– ఎనిమిది నెలల గరిష్టానికి చేరిక
న్యూఢిల్లీ : భారతదేశ ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో వాణిజ్య లోటు అమాంతం పెరిగింది. ప్రస్తుత ఏడాది జులైలో సరుకుల ఎగుమతులు 7.29 శాతం పెరిగి 37.24 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గతేడాది ఇదే కాలంలో 34.71 బిలియన్ డాలర్లుగా ఉన్నాయి. కాగా.. గడిచిన జులైలో దిగుమతులు 8.6 శాతం పెరిగి 64.59 బిలియన్ డాలర్లకు చేరాయి. గతేడాది జులైలో 59.49 బిలియన్ డాలర్లుగా నమోదయ్యాయి. గడిచిన నెలలో ఎగుమతుల కంటే దిగుమతులు ఎక్కువగా ఉండటంతో వాణిజ్య లోటు 27.35 బిలియన్లకు పెరిగింది. ఇది 8 నెలల గరిష్ఠ స్థాయి కావడం గమనార్హం. 2024 ఇదే జులైలో 24.77 బిలియన్ల లోటు చేసుకుంది.జూన్ 2025లోని 35.14 బిలియన్ల డాలర్ల ఎగుమతులతో పోల్చితే జులైలో పెరిగాయి. ఇందుకు ప్రధానంగా ఎలక్ట్రానిక్స్, ఫార్మాస్యూటికల్స్, ఇంజనీరింగ్ గూడ్స్, సముద్ర ఉత్పత్తులు, మాంసం, డైరీ ఉత్పత్తులు మద్దతును అందించాయని వాణిజ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. ఈ రంగాల్లో బలమైన పనితీరు ఎగుమతులను పెంచిందని పేర్కొంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్ నుంచి జులైలో కాలంలో సరుకుల ఎగుమతులు 3.07 శాతం పెరిగి 149.2 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. దిగుమతులు 5.36 శాతం పెరిగి 244.01 బిలియన్ డాలర్లుగా చోటు చేసుకున్నాయి. దీంతో ఈ కాలంలో వాణిజ్య లోటు 94.81 బిలియన్ డాలర్లకు చేరింది. అమెరికా అధిక టారిఫ్‌లు ప్రస్తుత, వచ్చే మాసాల్లో ఎగుమతులపై తీవ్ర ప్రభావం చూపనున్నాయని నిపుణులు సహా ఆ పరిశ్రమ వర్గాలు తీవ్ర ఆందోళనలో ఉన్న విషయం తెలిసిందే.
పెరిగిన వాణిజ్య లోటు
- Advertisement -
- Advertisement -