కిటకిటలాడుతున్న ఆర్టీసీ బస్సులు
రైళ్లలో జనరల్ కంపార్ట్‌మెంట్ తిప్పలు
సరదా దసరా కోసం మారిన ట్రెండ్
ఒకేరోజు గాంధీజయంతి, విజయదశమి
మద్యం, మాంసం దుకాణాలు బంద్
పండుగజోష్ అడ్జెస్ట్‌మెంట్
నవతెలంగాణ-హైదరాబాద్‌బ్యూరో
దసరా వేడుకల్ని సరదాగా గ్రామాల్లో చేసుకొనేందుకు గ్రేటర్ హైదరాబాద్ ప్రజలు సొంతూళ్లకు పయనమవుతున్నారు. ఏటా ఆర్టీసీ బస్సుల్లో అధికంగా ఊర్లకు వెళ్లే ప్రయాణీకులు ఈ సారి కాస్త తటపటాయిస్తున్నారు. అయితే ఉచిత ప్రయాణం కారణంగా మహిళలు మాత్రం ఆర్టీసీ బస్సుల్లోనే ప్రయాణం చేస్తున్నారు. రద్దీకి తగినట్టు ఉచిత బస్సుల సంఖ్యను మాత్రం ఆర్టీసీ అధికారులు పెంచలేదు. స్పెషల్ బస్సుల్లో ‘మహాలక్ష్మి’ ఆధార్ చెల్లదంటూ బోర్డులు పెట్టారు. మరోవైపు రైళ్లలోనూ రిజర్వేషన్ల సమస్య ఉంది. తెలంగాణ ప్రాంతంలో రైలుమార్గం పరిమితం కావడంతో వాటిలో ప్రయాణించేవారి సంఖ్యా అలాగే ఉంది. అయితే ఆయా రూట్లలో రద్దీకి అనుగుణంగా రైల్వే అధికారులు జనరల్ బోగీల సంఖ్య పెంచలేదు.
దీనితో జనరల్ కంపార్ట్‌మెంట్లు కిటకిటలాడుతున్నాయి. ఈ ఏడాది దసరాకు వాతావరణం ఏమాత్రం సహకరించకపోవడంతో ప్రజల్లో పెద్దగా పండుగ మూడ్ కనిపించట్లేదు. భారీ వర్షాలతో గ్రామాల్లో వైరల్ జ్వరాలు, రోడ్లు కొట్టుకుపోవడం, వాగులు, వంకలు పొంగి పొర్లడం వంటి ఘటనలు సర్వసాధారణంగా కనిపిస్తున్నాయి. మరోవైపు దసరా పండుగ రోజే గాంధీ జయంతి కూడా రావడంతో గ్రామీణంలో ఉత్సాహం తగ్గింది. ఆరోజు మద్యం, మాంసం దుకాణాలు బంద్ ఉండటంతో పండుగ జోష్‌ను ఒకరోజు వెనక్కి లేదా ఒకరోజు ముందుకు జరపుకోవాలని గ్రామాల్లో తీర్మానాలు చేస్తున్నారు. గ్రామాల్లో దేవాలయాలు ముస్తాబయ్యాయి. వాహనపూజలు, జమ్మి చెట్లకు పూజ (బంగారం), పాలపిట్టల దర్శనాలకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఆర్టీసీ లక్కీ డ్రాలు…ప్రత్యేక సర్వీసులు
దసరా పండుగ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ (టీజీఎస్‌ఆర్టీసీ) 7,754 ప్రత్యేక బస్సుల్ని నడుపుతున్నట్టు ప్రకటించింది. వీటిలో 377 సర్వీసుల్లో మాత్రమే ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం కల్పించారు. ఈనెల 20 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు ప్రత్యేక సర్వీసుల్ని నడుపుతున్నారు. తిరుగు ప్రయాణానికి సంబంధించి ఆర్టీసీ అక్టోబర్ 5, 6 తేదీల్లో రద్దీకి అనుగుణంగా బస్సుల్ని నడుపుతామని ఆర్టీసీ ప్రకటించింది. భారీ వర్షాలు, మూసీకి వరదల కారణంగా హైదరాబాద్‌లోని మహాత్మాగాంధీ బస్టేషన్‌ను ఒక్కరోజు మూసివేశారు. ఆ తర్వాత యథావిధిగా బస్సుల్ని అక్కడి నుంచి నడిపిస్తున్నారు. ప్రయాణీకుల సౌకర్యార్ధం సిటీలోని పలు ప్రాంతాల నుంచి బస్సులు నడుస్తున్నాయి. ఆర్టీసీ నిర్వహించే 7,754 ప్రత్యేక సర్వీసుల్లో సాధారణ టిక్కెట్ ధరకంటే 50 శాతం అదనపు చార్జీలు వసూలు చేస్తున్నారు.
విమానం టిక్కెట్ల తరహాలో రద్దీని బట్టి టిక్కెట్ చార్జీలు పెంచుకొనే సౌలభ్యాన్ని రాష్ట్ర ప్రభుత్వం 2003లోనే జీవో నెంబర్ 16 ద్వారా అమల్లోకి తెచ్చిందని టీజీఎస్‌ఆర్టీసీ యాజమాన్యం వివరణ ఇచ్చింది. ‘బస్సెక్కితే బహుమతులు’ పేరుతో ప్రయాణీకుల్ని ఆకర్షించేందుకు ఆర్టీసీ ప్రయత్నాలు చేస్తోంది. సంస్థకు చెందిన హైఎండ్ సర్వీసుల్లో ప్రయాణించేవారికి రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో రీజియన్‌లో ముగ్గురు చొప్పున మొత్తం రూ.5.50 లక్షల బహుమతుల్ని ప్రకటించారు. ఈనెల 27 నుంచి అక్టోబర్ 6వ తేదీ వరకు ఆర్టీసీ హైఎండ్ బస్సుల్లో ప్రయాణించే వారు మాత్రమే ఈ లక్కీ డ్రాకు అర్హులు. మహాలక్ష్మి ప్రయాణీకుల్ని, ఇతర సర్వీసుల్లోని ప్రయాణీకులకు ఈ లక్కీ డ్రాలు వర్తించవు. దసరా రోజు ఆయా రీజియన్లలో లక్కీ డ్రా తీసి ఒక్కో రీజియన్‌లో ప్రథమ బహుమతిగా రూ.25వేలు, రెండో బహుమతిగా రూ.15వేలు, మూడో బహుమతిగా రూ.10 వేలు చొప్పున చెక్కుల రూపంలో చెల్లిస్తారు.
రైళ్లలో సౌకర్యాలు నిల్
దక్షిణమధ్య రైల్వేలో మాత్రం దసరా నేపథ్యంలో ప్రయాణీకుల సౌకర్యార్థం ఎలాంటి ప్రత్యేక సౌకర్యాలు లేవు. కనీసం అన్ రిజర్వుడు కంపార్ట్ మెంట్ల సంఖ్యను కూడా పెంచట్లేదు. ప్యాసిం జర్ రైళ్లను పూర్తిగా రద్దు చేసి, వాటి పేర్లను సూపర్‌ఫాస్ట్‌గా మార్చి టిక్కెట్ రేట్లను పెంచి ప్రయాణీకుల నుంచి వసూలు చేస్తున్న విషయం తెలిసిందే. దానికి తోడు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్ నుంచి వెళ్లే సర్వీసుల్ని చర్లపల్లి, నాంపల్లి, బేగంపేట రైల్వేస్టేషన్లకు మార్చారు. ఈ సమాచారం తెలియని ప్రయాణీకులు అనేక అవస్థలు పడుతున్నారు. సిటీ నుంచి చర్లపల్లి వరకు ఆటోలో వెళ్లాలంటే రైలు టిక్కెట్ కంటే ఎక్కువ ఖర్చు అవుతున్నదని ప్రయాణీకులు మొత్తుకుంటున్నారు. రైల్వేస్టేషన్లకు బస్సు సర్వీసుల్ని సిటీలోని అన్ని ప్రాంతాల నుంచి అనుసంధానం చేయలేదు. దీనితో ప్రయాణీకులకు సినిమా కష్టాలు తప్పట్లేదు.