– నివారణ కోసం ముఖ్యమంత్రిపై ఒత్తిడి తీసుకువచ్చాం
– నేరస్తులకు స్టేషన్ బెయిల్ ఇవ్వడం హేయమైన చర్య
– ఎస్సీ, ఎస్టీ కేసుల్లో అలసత్వం వహిస్తే కఠిన చర్యలు
– బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలి
– కేసులను నెలాఖరు నాటికి పూర్తి చేయాలి
– ఉద్యోగుల ప్రమోషన్లలో నిర్లక్ష్యం చేయొద్దు : ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య
నవతెలంగాణ-మెదక్ ప్రాంతీయ ప్రతినిధి, జహీరాబాద్
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై దాడులు పెరిగిపోతున్నాయని ఎస్సీ, ఎస్టీ కమిషన్ చైర్మెన్ బక్కి వెంకటయ్య అన్నారు. మంగళవారం సంగారెడ్డి జిల్లా జహీరాబాద్ పట్టణం రంజోల్‌లోని సాంఘిక సంక్షేమ బాలికల గురుకుల పాఠశాలను సందర్శించారు. విద్యార్థులతో కలిసి సహపంక్తి భోజనం చేశారు. అనంతరం గురుకుల పాఠశాలలో, సంగారెడ్డి కలెక్టరేట్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దాడులను నివారించేందుకు నేరస్తులపై కఠిన చర్యలు తీసుకునే విధంగా ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, జిల్లా మంత్రి దామోదర్ రాజనర్సింహతో కలిసి అనేక దఫాలుగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తున్నట్టు తెలిపారు. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో అధికారులు నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ల్యాండ్, పోలీసు కేసులు పెండింగ్‌లో ఉన్నాయని, వాటిని నెలాఖరులోగా పూర్తి చేయాలని కలెక్టర్‌ను ఆదేశించినట్టు తెలిపారు. రాష్ట్రంలోని నారాయణపేట, మహబూబ్‌నగర్‌లో రెండు గ్లాసుల పద్ధతి, సూర్యాపేట, జగిత్యాల, వికారాబాద్, లాంటి ప్రాంతాల్లో దళితులపై దాడులు జరుగుతూనే ఉన్నాయని, జహీరాబాద్‌లో కూడా జరగడం ఎంతో బాధాకరమని అన్నారు. ఎస్సీ, ఎస్టీ చట్టాన్ని నీరుగార్చే విధంగా కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలకు నిరసనగా జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌ను సైతం కలసి ఎస్సీ, ఎస్టీ నిందితులకు స్టేషన్ బెయిల్ ఇవ్వకుండా చర్యలు చేపట్టాలని ఉద్యమం చేపట్టనున్నట్టు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర బడ్జెట్‌లో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్‌కు కేటాయిస్తున్న నిధులు వినియోగంలోకి రాకపోవడంతో వారి పరిస్థితులు రాను రాను దినదిన గండంగా మారుతున్నాయన్నారు. ఎస్సీ, ఎస్టీ బాధితులకు డబుల్ బెడ్ రూమ్ ఇండ్లు ఇవ్వాలని నిర్ణయించామని, వాటిని పరిశీలించి బాధితులకు అందించాలని కలెక్టర్‌కు సూచించారు. మెట్రో పాలిటన్ జిల్లాలకు వెయ్యి ఇండ్లు మంజూరు చేయనున్నట్టు చెప్పారు. ఎస్సీ, ఎస్టీ సబ్‌ప్లాన్ నిధులు వారికే ఖర్చు చేయాలని ఆదేశించారు. అలాగే, అట్రాసిటీ కేసుల విషయంలో పోలీసులు తాత్సారం చేస్తున్నారని వారిపై కఠిన చర్యలు తీసుకునేందుకు వెనుకాడొద్దని సూచించారు. పదోన్నతుల్లో, రోస్టర్ అమలులో ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరిగితే సహించబోమని, దీర్ఘకాలంగా పెండింగ్‌లో ఉన్న ఎస్సీ, ఎస్టీ భూముల సమస్యలను వెంటనే పరిష్కరించాలని తెలిపారు. ఈ సమావేశంలో జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు, ఎస్సీ, ఎస్టీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రంలో ఎస్సీ, ఎస్టీలపై పెరుగుతున్న దాడులు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



