దక్షిణాఫ్రికా అండర్-19 జట్టుపై వన్డే సిరీస్ 3-0తో గెలుపు
మూడో వన్డేలో 233పరుగుల తేడాతో ఘన విజయం
బెనోని(దక్షిణాఫ్రికా): దక్షిణాఫ్రికా గడ్డపై భారత అండర్-19 జట్టు ఆకాశమే హద్దుగా చెలరేగింది. మూడో వన్డేకు ముందే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారతజట్టు.. బుధవారం జరిగిన మూడో, చివరి వన్డేలోనూ ఘన విజయం సాధించి 3-0తో క్లీన్‌స్వీప్ చేసింది. టాస్ గెలిచి తొలిగా బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టు నిర్ణీత 50ఓవర్లలో 7వికెట్ల నష్టానికి 393పరుగుల భారీస్కోర్ చేయగా.. ఛేదనలో దక్షిణాఫ్రికా అండర్-19 జట్టు 35ఓవర్లలో 160పరుగులకే కుప్పకూలింది. దీంతో భారతజట్టు 233 పరుగుల భారీ తేడాతో ఘన విజయం సాధించింది. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన భారతజట్టును ఓపెనర్లు అదిరే ఆరంభాన్నిచ్చారు. ఆరోన్ జార్జి(118), వైభవ్ సూర్యవంశీ(127) శతకాలతో మెరిసారు. ముఖ్యంగా సూర్యవంశీ కేవలం 74బంతుల్లో 9ఫోర్లు, 10 సిక్సర్లుతో రాణించగా.. జార్జి 106బంతుల్లో 16ఫోర్లతో రాణించాడు. వీరిద్దరూ తొలి వికెట్‌కు 25.4ఓవర్లలో 227పరుగుల భారీస్కోర్‌ను నమోదు చేశారు.
ఆ తర్వాత త్రివేది(34), అభిజ్ఞాన్ కుందు(21)కి తోడు చివర్లో మహ్మద్ ఇనాన్(28నాటౌట్) బ్యాటింగ్‌లో రాణించారు. దీంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లు ముగిసేసరికి 393పరుగుల భారీస్కోర్ చేసింది. దక్షిణాఫ్రికా బౌలర్లు నందో సోనీకి మూడు, జాసోన్‌కురెండు, మిఛెల్‌కు ఒక వికెట్ దక్కాయి. ఆ తర్వాత భారత బౌలర్లు కిషన్ కుమార్(3/15), ఇనాన్(2/36)కి తోడు హేనిల్ పటేల్, చౌహాన్, మోహన్, అబ్రిష్, సూర్యవంశీ ఒక్కో వికెట్ రాణించి దక్షిణాఫ్రికాను కట్టడి చేశారు. దీంతో ఆ జట్టు 35ఓవర్లలోనే 160పరుగులకు కుప్పకూలింది. దక్షిణాఫ్రికా జట్టలో జేమ్స్(41), బోస్మన్(40), బోథా(36), రాలెస్(19) మాత్రమే రెండంక్కెల స్కోర్ చేశారు. ఈ గెలుపుతో భారత అండర్-19 జట్టు మూడు వన్డేల సిరీస్‌ను 3-0తో గెలిచి క్లీన్‌స్వీప్ చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్, సిరీస్ వైభవ్ సూర్యవంశీకి దక్కాయి. జింబాబ్వే వేదికగా జనవరి 15నుంచి ఐసిసి అండర్-19 వన్డే ప్రపంచకప్ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్‌లో భారతజట్టు అమెరికాతో తలపడనుంది. ఈ మ్యాచ్ బులవాయో వేదికగా జరగనుంది.



