నవతెలంగాణ-హైదరాబాద్: శబరిమలలో మళ్లీ భక్తుల రద్దీ పెరిగింది. దీంతో.. అయ్యప్ప స్వామి దర్శనానికి 4-5 గంటల సమయం పడుతోంది. మండల పూజ సీజన్‌లో భాగంగా ఈ నెల 16న శబరిమలలోని అయ్యప్ప స్వామి ఆలయం తలుపులు తెరుచుకోగా.. తొలి నాలుగు రోజుల్లో రికార్డు స్థాయిలో భక్తులు దర్శనానికి తరలివచ్చారు. వారం రోజుల్లో ఆరున్నర లక్షల మంది అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు. కోళిక్కోడ్‌కు చెందిన ఓ వృద్ధురాలు రద్దీ కారణంగా శరణ్‌గుత్తి వద్ద మృతిచెందడంతో.. కేరళ హైకోర్టు కల్పించుకుంది. రోజువారీ స్పాట్ బుకింగ్‌లను ఐదు వేలకు పరిమితం చేసింది. భక్తులు శరణ్‌గుత్తి నుంచి సన్నిధానం చేరుకోవడానికి నాలుగు గంటల సమయం పడుతోంది. నడపండాల్ నుంచి 18 మెట్లను ఎక్కడానికి మరో అరగంట.. అక్కడి నుంచి ఫ్లైఓవర్ మీదుగా అయ్యప్ప స్వామిని దర్శించుకోవడానికి ఇంకో అరగంట పడుతోందని శబరిమల యాత్రకు వెళ్లిన భక్తులు వివరించారు.


