Friday, September 19, 2025
E-PAPER
Homeరాష్ట్రీయంజగన్‌ను కలవడానికి వెళ్లడం లేదు

జగన్‌ను కలవడానికి వెళ్లడం లేదు

- Advertisement -

నాపై దుష్ప్రచారం.. నమ్మొద్దు
సీఎంపైనా, ప్రభుత్వంపైనా వ్యతిరేక ప్రచారం
ఏమైనా ఉంటే మీడియా సమావేశం పెట్టి చెబుతా : మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి

నవతెలంగాణ-చౌటుప్పల్‌రూరల్‌
”గుంటూరులో ఓ ప్రయివేటు కార్యక్రమానికి హాజరవ్వడానికి వెళ్తున్నా.. కానీ కొన్ని ఛానల్స్‌, సోషల్‌ మీడియాలో నేను మాజీ సీఎం జగన్మోహన్‌రెడ్డిని కలవడానికి వెళ్తున్నట్టు పుకార్లు సృష్టిస్తున్నాయి.. అది నిజం కాదు.. నా రాజకీయం, భవిష్యత్‌ గురించి ఏమైనా ఉంటే మీడియా సమావేశం పెట్టి చెబుతా..” అని మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి అన్నారు. నల్లగొండ జిల్లా చిట్యాల మండలంలోని పెద్దకాపర్తి సమీపంలోని ఓ హోటల్‌లో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను రాజీనామా చేస్తున్నానని, పార్టీ మారుతున్నానని, పార్టీ పెడుతున్నానని.. ఇలా రకరకాలుగా తప్పుడు వార్తలు రాస్తున్నారన్నారు. కొందరు గిట్టని వ్యక్తులు తన ప్రతిష్ట దెబ్బతీయడానికి సోషల్‌ మీడియా ద్వారా అవాస్తవాలు ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. దయచేసి పుకార్లను తెలంగాణ సమాజం నమ్మొదని విజ్ఞప్తి చేశారు. తన వెంట గుంటూరుకు నియోజకవర్గం నుంచి కూడా కొందరు నాయకులు వస్తున్నారని తెలిపారు. గుంటూరులో ప్రయివేటు కార్యక్రమంలో పాల్గొన్న తర్వాత అటు నుంచి విజయవాడకు వెళ్లి అమ్మవారి దర్శనం చేసుకొని వద్దామని వెళ్తున్నామని తెలిపారు. ఈ మధ్యకాలంలో ఓ పేపర్‌ పేరుతో ప్రింట్‌ చేసి.. ”కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి లేదన్న రాజగోపాల్‌రెడ్డి” అనే శీర్షికన తాను అనని మాటలు అన్నట్టు ప్రచారం చేశారని చెప్పారు.

కాళేేశ్వరం ప్రాజెక్టు అవినీతి గురించి మొట్టమొదట అసెంబ్లీలో ప్రస్తావించిందే తాను అని అన్నారు. మంత్రి పదవి లేదన్న కోపంతో సీఎం రేవంత్‌రెడ్డిపైనా, ప్రభుత్వంపైనా తాను అనని మాటలను అన్నట్టు తప్పుడు కథనాలు రాసి ప్రచారం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తనపై వచ్చే తప్పుడు వార్తలను, అబద్ధాలను తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. తాను కాంగ్రెస్‌ కార్యకర్తగా ఎంపీగా, ఎమ్మెల్సీగా, రెండుసార్లు ఎమ్మెల్యేగా గెలిచానని తెలిపారు. కాంగ్రెస్‌, సోనియా గాంధీ, రాహుల్‌ గాంధీపై ఎంతో అభిమానం ఉందన్నారు. పార్టీ శ్రేయస్సు దృష్ట్యా, బలోపేతం చేయడానికి కొన్ని సందర్భాలలో.. ఈవిధంగా చేస్తే బాగుంటుందన్న ఉద్దేశంతో కొన్ని వేదికల్లో అంతర్గతంగా బహిర్గతంగా చెప్పానని తెలిపారు. త్రిబుల్‌ ఆర్‌ అలైన్‌మెంట్‌ విషయంలో కొంతమంది అనుకూలంగా మార్చుకున్నారని అనుమానాలు ఉన్నాయన్నారు. భూనిర్వాసితుల విషయంలో కూడా తగిన పరిహారమిచ్చి న్యాయం చేస్తే బాగుంటుందని అభిప్రాయం చెప్పానని వివరించారు. తనపై వస్తున్న దుష్ప్రచారాలను నమ్మొద్దని విజ్ఞప్తి చేశారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -