నవతెలంగాణ -హైదరాబాద్: టీ20 క్రికెట్‌లో టీమిండియా సరికొత్త రికార్డు సృష్టించింది. న్యూజిలాండ్‌తో జరిగిన మ్యాచ్‌లో 209 పరుగుల భారీ లక్ష్యాన్ని కేవలం 15.2 ఓవర్లలోనే ఛేదించి సంచలనం సృష్టించింది. తద్వారా టీ20 ఫార్మాట్‌లో అత్యంత వేగంగా 200కు పైగా పరుగుల లక్ష్యాన్ని ఛేదించిన జట్టుగా (ఫుల్ మెంబర్ దేశాల్లో) భారత్ చరిత్రకెక్కింది. సూర్యకుమార్ యాదవ్ నేతృత్వంలోని భారత జట్టు మరో 28 బంతులు మిగిలి ఉండగానే ఈ ఘనవిజయాన్ని అందుకుంది.
ఈ విజయంతో భారత్, తన చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్ రికార్డును బద్దలు కొట్టింది. గతంలో న్యూజిలాండ్‌పైనే 205 పరుగుల లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో పాకిస్థాన్ 24 బంతులు మిగిల్చి రికార్డు నెలకొల్పింది. ఇప్పుడు భారత్ ఆ రికార్డును అధిగమించింది. అంతేకాకుండా టీ20ల్లో టీమిండియాకు ఇది సంయుక్తంగా అత్యధిక ఛేదన. 2023లో ఆస్ట్రేలియాపై కూడా భారత్ 209 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది. టీ20 ఫార్మాట్‌లో భారత్ 200కు పైగా లక్ష్యాన్ని ఛేదించడం ఇది ఆరోసారి కావడం విశేషం.



