టాప్‌లో బీఆర్‌ఎస్, టీఎంసీ. ఏడీఆర్ రిపోర్టు
న్యూఢిల్లీ : 2023-24 ఆర్థిక సంవత్సరంలో సుమారు 40 ప్రాంతీయ రాజకీయ పార్టీలు రూ.2,532 కోట్ల మొత్తం ఆదాయాన్ని ప్రకటించాయి. పార్టీల నిధుల్లో 70శాతం కంటే ఎక్కువ ఎన్నికల బాండ్ల ద్వారా వస్తున్నాయని అసోసియేషన్ ఫర్ డెమోక్రటిక్ రిఫార్మ్స్ (ఏడీఆర్) నివేదిక తెలిపింది. బీఆర్‌ఎస్ రూ.685.51 కోట్ల అత్యధిక ఆదాయంతో మొదటి స్థానంలో ఉంది. ఆతర్వాత వరుసగా టీఎంసీ రూ.646.39 కోట్లు, బిజు జనతాదళ్ (బీజేడీ) రూ.297.81కోట్లు, టీడీపీ రూ.285.07 కోట్లు , వైఎస్‌ఆర్ కాంగ్రెస్ రూ.191.04 కోట్ల ఆదాయంతో ఉన్నాయి. 40 ప్రాంతీయ పార్టీలు ప్రకటించిన మొత్తం ఆదాయంలో ఈ ఐదు పార్టీలు 83.17శాతం వాటా కలిగి ఉన్నాయి. మొత్తం ఆదాయంలో, రూ.2,117.85 కోట్లు (83.64శాతం) స్వచ్ఛంద విరాళాల నుండి రాగా, ఎన్నికల బాండ్ల నుంచి 70.93శాతం విరాళాలు వచ్చినట్టు బీఆర్‌ఎస్, టీఎంసీ, బీజేడీ, టీడీపీ, వైఎస్‌ఆర్ కాంగ్రెస్, డీఎంకే సహా 10 పార్టీలు ప్రకటించాయి.
2022-23 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ప్రాంతీయ పార్టీల మొత్తం ఆదాయం 45.77శాతం గణనీయంగా పెరిగిందని ఏడీఆర్ పేర్కొంది. ఆ ఆర్థిక సంవత్సరం వారి మొత్తం ఆదాయం రూ.1,736.85కోట్లుగా ఉంది. టీఎంసీ రూ.312.93 కోట్ల పెరుగుదలను నమోదు చేయగా, టీడీపీ ,బీజేడీ కూడా గణనీయమైన పెరుగుదలను నమోదు చేశాయి. 27 పార్టీలు తమ ఆదాయంలో కొంత భాగాన్ని ఖర్చు చేయలేదని ప్రకటించగా, 12 రాజకీయ పార్టీల ఖర్చులు ఆదాయాన్ని మించిపోయాయి.బీఆర్‌ఎస్ ఖర్చు చేయని ఆదాయం నుంచి రూ.430.60 కోట్లు సంపాదించగా, టీఎంసీ రూ.414.92కోట్లు, బిజెడి రూ.253.79 కోట్లు సంపాదించాయి. అయితే వైఎస్‌ఆర్ కాంగ్రెస్, డీఎంకే, సమాజ్ వాది పార్టీ , జనతాదళ్ (యునైటెడ్) సహా 12 పార్టీలు తమ ఆదాయం కన్నా ఎక్కువ ఖర్చు చేసినట్లు తెలిపాయి. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ఖర్చులు సుమారు 55 శాతం పెరగగా, గోవా ఫార్వర్డ్ పార్టీ ఆదాయం లేదని నివేదించింది కానీ ఖర్చులు రూ.1.56 లక్షలుగా ప్రకటించింది.
2023-24లో 40 ప్రాంతీయ పార్టీల ఆదాయం రూ.2,532 కోట్లు
- Advertisement -
- Advertisement -