కంచిపీఠం సేవలు ముదావాహం
శంకర్ కంటి ఆస్పత్రిలో సూపర్ స్పెషాలిటీ బ్లాక్ ప్రారంభోత్సవ సభలో సిఎం చంద్రబాబు
గుంటూరు : ఆరోగ్యంగా లేకపోతే ఎన్ని ఆస్తులున్నా నిరుపయోగమేనని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గుంటూరు జిల్లా పెదకాకానిలోని శంకర్ కంటి ఆస్పత్రి ప్రాంగణంలోనే ప్రపంచ స్థాయి ప్రమాణాలతో నిర్మించిన సూపర్ స్పెషాలిటీ ఐ కేర్ బ్లాక్‌ను ఆదివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో చంద్రబాబు మాట్లాడుతూ… డబ్బు, బంగ్లాలు, కార్లు, హోదా ఎన్ని ఉన్నా మంచి ఆరోగ్యం లేకపోతే ఉపయోగం లేదన్నారు. అనారోగ్యమే నిజమైన పేదరికమని, ప్రతి ఒక్కరూ తమ ఆరోగ్యాన్ని కాపాడుకుంటూ ఇతరులకు సేవ చేయాలని కోరారు. ప్రజారోగ్యాన్ని కాపాడేందుకు కంచిపీఠం ద్వారా శంకర్ ఆస్పత్రి చేస్తున్న సేవలను కొనియాడారు. శంకర్ కంటి ఆస్పత్రుల ద్వారా దేశవ్యాప్తంగా పది రాష్ట్రాల్లో 14 ఐ హాస్పిటల్స్ నిర్మించి ఇప్పటి వరకు 30 లక్షల మందికి ఉచితంగా కంటి శస్త్ర చికిత్సలు, 70 లక్షల మంది చిన్నారులకు కంటి పరీక్షలు చేయడం సాధారణ విషయం కాదన్నారు. ఈ ఆస్పత్రుల్లో రోజుకు సగటున 750 ఉచిత కంటి శస్త్ర చికిత్సలు జరుగుతున్నాయని వివరించారు. 2003 నుంచి గుంటూరులో నిర్మించిన శంకర్ ఆస్పత్రి పేదలకు ఉచిత వైద్యం అందించడం ముదావాహం అన్నారు. శంకర్ ఆస్పత్రి ద్వారా గ్రామీణ సేవా ప్రాజెక్ట్ ‘గిఫ్ట్ ఆఫ్ విజన్’ కింద ఇప్పటివరకు 32,000కు పైగా కంటి శిబిరాలు నిర్వహించడం విశేషమని పేర్కొన్నారు. రాష్ట్రంలో ఐదు కోట్ల మంది ఆరోగ్యాన్ని కాపాడేందుకు ఆరోగ్య రికార్డులన్నీ డిజిటలైజేషన్ చేస్తున్నామని తెలిపారు. రాబోయే రోజుల్లో ఆరోగ్యం విషయంలో ప్రపంచానికి ఎపి ఒక మోడల్‌గా ఉంటుందన్నారు. హెల్తీ, వెల్తీ, హ్యాపీ ఎపి అనేది మా విధానమని తెలిపారు. కంచి పీఠం స్వామీజీ శ్రీ శంకర విజేయంద్ర సరస్వతి మాట్లాడుతూ.. తమ పీఠం విద్య, వైద్యం, పేదరిక నిర్మూలన వంటి పలు సేవా కార్యక్రమాలను నిర్వహిస్తోందన్నారు. కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ప్రభుత్వ చీఫ్ విప్ జి.వి.ఆంజనేయులు, ఎమ్మెల్యేలు దూళిపాళ్ల నరేంద్ర, బూర్ల రామాంజనేయులు, ఏలూరు సాంబశివరావు, తెనాలి శ్రావణ్‌కుమార్, ఎలక్ట్రానిక్స్ కార్పొరేషన్ చైర్మన్ మన్నవ మోహన్‌కృష్ణ, శంకర్ కంటి ఆస్పత్రుల ట్రస్టు నిర్వాహాకులు పద్మశ్రీ ఆర్.వి.రమణ, జె.కె.రెడ్డి, మురళీకృష్ణమూర్తి, జానకిరాం తదితరులు పాల్గొన్నారు.
అనారోగ్యమే నిజమైన పేదరికం
- Advertisement -
- Advertisement -



