– గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఆవిష్కరించనున్న సీఎం రేవంత్ రెడ్డి
– అసెంబ్లీ, మండలితో పాటు వివిధ పార్టీల కార్యాలయాల్లో వేడుకలు
నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్
భారతదేశ 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్రం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. శుక్రవారం వాడవాడలా మువ్వన్నెల జెండా రెపరెపలాడనుంది. ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు హైదరాబాద్‌తో పాటు జిల్లాల్లో అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, కలెక్టరేట్లలో ఏర్పాట్లు పూర్తయ్యాయి. వేడుకల్లో భాగంగా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి శుక్రవారం ఉదయం 9 గంటలకు గోల్కొండ కోటలో జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. అనంతరం ఆయన రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు. శాసనమండలిలో చైర్మెన్ గుత్తా సుఖేందర్ రెడ్డి, అసెంబ్లీలో స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారు. సచివాలయంలో జరిగే వేడుకలకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ముఖ్యఅతిథిగా హాజరవుతారు. కాంగ్రెస్ రాష్ట్ర కార్యాలయం గాంధీభవన్‌లో పీసీసీ అధ్యక్షులు బి.మహేశ్ కుమార్ గౌడ్, బీఆర్‌ఎస్ రాష్ట్ర కార్యాలయమైన తెలంగాణ భవన్‌లో ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షులు ఎన్.రామచందర్ రావు జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. హైదరాబాద్ బాగ్‌లింగంపల్లిలోని సుందరయ్య విజ్ఞాన కేంద్రం వద్ద జరిగే వేడుకల్లో సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి జాన్‌వెస్లీ ముఖ్యఅతిథిగా పాల్గొంటారు. అక్కడే ఆయన జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగిస్తారు. సీపీఐ రాష్ట్ర కార్యాలయంలో మఖ్దూంభవన్‌లో ఆ పార్టీ నేత చాడ వెంకటరెడ్డి, టీజేఎస్ రాష్ట్ర కార్యాలయంలో ఆ పార్టీ అధ్యక్షులు ప్రొఫెసర్ కోదండరాం జాతీయ పతాకాన్ని ఎగురవేస్తారు. ఇప్పటికే జిల్లాల్లో జరిగే వేడుకలకు హాజరయ్యే మంత్రులు, అతిథులు, ప్రజా ప్రతినిధుల పేర్లను వెల్లడిస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు జీవో జారీ చేసిన సంగతి తెలిసిందే. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా శుక్రవారం సాయంత్రం 5.30 గంటలకు రాజ్‌భవన్‌లో ఎట్ హౌం నిర్వహిస్తున్నారు. రాష్ట్ర గవర్నర్ జిష్ణు దేవ్ వర్మ ఆధ్వర్యంలో జరిగే ఈ కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరు కానున్నారు. మంత్రులు, ఇతర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు.
నేడు రాష్ట్రవ్యాప్తంగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES