Tuesday, August 26, 2025
E-PAPER
spot_img
Homeఆటలుకొత్త స్పాన్సర్‌ వేటలో..

కొత్త స్పాన్సర్‌ వేటలో..

- Advertisement -

– బీసీసీఐతో డ్రీమ్‌11 ఒప్పందానికి తెర
– కేంద్ర ప్రభుత్వ ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్లు ప్రభావం

నవతెలంగాణ-ముంబయి
ఆసియా కప్‌ 2025 ముంగిట టీమ్‌ ఇండియా జెర్సీ భాగస్వామిని కోల్పోయింది. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘ప్రమోషన్‌ అండ్‌ రెగ్యులైజేషన్‌ ఆఫ్‌ ఆన్‌లైన్‌ గేమింగ్‌ బిల్‌ 2025’కు పార్లమెంట్‌ ఉభయ సభలు ఆమోద ముద్ర వేయటంతో ఇప్పటివరకు భారత క్రికెట్‌ నియంత్రణ మండలి (బీసీసీఐ) జెర్సీ స్పాన్సర్‌గా కొనసాగుతున్న ఆన్‌లైన్‌ ఫాంటసీ స్పోర్ట్స్‌ కంపెనీ ‘డ్రీమ్‌11’ బోర్డుతో బంధాన్ని తెంచుకుంది. ఈ విషయాన్ని డ్రీమ్‌11 యాజమాన్యం బీసీసీఐకి తెలియజేసినట్టు సమాచారం. ప్రభుత్వ నూతన నిబంధనలతో బీసీసీఐ సైతం డ్రీమ్‌11తో భాగస్వామ్యం కొనసాగించేందుకు సుముఖంగా లేదు. మరో 15 రోజుల్లో ఆసియా కప్‌ ఆరంభం కానుండగా.. జెర్సీ పార్ట్‌నర్‌ స్పాన్సర్‌షిప్‌ నుంచి తప్పుకోవటం బీసీసీఐకి ఇరకాటంలో పడేసింది.
రూ.358 కోట్ల ఒప్పందం
2023-26 కాలానికి బీసీసీఐతో డ్రీమ్‌11 సుమారు రూ.358 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఒప్పందం మరో ఏడాది ఉండగానే ప్రభుత్వ నిబంధనలతో డ్రీమ్‌11 వ్యాపారాన్ని నిలిపివేసింది. కొత్త బిల్లు ప్రకారం ఆన్‌లైన్‌ గేములను ఉచితంగా ఆడేందుకు వీలుంది, కానీ వినియోగదారులు డబ్బులు చెల్లించి ఆన్‌లైన్‌ ఫాంటసీ గేమ్‌లు ఆడేందుకు వీల్లేదు. డ్రీమ్‌11 బిజినెస్‌ 90 శాతం వరకు ఫాంటసీ మనీ గేమ్‌పైనే ఆధారపడి ఉంటుంది. మూడేండ్ల ఒప్పందానికి ముందే డీల్‌ నుంచి తప్పుకోవటంతో డ్రీమ్‌11 జరిమానా కట్టాల్సి ఉన్నా.. ప్రస్తుత పరిస్థితుల్లో ఆ ప్రమాదం తప్పింది. ఒప్పందం రూల్స్‌ ప్రకారం ప్రభుత్వ రూల్స్‌ కారణంగా డ్రీమ్‌11 వ్యాపారం దెబ్బతినే పరిస్థితులు ఏర్పడితే.. జరిమానా లేకుండానే ఒప్పందం నుంచి తప్పుకునేందుకు వీలుంది. దీంతో డ్రీమ్‌11 ఎటువంటి పెనాల్టీ కట్టకుండానే జెర్సీ పార్ట్‌నర్‌గా వైదొలగనుంది.
కోలుకోలేని దెబ్బ!
డ్రీమ్‌11కు కొత్త బిల్లు అమలు కోలుకోలేని దెబ్బ. 18 ఏండ్ల క్రితం మొదలైన డ్రీమ్‌11 ప్రస్థానం.. అంచెలంచెలుగా సాగింది. ఇటీవల ఓ సంస్థ అంచనాల ప్రకారం డ్రీమ్‌11 నికర విలువ సుమారు రూ.50 వేల కోట్లు. క్రికెట్‌తో పాటు ఫుట్‌బాల్‌, కబడ్డీ, బాస్కెట్‌బాల్‌ లీగ్‌ల్లో డ్రీమ్‌11 ఒప్పందాలు చేసుకుంది. ఐసీసీ ఫాంటసీ గేమ్‌ పార్ట్‌నర్‌గా ఒప్పందం చేసుకున్న డ్రీమ్‌11.. కరీబియన్‌ ప్రీమియర్‌ లీగ్‌, బిగ్‌బాష్‌ లీగ్‌, ది హండ్రెడ్‌, న్యూజిలాండ్‌ దేశవాళీ టీ20 పోటీలకు డ్రీమ్‌11 ఫాంటసీ పార్ట్‌నర్‌గా నిలిచింది. పార్లమెంట్‌లో బిల్లు ఆమోదం పొందగానే.. ఆన్‌లైన్‌ పెయిడ్‌ కంటెస్ట్‌లను డ్రీమ్‌11 నిలిపివేసింది.
క్రికెటర్ల ఆదాయానికి గండి
డ్రీమ్‌11 క్రీడా సంఘాలతో పాటు అథ్ల్లెట్లతోనూ ఒప్పందాలు చేసుకుంది. భారత క్రికెట్‌లో చాలా మంది క్రికెటర్లు డ్రీమ్‌11 ప్రచారకర్తలుగా ఉన్నారు. ఐపీఎల్‌లోనూ పలు ప్రాంఛైజీలకు డ్రీమ్‌11 స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. ఎం.ఎస్‌ ధోని, రోహిత్‌ శర్మ, హార్దిక్‌ పాండ్య, రిషబ్‌ పంత్‌, జశ్‌ప్రీత్‌ బుమ్రాలు డ్రీమ్‌11 జాబితాలోని ప్రముఖ ప్రచారకర్తలు. క్రికెట్‌ సీజన్‌, ఐపీఎల్‌ సీజన్‌లో డ్రీమ్‌11 ప్రకటనలకు క్రికెటర్లు భారీ ఆదాయం పొందేవారు. కొత్త బిల్లుతో క్రికెటర్ల ఆదాయానికి గండి పడనుంది.
కొత్త స్పాన్సర్‌ ఇప్పట్లో లేనట్టే
బీసీసీఐ క్రికెట్‌ జట్ల కొత్త జెర్సీ భాగస్వామి ఇప్పట్లో లేనట్టే. ఆసియా కప్‌కు తక్కువ సమయం ఉండటంతో జెర్సీ పార్ట్‌నర్‌ లేకుండానే టీమ్‌ ఇండియా ఆడనుంది. కొత్త స్పాన్సర్‌షిప్‌కు టెండర్లు ఆహ్వానం, పరిశీలన, ఎంపిక సహా న్యాయప్రక్రియ ముగిసేందుకు కొంత సమయం పడుతుంది. త్వరలోనే జెర్సీ పార్ట్‌నర్‌ కోసం బీసీసీఐ టెండర్‌ ప్రకటన విడుదల చేసే అవకాశం ఉంది. ఇక ఇండియన్‌ ప్రీమియర్‌ లీగ్‌ (ఐపీఎల్‌) ఆన్‌లైన్‌ ఫాంటసీ గేమ్‌ పార్ట్‌నర్‌గా కొనసాగుతున్న మై11 సర్కిల్‌ది ఇదే పరిస్థితి. బీసీసీఐతో మై11 సర్కిల్‌ ఐదేండ్లకు రూ.625 కోట్ల ఒప్పందం చేసుకుంది. ఈ సంస్థతోనూ బీసీసీఐ తెగతెంపులు చేసుకోనుంది.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad