ప్రపంచంలో పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం ప్రారంభం కావడానికి తెరతీసిన పారిశ్రామిక విప్లవం బ్రిటన్‌లో జౌళి మిల్లులలో మొదలైంది. అయితే బ్రిటన్ కాని, యూరప్ ఖండం ఉత్తర భాగంలో ఉన్న తక్కిన దేశాలలో గాని ముడి పత్తి పండదు. అంటే, పారిశ్రామిక పెట్టుబడిదారీ విధానం పుట్టుక నుండే ముడిసరుకులు ప్రపంచంలో ఎక్కడెక్కడ లభిస్తాయో వాటినల్లా సంపన్న దేశాలు చేజిక్కించుకోవడం మీద ఆధారపడి కొనసాగింది. ఇన్ని శతాబ్దాల తర్వాత కూడా ఈ పరిస్థితిలో ఇసుమంతైనా మార్పులేదు. కాలం గడుస్తున్న కొద్దీ సంపన్న పెట్టుబడి దారీ దేశాల్లో ఉత్పత్తి చేసే సరుకులు మారి కొత్త కొత్తవి వచ్చాయి. వాటికి కావలసిన ముడిసరుకులు కూడా మారుతూ వచ్చాయి. ఈ ముడిసరుకులలో చాలా గణనీయమైన భాగం ఈ సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు వెలుపలి నుండే నిరంతరాయంగా సరఫరా ఔతున్నాయి. వాటి సరఫరా ఎటువంటి ఒడిదుడుకులూ లేకుండా కొన సాగడం అనేది సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు చాలా ముఖ్యం. ఆ విధంగా నిరాటంకంగా ముడిసరుకుల సరఫరా కొనసాగాలంటే బయట ప్రపంచం మీద సంపన్న పెట్టుబడిదారీ దేశాల ఆధిపత్యం కొనసాగించడం వాటికి అవసరం.
ఈ విధంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు వెలుపలి ప్రపంచం నుండి ముడిసరుకు సరఫరా సాధారణ సరుకుల మారకం పద్ధతిలోనే జరుగుతుందని సాంప్రదాయ బూర్జువా అర్ధశాస్త్ర పండితులు భావిస్తారు. ఇంకోలా చెప్పాలంటే, ఈ ముడిసరుకులన్నీ అప్పటికే సరుకులుగా ఉత్పత్తి ఔతున్నట్టు, అవి తగినంత పరిమాణాల్లో మార్కెట్‌లో లభిస్తున్నట్టు, మార్కెట్‌లో మామూలుగా ఉండే ధరల హెచ్చుతగ్గులకు తగ్గట్టు ఈ ముడిసరుకుల ధరలు కూడా నిర్ణయించబడుతున్నట్టు, అందుచేత వాటి మీద సామ్రాజ్యవాదం ఎటువంటి నియంత్రణనూ చెలాయించవలసిన అవసరం లేదన్నట్టు వారు భావిస్తారు. అంతేగాక అన్ని ముడిసరుకులూ అప్పటికే పెట్టుబడిదారీ ఉత్పత్తి సంబంధాల పరిధిలోనే ఉత్పత్తి ఔతున్నట్టు వారు పరిగణిస్తారు. ఈ వాదన ద్వారా బూర్జువా ఆర్థికవేత్తలు అసలు సామ్రాజ్యవాదం అనేదే ఎక్కడా ఉనికిలో లేదని, ఉన్నదంతా సాధారణ బూర్జువా మార్కెట్ విధానమేనని చెప్పదలచుకున్నారు. వారు చెప్పేది చూస్తే ఇప్పటికే ప్రపంచం యావత్తూ పెట్టుబడిదారీ ప్రపంచంగా మారిపోయినట్టు, అంతా సంపన్న పెట్టు బడిదారీ దేశాలకు అనుకూలంగా వ్యవహరిస్తున్నట్టు అనుకోవాలి. అంతకన్నా విడ్డూరం వేరే ఏమీ లేదు.
పెట్టుబడిదారీ వ్యవస్థకి సామ్రాజ్యవాద లక్షణం అనేది లేనే లేదని చెప్పడానికి వారు మరొక వాదన కూడా ముందుకు తెస్తారు. సంపన్న పెట్టుబడిదారీ దేశాలు చేసే మొత్తం ఉత్పత్తిలో వారు ఉపయోగించే ముడిసరుకు మొత్తం విలువ చాలాతక్కువ శాతమే ఉంటుందని, అందుచేత అంత స్వల్పవిలువ గల ముడిసరుకు కోసం పెట్టుబడి దారీ వ్యవస్థ ఏకంగా ప్రపంచం మొత్తాన్ని తన ఆధిపత్యం కిందకు తెచ్చుకునే పెద్ద ప్రయత్నాన్ని అసాధారణ రీతిలో ఎందుకు చేస్తుందని వారు అడుగుతారు.
హారీ మెగ్‌డాఫ్ తన ‘ఏజ్ ఆఫ్ ఇంపీరియలిజం’ అన్న గ్రంథంలో ఈ వాదనకు సమాధానం ఇచ్చారు. ముడిసరుకులను ఉపయోగించకుండా ఏ సరుకునూ ఉత్పత్తి చేయడం జరగదని, అలా ఉపయోగించే ముడిసరుకు మారకపు విలువ ఎంత తక్కువ అయినా దాని ఉపయోగపు విలువ మాత్రం చాలా ఎక్కువని అతడు వివరించాడు. మారకపు విలువలు సామాజికంగా నిర్ణయించబడతాయి కనుక సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ఆ ముడిసరుకుల విలువలను దాదాపు సున్నా స్థాయికి దిగ్గోస్తారని తెలిపాడు. అయితే, ఆ ముడిసరుకుల వాస్తవ ఉపయోగం సహ జంగా నిర్ణయించబడుతుంది కనుక అవి లేకుండా సరుకుల ఉత్పత్తి చేయడం అసాధ్యం ఔతుంది. ఆ కారణంగా వాటిని బయటనుండి ఎలాగైనా తెచ్చుకోవడం సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు తప్పనిసరి ఔతుంది. అందుచేత ముడిసరుకుల మారకపు విలువ చాలా స్వల్పం కనుక వాటిని పొందడం కోసం చేసే ప్రయత్నానికి పెద్ద ప్రాధాన్యత ఉండదన్న బూర్జువా పండితుల వాదనలు చాలా పొరపాటు.
వ్యవసాయం ద్వారా లభించే ముడిసరుకులు, ఆహార పంటలు సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు ముఖ్యమైన అవసరాలు. వాటి కోసం అవి ప్రపంచం మొత్తంగా భూ వినియోగం తమ అవసరాలకు అనుగుణంగా ఉండేలా చూసుకుం టాయి. ఆ భూ వినియోగం తీరుని వాళ్లే అదుపు చేయడానికి ప్రయత్నిస్తారు. అయితే ఇక్కడ ప్రధానంగా ఖనిజాల గురించి చర్చిస్తాను. సంపన్న దేశాలకు బయటనుండి ముడి ఖనిజాల దిగుమతి ఎంత కీలకమో ఇటీవల అమెరికా అరుదైన మూలకాల (రేర్ ఎర్త్స్) గురించి ఎంతగా ఆరాటపడుతోందో చూస్తే స్పష్టమౌతుంది.
చైనా నుండి వచ్చే దిగుమతుల మీద సుంకాలనను పెంచుతామంటూ ట్రంప్ బెదిరిస్తే, దానికి జవాబుగా చైనా ప్రభుత్వం అమెరికాకు తన వద్ద నుండి కొన్ని అరుదైన మూలకాల ఎగుమతిపై తాత్కాలికంగా నిషేధం ప్రకటిం చింది. ప్రపంచంలో మొత్తంగా ఉత్పత్తి అవుతున్న అరుదైన మూలకాలలో దాదాపు డెబ్బయి శాతం చైనా నుండే జరుగుతున్నాయి. వాటిని ప్రాసెస్ చేసే సామర్ధ్యం కూడా ప్రపంచం మొత్తం మీద తొంభై శాతం చైనా వద్దే ఉంది. చైనా ప్రకటించిన నిషేధంతో అమెరికా ఇరుకున పడింది. చైనాకు బదులుగా వేరే దేశాలనుండి ఆ అరుదైన మూలకాలను దిగుమతి చేసుకోడానికి ప్రయత్నించినా తక్కిన దేశాలేవీ చైనా నుండి వచ్చేంత ఎక్కువ పరిమాణంలో సరఫరా చేయగలిగిన శక్తి కలిగిలేవు. దాంతో అరుదైన మూలకాల సరఫరా అమెరికాకు కొనసాగించేలా చైనాను ఒప్పించడం కోసం తప్పనిసరి పరిస్థితిలో సుంకాల విషయంలో అమెరికా సంప్రదింపులకు దిగివచ్చింది.
ఇక్కడ గమనించవలసిన విషయం ఒకటుంది. 2024లో అమెరికా దిగుమతి చేసుకున్న మొత్తం అరుదైన మూలకాల విలువ కేవలం 17 కోట్ల డాలర్లు. అదే ఏడాదిలో అమెరికా మొత్తం దిగుమతుల (వస్తువులు, సేవలు కలిపి) విలువ 4 లక్షల 11 వేల కోట్ల డాలర్లు! అందులో అచుదైన మూలకాలు కేవలం 0.004 శాతం మాత్రమే. ముడిసరుకుల ఉపయోగపు విలువకు, వాటి మారకపు విలువకు మధ్య ఉన్న తేడా ఎంత ఎక్కువో దీన్ని బట్టి తెలు స్తుంది. మొత్తం దిగుమతుల్లో కేవలం 0.004 శాతం మాత్రమే ఉన్న అరుదైన మూలకాలు ఎలక్ట్రానిక్స్, వాహన తయారీ, విండ్ టర్బైన్లు, అత్యున్నత స్థాయి సామర్ధ్యం కల అయస్కాంతాలు, వైద్య పరికరాలు వంటి పలు విలువైన ఉత్పత్తుల తయారీలో కీలకంగా ఉన్నాయి. అందుచేత వాటి సరఫరా తాత్కాలికంగానైనా నిలిచిపోతే అది సంపన్న దేశాలకు పెద్ద సంకటంగా మారుతుంది.
అందుకనే సామ్రాజ్యవాదులు వాటి సరఫరాపై తమ పూర్తి నియంత్రణ సాధించడానికి ఎంతవరకైనా పోవడానికి తయారౌతారు. చైనా మీద ఆధారపడడాన్ని తగ్గించుకోవడం కోసం అమెరికా ఇతర వనరులను వెతుక్కుం టోంది. గ్రీన్‌ల్యాండ్ మీద తనకు ఆధిపత్యం కావాలని కోరుకుంటున్నది ఇందుకే. గ్రీన్‌ల్యాండ్‌లో అరుదైన మూల కాలతోబాటు వివిధ రకాలైన ఇతర ఖనిజాలను కూడా పొందడానికి అమెరికా ప్రయత్నిస్తోంది. చైనా తన సరఫరాను తాత్కాలికంగానైనా నిలిపివేయడంతో గ్రీన్‌ల్యాండ్ విషయంలో అమెరికా అంత ఆరాటాన్ని ప్రదర్శిస్తోంది. ఐతే ఈ ప్రత్యామ్నాయాలేవీ చైనానుండి వచ్చే సరఫరాతో సరితూగలేవు. ఎందుకంటే ప్రపంచ నిల్వల్లో సగానికి పైగానే అరుదైన మూలకాల నిల్వలు చైనా భూభాగంలో ఉన్నాయి. అమెరికా ఆరాటం అంతా వాటికోసమే.
సామ్రాజ్యవాదం తక్కిన ప్రపంచం మీద ఆధిపత్యాన్ని చెలాయించడానికి ప్రయత్నించడం వెనుక మరొక కారణం కూడా ఉంది. రోజా లక్సెంబర్గ్ ఆ విషయాన్ని చక్కగా నొక్కి చెప్పారు. సంపన్న పెట్టుబడిదారీ దేశాలలో పెట్టుబడి పోగుబడడం అనేది దీర్ఘకాలం కొనసాగేలా జరగాలంటే అవి తమ దేశాలకు వెలుపల ఉన్న పెట్టుబడిదారీ -పూర్వ సమాజాల మార్కెట్లలోకి చొరబడడం చాలా అవసరం. పెట్టుబడిదారీ వ్యవస్థలున్న దేశాల్లో కూడా మార్కెట్లు ఉన్నాయి. వాటిమీద పెత్తనం కోసం కూడా సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ప్రయత్నిస్తాయి. అయితే ప్రపంచీకరణ అమలౌతున్న ఈ కాలంలో మార్కెట్లు కూడా ప్రపంచీకరించబడ్డాయి. అందుచేత ప్రత్యేకంగా సంపన్న పెట్టుబడిదారీ దేశాలు ఈ మార్కెట్ల మీద తమ ఆధిపత్యం కోసం ప్రయత్నం ఏదీ చేయనవసరం లేదు. ఎటొచ్చీ వాటికి అవ సరమైన ముడి సరుకుల విషయంలో మాత్రం సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు మొత్తం ప్రపంచం మీద ఆధిపత్యం చెలాయించడం తప్ప వేరే మార్గం లేదు.
వలసపాలన కాలం ముగిసిన అనంతరం కొత్తగా స్వాతంత్య్రం పొందిన దేశాలు (మూడవ ప్రపంచ దేశాలు), ఆర్థికంగా సామ్రాజ్యవాదం పట్టు నుండి బైట పడడం కోసం తమ సహజ వనరులమీద సర్వాధికారాలూ తమకే ఉండాలని ప్రయత్నించాయి. ఇటువంటి ప్రయత్నాలకు పూనుకున్నందున సామ్రాజ్యవాదం ఆ యా దేశాలలో ప్రభుత్వాలను కూల్చివేసేందుకు కుట్రలు పన్నింది. ఇరాన్ లో మొస్సాదే ప్రభుత్వాన్ని, గ్వాటిమాలా లో ఆర్బెంజ్ ప్రభుత్వాన్ని, చిలీ లో అలెండీ ప్రభుత్వాన్ని, కాంగోలో లుముంబా ప్రభుత్వాన్ని ఆ కారణంగానే కూలదోశాయి. ఆ ప్రభుత్వాలు తమ ఖనిజ సంపదను జాతీయం చేయడానికి పూనుకోవడమే దీని వెనుక ప్రధాన కారణం.
మూడవ ప్రపంచ దేశాల మీద ప్రపంచీకరణను రుద్దడంతో, చాలా దేశాల నుండి ముడి సరుకుల సరఫరా సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు నిరాటంకంగా సాగిపోవడం మొదలైంది. ఎటువంటి కుట్రలూ అవసరం లేకుండానే ప్రపంచీకరణ విధానం సామ్రాజ్యవాదుల అవసరాలను నెరవేర్చుతోంది. ఎవరు ప్రభుత్వం లోకి వచ్చినా, అక్కడ జరిగిన వ్యవస్థీకృత మార్పులు (ప్రైవేటీకరణ వగైరా) సంపన్న పెట్టుబడిదారీ దేశాలకు ఎటువంటి ఇబ్బందులూ రాకుండా గ్యారంటీ చేస్తున్నాయి. ఐతే ఇప్పుడు ఆ నయా ఉదారవాద విధానమే సంక్షోభంలో పడింది. ఈ సంక్షోభం నుండి బైట పడడానికి అమెరికా ఏకపక్షంగా తనదే పైచేయిగా ఉండాలన్న విధానంతో మూడవ ప్రపంచ దేశాల మీద తన షరతులను రుద్దుతోంది. అప్పటినుంచీ పరిస్థితులు మారుతున్నాయి. నూతన పరిస్థితుల్లో మూడవ ప్రపంచ దేశాల్లో సామ్రాజ్యవాదానికి ప్రతిఘటన రానురాను బలపడుతోంది. ఖనిజాలతో సహా తమ దేశాలకు చెందిన ముడి సరుకుల మీద తమ ఆధిపత్యాన్ని తిరిగి నెలకొల్పుకోవడం కోసం మూడవ ప్రపంచ దేశాలలో మొదలైన ప్రయత్నం రానున్న రోజుల్లో బలమైన ఉద్యమంగా మారుతుంది. ఆ విధంగా పెట్టుబడిదారీ సంక్షోభం సామ్రాజ్యవాదాన్ని మరింత బలహీనపరుస్తుంది. బలహీనపడుతున్నకొద్దీ సామ్రాజ్యవాదం మరింత దుర్మార్గంగా వ్యవహరిస్తుంది.
(స్వేచ్ఛానుసరణ)
ప్రభాత్ పట్నాయక్
సామ్రాజ్యవాదం – ఖనిజాలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES