నవతెలంగాణ-హైదరాబాద్: ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఐఐటి) బాంబేకు చెందిన విద్యార్థి శనివారం తెల్లవారుజాము సమయంలో హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయాన్ని ముంబై పోలీసులు వెల్లడించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆత్మహత్యకు పాల్పడిన విద్యార్థి రోహిత్ (22). ఢిల్లీకి చెందినవాడని పోలీసులు తెలిపారు. అతను ఐఐటి బొంబాయిలో సైన్స్ స్ట్రీమ్‌లో చదువుతున్నాడు. శనివారం తెల్లవారుజామున సుమారు 2.30 గంటల సమయంలో అతన హాస్టల్ భవనంపై నుంచి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. వెంటనే దగ్గరలోని ఆసుపత్రికి తరలించినా.. ఫలితం లేకపోయింది. అప్పటికే ఆ విద్యార్థి మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించినట్లు పోలీసులు తెలిపారు.
కాగా, ఫోన్ మాట్లాడుకుంటూ టెర్రస్‌పైకి వెళ్లేటప్పటికి.. ఆ సమయంలోనే రోహిత్ హాస్టల్ భవనంపై నుంచి దూకినట్లు ప్రత్యక్ష సాక్షి అదే హాస్టల్‌కి చెందిన మరో విద్యార్థి తెలిపారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.