నవతెలంగాణ-హైదరాబాద్: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్, రష్యాలను అమెరికా పూర్తిగా కోల్పోయిందని, ఆ దేశాలు ఇప్పుడు ‘చీకటి చైనా’కు దగ్గరయ్యాయని ఆయన పేర్కొన్నారు. ఈ మేరకు తన సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ ‘ట్రూత్ సోషల్’లో ఆయన ఒక పోస్ట్ పెట్టారు.
“మనం భారత్, రష్యాలను చీకటి చైనాకు కోల్పోయినట్టు కనిపిస్తోంది. ఆ మూడు దేశాలు కలిసికట్టుగా సుదీర్ఘకాలం వర్ధిల్లాలని కోరుకుంటున్నా” అంటూ ట్రంప్ తన పోస్ట్‌లో వ్యంగ్యంగా రాసుకొచ్చారు.
ఈ వారం ప్రారంభంలో చైనాలోని టియాంజిన్‌లో జరిగిన షాంఘై సహకార సంస్థ (ఎస్సీఓ) సదస్సు నేపథ్యంలో ట్రంప్ ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఈ సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ, రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌లకు చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ ఆతిథ్యం ఇచ్చారు. ఈ ముగ్గురు నేతలు ఇంధనం, భద్రత వంటి పలు కీలక రంగాల్లో సహకారంపై చర్చించారు. ఉక్రెయిన్ యుద్ధం, అంతర్జాతీయ వాణిజ్యం వంటి అంశాల్లో ఈ మూడు దేశాలు అమెరికాతో విభేదిస్తున్న విషయం తెలిసిందే.