దేశం అభివృద్ధిలో దూసుకుపోతోందని ఢిల్లీ దర్వాజాల వద్ద మోడీ సర్కార్ నిత్యం వేసే డప్పుమేళాను ప్రపంచ అసమానతల నివేదిక-2026 ఒక్కసారిగా పటాపంచలు చేసింది. వరల్డ్ ఈక్వాలిటీ రిపోర్టు విడుదల చేసిన తాజా రిపోర్టును పరిశీలిస్తే అన్ని దేశాల్లోకెల్లా ఆర్థిక అసమానతలు భారత్‌లోనే ఎక్కువగా ఉన్నాయని తేటతెల్లమైంది. ‘విభజించు, పాలించు’ నినాదం మన ఏలికలకు కొత్తేం కాదు. కానీ ఇక్కడ చూస్తున్నది నిజమైన భారతదేశం రెండు ముక్కలై కనిపిస్తోంది. ఒకటి సంపదను కూడబెట్టే వర్గం కాగా మరొకటి జీవనోపాధి కోసం పోరాడే జన సమూహం. దేశ ఆదాయంలో యాభై ఎనిమిది శాతం కేవలం పదిశాతం మంది చేతుల్లోనే ఉందంటే నమ్మగలమా? కానీ నమ్మి తీరాలి. ఇది యాదృచ్ఛికం కాదు. పదకొండేండ్లుగా మోడీ సర్కార్ అమలు చేస్తున్న కార్పొరేట్-కేంద్రీకృత విధానాల ప్రత్యక్ష ఫలితం. వృద్ధి అనే గొప్ప అబద్ధం వెనుక భారత పేదల ముఖంపై అసమానత అనే నిజం నిలబడిపోయింది. పాలకులు, పెట్టుబడిదారులు కలిసి లిఖిస్తున్న వివక్ష చరితం. దీనికి సమాధానం చెప్పాలి. ఇదేనా ‘వికసిత భారత్’?
భారత జనాభా సుమారు నూట నలభై ఆరు కోట్లు. దాదాపు యాభై లక్షల కోట్ల రూపాయలు పైచిలుకు బడ్జెట్. ఇంతపెద్ద ఎత్తున ప్రజలు నివసించే దేశంలో ఆర్థిక వనరులు, ఉపాధి, విద్య, వైద్యం, పౌరసేవల పంపకం ఎలా ఉందనేదానికి తొలి ప్రాధాన్యత. ఎందుకంటే, బడ్జెట్ ప్రజాసంక్షేమానికి వినియోగించాలి. వారి కొనుగోలుశక్తి పెరిగే ప్రణాళికలు రూపొందించాలి. అందరికీ విద్య, ఉపాధి కల్పించాలి. కానీ వాస్తవంగా జరుగుతున్నదేమిటి? పేరుకు మాత్రం మౌలిక వసతుల కల్పన, వేసేది మాత్రం పెట్టుబడిదారులకు పీట. రహదారులు, బొగ్గు, విమాన, రైల్వే, పోర్టులన్నీ అదానీ, అంబానీ లాంటి కార్పొరేట్లకు కట్టబెట్టింది కేంద్రమే కదా! ప్రతీ కాంట్రాక్టు ప్రయివేటుకు అప్పజెప్పడం మూలాన ప్రజలకు ఒరిగిందేమీలేదు. పైగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు వస్తాయని చెప్పే మాటలు మరీ బూటకం. పరిశ్రమలు, ప్రాజెక్టులు కట్టాలంటే ఈ పేదోడి భూమే కావాలి. నయానో భయానో, పదో పరకో ఇచ్చి భూములు గుంజుకుని వారిని మరింత పేదలుగా మార్చే కుట్రలో సమిధలె వరంటే సామాన్యులే. వారు కంపెనీలు స్థాపిస్తే రాయితీలు, పన్ను మినహాయింపులు, సకల సౌకర్యాలు. శ్రమ కార్మికులది, లాభం సంపన్నులది. భారత్ మూడు ట్రిలియన్‌ల ఆర్థిక వ్యవస్థ వెనుక అసలు ‘రహస్యమిదే’!
సంపద ఒకవైపే పోగుబడటం, పేదలు మరింత పేదరికంలోకి దిగజారడం వెనుక మోడీసర్కార్ అసమర్థత కొట్టొచ్చినట్టు కనిపి స్తున్నది. గద్దెనెక్కిందే పెట్టుబడిదారుల కోసం అన్న చందంగా పాలన ఉన్నది. జీఎస్టీ అన్నివర్గాల ప్రజల కోసమంటూ నమ్మించి అమలులో మాత్రం పెట్టుబడిదారుల ప్రయోజనాలనే నెరవేర్చింది. స్లాబుల సవరణ వల్ల ఉత్పత్తి ఆధారిత పెద్ద కంపెనీల పన్ను భారం తగ్గింది. వినియోగదారులు, ముఖ్యంగా పేద, కింది తరగతులకు మాత్రం పరోక్షంగా పన్నుల భారం పెరిగింది. పైగా కార్పొరేట్ల ఒత్తిడి మేరకే ఈ శ్లాబుల నిర్ణయం చేసి ‘జీఎస్టీ బచావ్’ అంటూ ప్రచారం లంకించుకోవడం కేంద్ర సర్కార్‌కే చెల్లింది. దశాబ్దకాలంగా దేశంలో ఎలాంటి పురోగతి లేదన్నది వాస్తవం. ఆదాయాలు, సంపద, లింగ వైవిధ్యత వంటి పలు అంశాల్లో భారతదేశంలో అసమానతలు చాలా లోతుగా పాతుకుపోయాయి. వీటివల్ల ఆర్థిక వ్యవస్థలో నెలకొన్న వ్యవస్థాగతమైన విభేదాలు తారాస్థాయికి చేరాయి. ఇది ఎవరోచెప్పింది కాదు, ఆర్థికవేత్తలు జయతి ఘోష్, జోసెఫ్ స్టిగ్లిట్జ్‌లు ఈ నివేదికకు ముందుమాటలో రాసిన మాటలు. అంతర్జాతీయంగా సంపద అత్యంత అసమానమైన రీతిలో పంపిణీ కావడం ఆందోళనకరం.
ఒక శాతం అంటే అరవై వేల కన్నా తక్కువమంది కోటీశ్వరులు కిందిస్థాయి మానవాళి వద్ద ఉన్న మొత్తం సంపద కన్నా మూడు రెట్లు ఎక్కువ కలిగి ఉండటం ఆర్థిక వ్యవస్థకు పొంచిన ప్రమాదం. అసమానతలు ఇంత తీవ్రంగా పెచ్చరిల్లుతుంటే అదేస్థాయిలో నిరుద్యోగమూ తాండవిస్తోంది.లింగ సమా నత్వంలో కూడా దిగజారిన పరిస్థితే ఉంది. అంతర్జాతీ యంగా మహిళా కార్మిక ప్రాతినిధ్యం తగ్గుతున్నది. గంటకు పురుషుడు సంపాదించేదానిలో వారిది అరవై ఒకశాతం మాత్రమే. మొత్తం కార్మిక ఆదాయంలో వాటా కేవలం ఇరవై ఐదు శాతం. ఏ రంగంలో చూసినా అసమానతల పర్వం ఇదేవిధంగా ఉంది. నిత్యం కార్పొరేట్ల సేవలో తరించే ఆరెస్సెస్-బీజేపీ పరివారానికి దాన్ని అధిగమించే ఆలోచన లేదు. ఉన్నది ఇలాంటివాటిపై జనాల్లో అసంతృప్తి రాకుండా దృష్టిమరల్చే ‘విద్వేష’ కుంపటి ఆరకుండా చూడటం. అందుకే అధికారంలో ఉన్న పాలకవర్గాలు ఏవైనా సరే, సంపదను పునర్విభజించేందుకు ధనికులపై సరైన పన్ను విధించాలి. అందరికీ ఉచిత విద్య,వైద్యం అందేలా ప్రభుత్వ వ్యవస్థను బలపరచాలి. అంతేకాక ఆదాయ అంతరాలు తగ్గడానికి వ్యవస్థను మార్చే నిర్మాణాత్మక చర్యలు అవసరం.
అసమానతల భారతం
- Advertisement -
- Advertisement -
RELATED ARTICLES



