Wednesday, October 29, 2025
E-PAPER
Homeజిల్లాలుఎడతెరిపి లేని వర్షం

ఎడతెరిపి లేని వర్షం

- Advertisement -

పొంగుతున్న వాగులు

పరుగులు పెడుతున్న రాచకాలువ

ఇబ్రహీంపట్నం పెద్ద చెరువులోకి వరద ఉధృతి

మరోసారి అలుగు దునికే అవకాశం

అలుగు పారుతున్న చెరువులు, కుంటలు

నవతెలంగాణఇబ్రహీంపట్నం

భారీ వర్షాల ప్రభావంతో జిల్లాలో కుండపోత వర్షం కురుస్తుంది.. గత మూడు రోజులుగా రాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న భారీ వర్షాలకు వాగులు, వంకలు పొంగిపొర్లుతున్నాయి. దీంతో రోడ్లు, పంట పొలాలు జలమయంగా మారుతున్నాయి. చెరువులు, కుంటలు నిండుకుండల్లా మారి అలుగుదుంకుంటున్నాయి. రహదారులపై నుంచి వరద పోటెత్తడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పత్తి, వరి తదితర పంటలు నీట మునిగాయి. నిన్నటి వరకు వట్టి పోయిన కాలువలు నేడు ఉదృతంగా ప్రవహిస్తున్నాయి. జిల్లాకే తలమానికంగా మారిన ఇబ్రహీంపట్నం పెద్ద చెరువు మరోసారి అలుగు దనికేందుకు సిద్ధమవుతుంది. ఇబ్రహీంపట్నం చెరువులోకి రాచకాలువ పరుగులు పెడుతున్నది. పెద్దవాగు ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఎలిమినేడు, పోచారం, ఉప్పరిగూడ గ్రామాల మీదుగా జోరుగా పొంగుతున్నది. పోచారం చెక్ డ్యాం అలుగు దుంకుతున్నది. ఇబ్రహీంపట్నం మండలంలోని గ్రామాల్లోని చెరువులు, కుంటలు నిండుకుండలా మారాయి. ముఖ్యంగా ఇబ్రహీంపట్నం పెద్దవాగు, రాచకాల్వలు ఉప్పొంగి ప్రవహిస్తుండటంతో పెద్దచెరువుకు నీరు పెద్ద ఎత్తున చేరుతున్నది.

పెద్ద చెరువులోకి భారీ వరద..

ఇబ్రహీంపట్నం పెద్దచెరువు నీటిమట్టం 48 అడుగులు. కానీ గత 40ఏండ్లుగా చుక్క నీరు చేరకుండా ఎండిపోయింది. కాగా 2022లో కురిసిన భారీ వర్షాలకు చెరువు నిండి చిరకాల స్వప్నం నెరవేర్చింది. సుమారు రెండు నెలల పాటు చెరువు అలుగు దునికింది. రెండు గ్రామాల ప్రజలు రాకపోకలు నిలిచిపోయాలి. మళ్ళీ మూడు సంవత్సరాలు అడపా, దడపా వర్షాలు కురవడం వల్ల చెరువు అలుగు పారలేదు. ప్రస్తుతం ఈ చెరువులో 20 నుండి 30 అడుగుల వరకు నిరుంది. ప్రస్తుతం భారీ వర్షాల కారణంగా వరద ఉధృతి కొనసాగుతుంది. మరో నాలుగైదు రోజులు ఇలాగే వర్షం కురిస్తే మరింత నీటిమట్టం పెరిగే అవకాశమున్నది. ఇబ్రహీంపట్నం పెద్దచెరువులో నీటి సామర్థ్యం సుమారు రెండు టీఎంసీలుగా ఉండగా.. ప్రస్తుతం ఒక టీఎంసీకి పైగానే వరద నీరు చేరింది. గతంలో ఎప్పుడూ లేని విధంగా చెరువుకు వరద నీరు వస్తున్నది. దీంతో మరోసారి చెరువు అలుగు దనికే అవకాశాలున్నాయి.

మత్స్యకారులకు ఉపాధి..

ఇబ్రహీంపట్నం చెరువుపై ఆధారపడి జీవనం సాగిస్తున్న మత్స్య కారులు 2022కి ముందు 40ఏండ్ల పాటు వట్టిపోయిన చెరువు వారి ఉపాధిని దెబ్బతీసింది. 2022 తర్వాత ఆ కొరత తీరింది. చెరువు నిండటంతో ఆయకట్టు రైతులు, మత్స్యకారులకు చేతి నిండా ఉపాధి లభించింది. మరోసారి చెరువులోకి భారీగా నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఈ ప్రాంత మత్స్యకారులు, ఆయకట్టు రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం చెరువులో నీరు సమృద్ధిగా ఉండటంతో ఆయకట్టు ప్రాంతంలో భూగర్భ జలాలు పైకి వచ్చాయి.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -