Saturday, January 10, 2026
E-PAPER
Homeజాతీయంకాలుష్య కోరల్లో భారత్‌

కాలుష్య కోరల్లో భారత్‌

- Advertisement -

44 శాతం నగరాల్లో విషతుల్యమైన గాలి
సీఆర్‌ఈఏ నివేదికలో సంచలన నిజాలు
బీజేపీ పాలిత రాష్ట్రాల్లో పరిస్థితి మరింత తీవ్రం


స్వచ్ఛ్‌భారత్‌ అంటూ మోడీ ప్రభుత్వం చేస్తున్న ప్రచారం పచ్చి అబద్ధమని తేలిపోయింది. పచ్చదనం..పరిశుభ్రత పేరిట ఒక రోజు ఫొటోలకు ఫోజులిచ్చి.. ఆ తర్వాత దేశంలో ఏం జరుగుతుందో… బీజేపీ పాలకులకు ఏమాత్రం పట్టలేదు. ఫలితంగా వేల కోట్ల నిధులు విడుదల చేసినా వాటిని రోడ్లు దులపడానికే ఖర్చు పెట్టడంతో కాలుష్యం తగ్గకపోగా మరింత పెరిగిపోయింది. దీనిపై దేశ రాజధాని ఢిల్లీలో ప్రతిపక్ష పార్లమెంట్‌ సభ్యులు ప్రస్తావించారు. విషతుల్య వాయువులో బతకాల్సి రావడానికి కారణాలేంటో చెప్పాలని నిలదీశారు. కానీ కేంద్రంలోని బీజేపీ సర్కార్‌ మాత్రం ఈ విషయాన్ని లైట్‌గా తీసుకుంటోంది. తాజాగా సీఆర్‌ఈఏ నివేదికలో కేవలం నాలుగు శాతం నగరాలకు మాత్రమే జాతీయ స్వచ్ఛగాలి కార్యక్రమం కింద రక్షణ లభిస్తోందని, 44 శాతం నగరాలు దీర్ఘకాలిక తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కుకున్నాయనే కఠోర వాస్తవాలు వెలుగులోకి వచ్చాయి.

న్యూఢిల్లీ : భారతదేశంలో ఉన్న అత్యధిక బీజేపీ పాలిత రాష్ట్రాల్లో గాలి కాలుష్యం ప్రజలకు ప్రాణాంతకంగా మారింది. ఊపిరితీసుకోనీయకుండా ప్రాణాలు తోడేస్తోంది. దేశంలో ఏకంగా 44 శాతం నగరాలు దీర్ఘకాలికంగా తీవ్రమైన కాలుష్య కోరల్లో చిక్కు కున్నాయి. అయితే, ఇంతటి విపత్కర పరిస్థితుల్లోనూ కేవలం 4 శాతం నగరాలకు మాత్రమే జాతీయ స్వచ్ఛ గాలి కార్యక్రమం కింద రక్షణ లభిస్తోందని సెంటర్‌ ఫర్‌ రీసెర్చ్‌ ఆన్‌ ఎనర్జీ అండ్‌ క్లీన్‌ ఎయిర్‌ (సీఆర్‌ఈఏ) తన తాజా నివేదికలో పేర్కొంది. ఇది కేవలం తాత్కాలిక సమస్య కాదని, దేశంలో కాలుష్యం అనేది ఒక నిర్మాణాత్మకమైన సమస్యగా మారిపోయిందని ఆ సంస్థ హెచ్చరించింది.

ఉత్తర్‌ప్రదేశ్‌ పరిస్థితి మరీ దారుణం
రాష్ట్రాల వారీగా చూస్తే యూపీలో పరిస్థితి అత్యంత ఆందోళనకరంగా ఉంది. అత్యధికంగా 416 కాలుష్య నగరాలు ఉత్తర్‌ప్రదేశ్‌లోనే ఉన్నాయి. ఆ తర్వాత రాజస్థాన్‌ (158), గుజరాత్‌ (152), మధ్యప్రదేశ్‌ (143) ఉన్నాయి. పంజాబ్‌, బీహార్‌లలో చెరో 136 నగరాలు, పశ్చిమ బెంగాల్‌లో 124 నగరాలు కాలుష్య కోరల్లో చిక్కుకుపోయాయి.

ఫలితమివ్వని నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ (ఎన్‌సీఏపీ)
కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నేషనల్‌ క్లీన్‌ ఎయిర్‌ ప్రోగ్రామ్‌ క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితాలు ఇవ్వడం లేదని ఈ నివేదిక స్పష్టం చేసింది. కాలుష్యం బారినపడ్డ 1,787 నగరాల్లో, ఎన్‌సీఏపీ జాబితాలో ఉన్నవి కేవలం 67 మాత్రమే. అంటే 96 శాతం కాలుష్య నగరాలను ఈ పథకం పట్టించుకోవడం లేదు. మొత్తం మీద కేవలం 130 నగరాలను మాత్రమే ఎన్‌సీఏపీ కవర్‌ చేస్తోంది. మెజారిటీ నగరాలు క్లీన్‌ ఎయిర్‌ యాక్షన్‌ ప్లాన్‌ పరిధికి దూరంగా ఉన్నాయి.

దుమ్ము దులపడానికే నిధులు
అయితే నిధుల వినియోగంలోనూ భారీ లోపాలు ఉన్నట్టు సీఆర్‌ఈఏ ఎత్తిచూపింది. ఎన్‌సీఏపీ ప్రారంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు రూ.13,415 కోట్లు విడుదల చేశారు. అందులో 74 శాతం నిధులు (రూ.9,929 కోట్లు) ఖర్చు చేశారు. కానీ ఇందులో 68 శాతం నిధులను కేవలం రోడ్లపై దుమ్మును తొలగించడానికే వాడారు. వాహనాల కాలుష్య నివారణకు 14 శాతం, చెత్త దహన నివారణకు 12 శాతం ఉపయోగించారు. అసలైన కాలుష్య కారకాలైన పరిశ్రమలు, ఇండ్లలో వాడే ఇంధనాల నియంత్రణకు 1 శాతం నిధులు కూడా కేటాయించలేదు.

డేంజర్‌ జోన్‌లో సగం నగరాలు
శాటిలైట్‌ డేటా ఆధారంగా సీఆర్‌ఈఏ దేశవ్యాప్తంగా సర్వే నిర్వహించింది. దేశంలోని మొత్తం 4,041 నగరాల్లోని గాలి నాణ్యతను (పీఎం2.5 లెవల్స్‌) నిశితంగా పరిశీలించింది. ఇందులో ఏకంగా 1,787 నగరాలు ప్రమాదకర స్థాయిలో ఉన్నట్టు తేల్చింది. కరోనా ప్రభావిత 2020ని మినహాయించి, గత ఐదేండ్లుగా (2019-2024) ఈ నగరాల్లో కాలుష్యం జాతీయ ప్రమాణాలను మించి పోయింది. అంటే దేశంలోని 44 శాతం నగరాల ప్రజలు ప్రతిరోజూ విషాన్ని పీల్చుకుంటున్నారు.

టాప్‌-3 కాలుష్య నగరాలు ఇవే
2025 అంచనాల ప్రకారం దేశంలో అత్యంత కాలుష్య నగరాల జాబితాను సీఆర్‌ఈఏ నివేదిక విడుదల చేసింది. దేశంలోనే అత్యంత కాలుష్య నగరంగా బైర్నిహాట్‌ (అసోం) మొదటి స్థానంలో నిలిచింది(100 ‘జీ/ఎంట). రెండో స్థానంలో దేశ రాజధాని ఢిల్లీ ఉంది (96 ‘జీ/ఎంట). మూడోస్థానంలో ఘజియాబాద్‌ (ఉత్తర్‌ ప్రదేశ్‌) నిలిచింది (93 ‘జీ/ఎంట). వీటి తర్వాత నోయిడా, గురుగ్రామ్‌, గ్రేటర్‌ నోయిడా, భివాడి, హాజీపుర్‌, ముజఫర్‌నగర్‌, హాపుర్‌ నగరాలు టాప్‌-10లో ఉన్నాయి.

శాస్త్రీయ పద్ధతిలో సంస్కరణలు అవసరం : సీఆర్‌ఈఏ విశ్లేషకుడు మనోజ్‌కుమార్‌
శాస్త్రీయ పద్ధతిలో సంస్కరణలు తేవాలి. కేవలం దుమ్ము మీద కాకుండా, సల్ఫర్‌ డై ఆక్సైడ్‌, నైట్రోజన్‌ డై ఆక్సైడ్‌ వంటి వాయువుల నియంత్రణపై దృష్టి పెట్టాలి. ఎన్‌సీఏపీ జాబితాను సవరించాలి. పరిశ్రమలు, విద్యుత్‌ కేంద్రాలపై కఠినమైన ఆంక్షలు విధించాలి.

పీఎం10లో ఢిల్లీనే టాప్‌
పీఎం10 కాలుష్యం విషయంలో ఢిల్లీ అగ్రస్థానంలో ఉంది. ఢిల్లీలో జాతీయ ప్రమాణాల కంటే మూడు రెట్లు ఎక్కువ కాలుష్యం (197 ‘జీ/ఎంట) నమోదైంది. ఘజియాబాద్‌, గ్రేటర్‌ నోయిడా ఆ తర్వాతి స్థానాల్లో ఉన్నాయి. ఎన్‌సీఏపీ వల్ల కేవలం 23 నగరాల్లో మాత్రమే 40 శాతం మేర కాలుష్యం తగ్గింది. మరో 23 నగరాల్లో కాలుష్యం తగ్గకపోగా, బాగా పెరిగిపోయింది.

- Advertisement -
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -