Monday, January 5, 2026
E-PAPER
Homeజాతీయంపెరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలు

పెరుగుతున్న పారిశ్రామిక ప్రమాదాలు

- Advertisement -

పని ప్రదేశాల్లో క్షీణిస్తున్న భద్రతా ప్రమాణాలు
– మహాసభలో తీర్మానాన్ని ప్రవేశ పెట్టిన చుక్క రాములు
విశాఖపట్నం నుంచి నవతెలంగాణ ప్రతినిధి

దేశంలోని పరిశ్రమల్లో మన సభ్యులు, కార్మికులందర్నీ వేధిస్తున్న పారిశ్రామిక ప్రమాదాలు, మరణాలు, వృత్తిపర వ్యాధుల పట్ల భారత ట్రేడ్‌ యూనియన్‌ కేంద్రం (సీఐటీయూ) 18వ అఖిల భారత మహాసభ తీవ్ర ఆగ్రహాన్ని, విచారాన్ని వ్యక్తం చేస్తోందని సీఐటీయూ అఖిల భారత నాయకులు చుక్క రాములు తెలిపారు. ఈ మేరకు శనివారం మహాసభల మూడో రోజు ఈ తీర్మానాన్ని ప్రవేశ పెట్టారు. మహాసభ ఏకగ్రీవంగా ఆమోదించింది. ‘పని ప్రదేశాల్లో భద్రతా ప్రమాణాలు క్షీణిస్తూ ఉండటంతో కార్మికులు ప్రమాదాలకు, మరణాలకు గురవుతున్నారు. దేశ పారిశ్రామిక రంగంలో సమగ్ర భద్రతా సంస్కరణల తక్షణ అవసరాన్ని ఇటీవలి పారిశ్రామిక విపత్తులు నొక్కిచెబుతున్నాయి’అని తెలిపారు.

తెలంగాణ పారిశ్రామిక విపత్తు – ఒక మేల్కొలుపు
జూన్‌ 30న తెలంగాణలోని సంగారెడ్డి జిల్లా సిగాచి కెమికల్‌ ప్లాంట్‌లో జరిగిన ఘోర పేలుడు ఇటీవలి కాలంలో దేశంలో జరిగిన అత్యంత దారుణమైన పారిశ్రామిక ప్రమాదాల్లో ఒకటని చుక్క రాములు పేర్కొన్నారు. ‘ఈ ప్రమాదంలో 50 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. ఎనిమిది మంది కార్మికులు ఆస్పత్రి పాలయ్యారు. మరో ఎనిమిది మంది గాలిలో కలిసిపోయారు. కిలోమీటర్ల దూరం మేర రియాక్టర్ల పేలుళ్లు వినిపించాయి. భారతదేశ పారిశ్రామిక భద్రతా వైఫల్యాలకు నిదర్శనంగా నిలిచింది’ అని ఆందోళన వ్యక్తం చేశారు. ‘ఈ దారుణాన్ని కేవలం ప్రమాదంగా కొట్టిపారేయలేం. ఇది యాజమాన్యం నిర్లక్ష్యం, సరిపడా నిర్వహణ లేకపోవడం, సరైన భద్రతా చర్యలు అమలు చేయకపోవడం వల్ల జరిగింది. ఇటువంటి ప్రమాదాలు మన దేశంలోని పని ప్రదేశాల భద్రతా మౌలిక సదుపాయాల్లో ఉన్న వ్యవస్థాగత సమస్యలను ఎత్తిచూపుతున్నాయి’ అని వివరించారు. ‘సంగారెడ్డి జిల్లాలో జూన్‌ 30న జరిగిన విపత్తు ఒకే ఒక్క సంఘటన కాదు. 2024 లో కేవలం నాలుగు నెలల్లోనే ఈ ప్రాంతంలో 25 మంది కార్మికులు మరణించారు. 2018-22 మధ్యకాలంలో పని ప్రదేశాల్లో జరిగిన ప్రమాదాల్లో కేవలం 35శాతం మాత్రమే అధికారికంగా నమోదయ్యాయి. 15వందల కంటే ఎక్కువ ఫ్యాక్టరీలలో ప్రమాదాలు జరిగాయి. 4,500 కంటే ఎక్కువ మంది కార్మికుల మరణాలు నమోదయ్యాయి. ఒకవేళ నిర్మాణ స్థలాలు గనులను కూడా కలిపితే ఐదేండ్లలో మరణాల సంఖ్య 6,500 దాటుతుంది’ అని చెప్పారు. ‘ప్రభుత్వం అంగీకరించినట్టుగా, ఈ గణాంకాలు కేవలం నమోదైన కేసులను మాత్రమే సూచిస్తాయి. అనేక గాయాలు ప్రాణాపాయస్థితి వరకు వెళ్లిన ఘటనలు అస్సలు నమోదు కావడం లేదు. ఈ డేటా అంతా పారిశ్రామిక భద్రతా ఉల్లంఘనల భయంకరమైన ధోరణిని నిర్ధారిస్తుంది’ అని తెలిపారు.

ముఖ్యమైన సవాళ్లు, కారణాలు
నిర్లక్ష్యం :
సరైన నిబంధనలు లేకపోవడం, శిక్షణ లేకపోవడం కార్మికుల రక్షణ ఖర్చులను తగ్గించుకోవాలనే ధోరణి ప్రమాదాలకు దారితీస్తోంది.
చట్టాల మార్పు : కొత్తగా తెచ్చిన లేబర్‌ కోడ్‌లు యాజమాన్యాలకు బాధ్యతల నుంచి మినహాయింపు ఇస్తున్నాయి. జన విశ్వాస్‌ యాక్ట్‌ 2023 ద్వారా యజమానుల నేరాలను కేవలం జరిమానాలతో సరిపెట్టి శిక్షలను తగ్గించారు.
అసంఘటిత కార్మికులు : ఖర్చులను తగ్గించుకోవడానికి బాయిలర్లు, మెయింటెనెన్స్‌ వంటి కీలక విభాగాల్లో శిక్షణ లేని, ఔట్‌సోర్స్‌, ఒప్పంద కార్మికులను నియమిస్తున్నారు.
నిర్లక్ష్యపు నిందలు : ఏ ప్రమాదం జరిగినా దానికి కార్మికుల నిర్లక్ష్యమే కారణమని నిందిస్తూ యజమాన్యాలు తప్పించుకుంటున్నాయి.
18వ మహాసభ డిమాండ్లు
– అన్ని ప్రమాదకర పరిశ్రమల్లోనూ ముందస్తు సమాచారం లేకుండా పారదర్శక భద్రతా తనిఖీలు నిర్వహించాలి.
– భద్రతా నిబంధనలను ఉల్లంఘించిన కంపెనీలను, యజమానులను కఠినంగా శిక్షించాలి. బాధితులకు, వారి కుటుంబాలకు వెంటనే పూర్తి పరిహారం అందించాలి.
– ప్రమాదకరమైన పనులను తిరస్కరించే హక్కు కార్మికులకుండాలి.
– అన్ని కర్మాగారాల్లో కార్మికులు, యాజమాన్య ప్రతినిధులతో సమానంగా ‘భద్రతా కమిటీలను’ ఏర్పాటు చేయాలి. ఆ కమిటీలోని కార్మికుల ప్రతినిధులను కార్మికులే ఎన్నుకోవాలి.
– యూనియన్‌ ప్రతినిధులకు స్వతంత్ర తనిఖీలు చేసే, ప్రమాదకరమైన పనులను నిలిపివేసే భద్రతా సమాచారాన్ని పొందే చట్టపర హక్కు కల్పించాలి.
– వృత్తిపరమైన ఆరోగ్యం అనే నిర్వచనంలో భౌతిక భద్రతతో పాటు మానసిక ఆరోగ్యాన్ని కూడా చేర్చాలి. పని ఒత్తిడి, వేధింపులు, దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే రసాయనాల ప్రభావంపై కఠిన చర్యలు తీసుకోవాలి.
– పారిశ్రామిక ప్రమాదాల బాధితులకు అండగా నిలవాలని భద్రత కోసం పోరాడుతున్న ఇతర యూనియన్లతో కలిసి పనిచేయాలని తన అనుబంధ సంఘాలన్నింటికీ పిలుపునిస్తోంది.
– కార్మికుల ప్రాణాల మూల్యంతో పారిశ్రామిక వృద్ధి జరగకూడదు.

కార్మిక సంక్షేమంలో కేరళ రోల్‌ మోడల్‌
– సోషలిస్టు వర్గచైతన్యం రగిలించేందుకు కృషి
– బహుముఖ కార్యక్రమాలతో సరళీకరణ, మతతత్వానికి చెక్‌
– పోరాటాలకు మరింత పదును పెడతాం
– భావజాల రంగానికి ప్రాధాన్యత ఇస్తాం : మహాసభ చర్చల్లో ప్రతినిధులు శనివారంతో ముగిసిన చర్చలు

కార్మికుల సంక్షేమం విషయంలో కేరళ రోల్‌ మోడల్‌ అని సీఐటీయూ అఖిల భారత మహాసభ ప్రతినిధులు ముక్తకంఠంతో చెప్పారు. సామ్రాజ్యవాదం, నయా ఉదార వాద యుగంలో వేళ్లూనుకుంటున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలకు ప్రత్యామ్నాయాల సాధనకు వ్యూహాత్మక కార్యాచరణ రూపొందించుకుని ముందుకు సాగుతామని ప్రకటించారు. ప్రత్యామ్నాయ విధానాల రూపకల్పనపై ప్రధాన కార్యదర్శి తపన్‌సేన్‌ సభ ముందుంచిన నివేదికపై శనివారం వివిధ రాష్ట్రాల ప్రతినిధులు, వివిధ రంగాల్లో పనిచేస్తున్న 30 మంది ప్రతినిధులు చర్చల్లో పాల్గొని తమ అభిప్రాయాలను పాలుపంచుకున్నారు. ప్రధాన కార్యదర్శి నివేదికపై గురు, శుక్రవారాల్లో 59 మంది, నిర్మాణ నివేదికపై 52 మంది చర్చల్లో పాల్గొన్నారు. మహాసభలో సీఐటీయూ ప్రతినిధుల చర్చలు శనివారంతో ముగిశాయి. ప్రస్తుతం కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్‌-మతతత్వ బంధం కలిగి ఉందనీ, ఇదొక ప్రత్యేక, కార్మిక వర్గ పంథా అని అభిప్రాయపడ్డారు. తిరోగమన సిద్ధాంతాన్ని కార్మికవర్గం సమర్ధవంతంగా ఎదుర్కొని ఓడించాలంటే బహుముఖ పోరాటాలే మార్గమని స్పష్టం చేశారు. ఆర్థిక, సామాజిక, రాజకీయ పోరాటాలకు మరింత పదును పెట్టాల్సిన ఆవశ్యకతను నొక్కి చెప్పారు. సరళీకరణ, మతోన్మాద భావజాల విస్తరణ ఒక పథకం ప్రకారం సమాజంలో విస్తరింపజేస్తు న్నారని తెలిపారు. ఈ ధోరణిని తిప్పికొట్టేందుకు కళ, సాహిత్య, మీడియా, సాంస్కృతిక రంగాల్లో కేంద్రీకరించి చేయడం ద్వారా ప్రత్యామ్నాయ సిద్ధాంతాన్ని పెంపొదించాలన్నారు. పెట్టుబడిదారీ వ్యవస్థలో కార్మికుల హక్కుల సంక్షేమానికి ప్రాధాన్యం ఉండదనీ, శ్రమదోపిడీనే పరమావధనీ, ప్రత్యా మ్నాయం సోషలిజమేననీ, ఆ వైపు కార్మికులను, ప్రజలను నడిపించాలని పిలుపునిచ్చారు. కార్మికుల సంక్షేమం విష యంలో కేరళ రోల్‌మోడల్‌ ఆదర్శనీయమనీ, ఆ అనుభవాలను దేశంలో అమలు చేసేందుకు కొట్లాడుతామని తెలిపారు.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -