మీరూ…సిద్ధంగా ఉండండి
జిల్లా కలెక్టర్లకు సీఈవో ఆదేశం
తప్పుల్లేని, సమగ్ర ఓటర్ల జాబితా రూపొందించాలి
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా (ఎస్‌ఐఆర్) సవరణలో బాగంగా చేపట్టాల్సిన అన్ని కార్యక్రమాలను నిర్ణీత గడువులో పూర్తిచేయాలని రాష్ట్ర ఎన్నికల ముఖ్య అధికారి (సీఈవో) సి.సుదర్శన్‌రెడ్డి జిల్లా కలెక్టర్లను ఆదేశించారు. ప్రత్యేక విస్తృత ఓటరు జాబితా సవరణపై శనివారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా అన్ని జిల్లాల కలెక్టర్లు, జిల్లా ఎన్నికల అధికారులు నియోజకవర్గ ఎన్నికల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ టేబుల్‌టాప్ వ్యాయామం వంటి పెండింగ్ పనులను వేగవంతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రతి నియోజకవర్గం, పోలింగ్ స్టేషన్ వారీగా పురోగతిని సమీక్షిస్తూ, ఖచ్చితమైన లోపరహిత ఓటర్ల జాబితా తయారీపై దృష్టి పెట్టాలని ఆదేశించారు. రాబోయే ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని పారదర్శకంగా, తప్పులేని, సమగ్ర ఓటర్ల జాబితాను సిద్ధం చేయడం ఎన్నికల కమిషన్ యొక్క ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ఇటీవల ఢిల్లీలో ప్రధాన ఎన్నికల కమిషనర్ ఆధ్వర్యంలో జరిగిన రెండు రోజుల జాతీయ సమావేశంలో ఎన్నికల జాబితా నిర్వహణలో సాంకేతికత వినియోగం, పారదర్శకత పెంపు, ఓటర్ల సేవల మెరుగుదల ఉత్తమ పద్ధతుల అమలు వంటి అంశాలపై చర్చించినట్టు చెప్పారు. కేంద్ర ఎన్నికల సంఘం మార్గదర్శకాల మేరకు రాష్ట్రంలో ఎస్‌ఐఆర్‌ను నిర్వహించనున్నట్టు చెప్పారు. నవంబర్ ఒకటిన నిర్వహించనున్న సమీక్షా సమావేశం వరకు సర్‌కు సంబంధించి అన్ని పెండింగ్ పనులు పూర్తి చేయాలని కలెక్టర్లను ఆదేశించారు. సమీక్షా సమావేశంలో రాష్ట్ర అదనపు ముఖ్య ఎన్నికల అధికారి లోకేష్ కుమార్, ఉప ముఖ్య ఎన్నికల అధికారి హ సింగ్, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు.



