతి
కేంద్రసహాయంపై నోరెత్తని బీజేపీ ప్రజా ప్రతినిధులు
నవతెలంగాణ-నిజామాబాద్‌ ప్రాంతీయ ప్రతినిధి

ఏకధాటిగా కురిసిన భారీ వర్షంతో తొలుత ఇంటి గేటు వరకు వరద నీరు వచ్చింది. ఆ తర్వాత గడపదాటి ప్రవాహం ఇంట్లోకి పెరిగిపోవడంతో దిక్కుతోచని పరిస్థితి. ఇండ్లల్లోకి నడుము లోతు నీరు రావడంతో బయటకు వెళ్లే పరిస్థితి లేక పలువురు సెల్ఫ్‌లు ఎక్కి తమ ప్రాణాలను రక్షించుకోగా.. మరికొంత మంది పక్కనే ఉన్న ఎత్తైన భవనాల్లోకి వెళ్లారు. భవనమెత్తు నీరు. చుట్టు చిమ్మ చీకటి. అలానే బిక్కుబిక్కుమంటు దాదాపు పది గంటల పాటు నరకయాతన. ఆ సమయంలో అధికారులు కానీ ఇటు ఎమ్మెల్యే కానీ పట్టించుకున్న పాపాన పోలేదు. సహాయం గురించి మాట్లాడుతున్న బీజేపీ నేతలు, కేంద్రసాయం గురించి మాటమాత్రమైనా ప్రస్తావించలేదు. బాధితులను పలకరించి మాట్లాడిస్తే కన్నీటి పర్యంతమవుతున్నారు. ఇంతటి వరదను తాము గతంలో ఎన్నడూ చూడలేదని.. భవనమెత్తు నీరు రావడంతో తాము బతుకుతామని అనుకోలేదని నవతెలంగాణ బృందం వెళ్లి పలకరించినప్పుడు ఉబికి వచ్చిన కన్నీటితో కుమిలిపోతున్నారు. కామారెడ్డి జిల్లా కేంద్రంలో వరదలతో బీఆర్‌ కాలనీతో పాటు హౌజింగ్‌బోర్డు కాలనీల్లో బాధిత కుటుంబాల దీనావస్థపై ప్రత్యేక కథనం.

ఉప్పొంగిన పెద్ద చెరువు..
కామారెడ్డి జిల్లా కేంద్రంలో కురిసిన కుంభవృష్టితో శివారులో ఉన్న పెద్దచెరువు ఉప్పొంగింది. భారీ వర్షంతో కాలువలు ఉధృతంగా ప్రవహించాయి. పట్టణంలోని బీఆర్‌ కాలనీతో పాటు హౌజింగ్‌ బోర్డు కాలనీలు నీట మునిగాయి. భవనం ఎత్తు నీరు రావడంతో ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని గడిపారు. బుధవారం తెల్లవారు జామున 5 గంటలకు వర్షం ప్రారంభం కాగా.. 11 గంటల నుంచి 12 గంటల వరకు వరద నీరు ఇండ్లను ముంచెత్తింది. ఒక అంతస్తు భవనం వరకు నీట మునిగింది. రాత్రి 10 గంటల వరకు వరద ప్రవాహం ఇండ్లల్లో ఉండిపోయింది.

బతుకుతామని అనుకోలే..
చాకలి లింగం తన భార్య, వికలాంగురాలైన కూతురుతో బీఆర్‌ కాలనీలో ఓ ఇంట్లో అద్దెకు ఉంటున్నాడు. వరద ఇంటిని ముంచెత్తడంతో ఎటు వెళ్లలేని పరిస్థితి. మంచం మీద కూర్చుందామనుకుంటే మంచం సైతం నీటిలో ఉండిపోయింది. ప్రవాహం మరింత పెరగడంతో అతికష్టం మీద ముగ్గురు కలిసి పై సెల్ఫ్‌ మీదకు ఎక్కి కూర్చున్నారు. చుట్టుపక్కల వారికి, బంధువులకు ఫోన్‌ చేసినా ఎవరూ వచ్చి కాపాడలేని నిస్సహాయత. పది గంటల పాటు బిక్కుబిక్కుమంటూ అలానే గడిపారు. వరద తగ్గడంతో ఊపిరిపీల్చుకున్నారు. వారిని పలకరిస్తే బతుకుతామని అనుకోలేదని కన్నీరు పెట్టుకుంటున్నారు.

రూపాయిరూపాయి కూడబెట్టుకొని..
కిరాయి ఉండే రాజు కుటుంబం రూపాయి రూపాయి కూడబెట్టుకుంటూ ఇంట్లో టీవీ, కూలర్‌, సోఫా, ప్రిడ్జ్‌ ఇతరత్రా వస్తువులు కొనుగోలు చేస్తే.. ఇంటిని వరద ముంచెత్తడంతో అవన్నీ పనికిరాకుండా పోయాయి. వరద వస్తుంటే కట్టుబట్టలతో పక్కనే ఉన్న రెండంతస్తుల భవనంపైకి వెళ్లి రక్షణ పొందారు. కానీ అక్కడ తినేందుకు, తాగేందుకు ఏమీ లేకపోవడంతో అతికష్టం మీద ట్యాంక్‌ లోని నీళ్లను తీసుకొని వేడి చేసుకొని తాగి పది గంటల పాటు అక్కడే గడిపారు. మెకానిక్‌గా పని చేస్తూ కారును కిరాయికి ఇస్తూ జీవనం పొందుతుండగా.. వరదలతో కారు కొట్టుకుపోయింది. జీవనాధారం కోల్పోగా.. ఇంట్లోని వస్తువులన్నీ పాడైపోవడంతో సుమారు 10 లక్షల మేర ఆస్తినష్టం వాటిల్లినట్టు వాపోతున్నారు. ఇలా పలకరించిన ప్రతి కుటుంబానిది కన్నీటి వ్యథలే వినిపిం చాయి. బీఆర్‌ కాలనీలో 30 కుటుంబాలకు తీవ్ర నష్టం వాటిల్లింది. వందలాది కుటుంబాలు వరద తాకిడికి లోనయ్యాయి.

రాత్రి వరకు పత్తాలేని అధికారులు, ఎమ్మెల్యే
భారీ వర్షాలతో వరద ముంచెత్తినా.. అధికారులు కనీస సమాచారం ఇవ్వకపోగా.. వారిని అప్రమత్తం చేసిన దాఖలాలు లేవు. ఉదయం నుంచి రాత్రి వరకు వరద నీటిలోనే గడిపినా.. అధికారులు, స్థానిక ఎమ్మెల్యే వెంకట రమణారెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని బాధితులు మండిపడుతున్నారు. వరద తగ్గిన తర్వాత రాత్రి సమయంలో వచ్చి హడావిడి చేశారే తప్పా.. వరద ముంచెత్తిన సమయంలో బోట్లు తీసుకొచ్చి తమను ఇతర ప్రాంతాలకు తరలించిన దాఖలాలు లేవని మండిపడుతున్నారు.

ఇండ్లల్లో పేరుకుపోయిన బురద..

వరద తగ్గడంతో ప్రస్తుతం ఏ ఇంట్లో చూసినా బురద పేరుకుపోయి కనిపించింది. చెట్టుకొమ్మలు కొట్టుకొచ్చి ఇండ్లల్లోకి చేరాయంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. వరద వచ్చిన సమయంలో పాములు సైతం రావడంతో మరింత భయాందోళనకు గురైయ్యారు. భవనమెత్తు నీరు చేరడంతో ఇండ్లల్లో టీవీలు, ప్రిడ్జిలు, సోఫాలు, కూలర్‌లు, వాషింగ్‌మెషిన్‌తో పాటు ఇతర వస్తువులు చెడిపోయాయి. ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది.

ప్రభుత్వం ఆదుకునేనా..?
బీఆర్‌ కాలనీలో వరదతో పలు కుటుంబాలు తీవ్ర నష్టాన్ని చవిచూశాయి. కట్టుబట్టలతో ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని ఇతర చోట ఆశ్రయం పొందారు. బియ్యంతో సహా.. ఇతర నిత్యావసర వస్తువులు మొత్తం నీటిపాలైయ్యాయి. ఎలక్ట్రానిక్‌ వస్తువులు, ఇతర సామగ్రి ఉపయోగంలోకి రాకుండా పోయాయి. దీంతో ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల ఆస్తినష్టం వాటిల్లింది. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad