Thursday, September 11, 2025
E-PAPER
spot_img
Homeప్రధాన వార్తలుఅమెరికాకు భారత్‌ మోకరిల్లొద్దు

అమెరికాకు భారత్‌ మోకరిల్లొద్దు

- Advertisement -

స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలి
ట్రంప్‌ ఆధిపత్యవాదాన్నిమోడీ ప్రభుత్వం ప్రశ్నించాలి: ఏచూరి ప్రథమ వర్ధంతి స్మారకోపన్యాసంలో కె నాగేశ్వర్‌
టారిఫ్‌లు పెంచుతున్నా మాట్లాడని మోడీ : శ్రీజన్‌ భట్టాచార్య

నవతెలంగాణ బ్యూరో – హైదరాబాద్‌
అమెరికా సామ్రాజ్యవాదానికి భారత్‌ మోకరిల్లొద్దని మాజీ ఎమ్మెల్సీ, ప్రముఖ రాజకీయ విశ్లేషకులు కె నాగేశ్వర్‌ అన్నారు. భారత్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం ఉండాలని సూచించారు. అమెరికాకు అనుకూలమైన విదేశాంగ విధానాన్ని అమలు చేయడం దేశ సార్వభౌమత్వానికి ప్రమాదకరమని చెప్పారు. అమెరికా అధ్యక్షులు డొనాల్డ్‌ ట్రంప్‌ ఆధిపత్యవాదాన్ని మోడీ ప్రభుత్వం ప్రశ్నించాలని డిమాండ్‌ చేశారు. అదే సీతారాం ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. బుధవారం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో భారత విద్యార్థి ఫెడరేషన్‌ (ఎస్‌ఎఫ్‌ఐ) రాష్ట్ర కమిటీ ఆధ్వర్యంలో సీతారాం ఏచూరి ప్రథమ వర్ధంతి సందర్భంగా ‘అమెరికా ఆధిపత్యం- భారతదేశం ఏం చేయాలి’అనే అంశంపై స్మారకోపన్యాసం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన నాగేశ్వర్‌ మాట్లాడుతూ దేశంలో మోడీ ప్రభుత్వం అనుసరిస్తున్న విధానంతో విదేశాంగ విధానం ప్రమాదంలో పడిందని ఆందోళన వ్యక్తం చేశారు.

దీంతో భారత్‌కు స్వతంత్ర విదేశాంగ విధానం లేకుండా పోయిందన్నారు. అమెరికా తన ఆధిపత్యం కోసం వివిధ దేశాలపై టారిఫ్‌లను విధిస్తున్నదని చెప్పారు. రష్యాతో చమురు కొనుగోలు చేస్తుండడంతో భారత్‌పై అమెరికా 50 శాతం టారిఫ్‌లను విధించిందని గుర్తు చేశారు. రష్యా నుంచి చమురును అంబానీ ఎక్కువగా కొంటున్నారని వివరించారు. ఆ టారిఫ్‌ల వల్ల భారత్‌లోని వ్యవసాయం, ఆక్వా, పాల రైతులు, లెదర్‌ పరిశ్రమ వంటి రంగాలపై ప్రభావం పడుతుందని అన్నారు. ట్రంప్‌ భారత్‌పై టారిఫ్‌లు విధిస్తున్న మోడీ మాట్లాడ్డం లేదన్నారు. రక్షణ రంగంలో అమెరికాకు మోకరిల్లి ఆయుధాలు కొనుగోలు చేస్తున్నారని విమర్శించారు. భారత విదేశాంగ విధానం బలహీనంగా ఉందన్నారు. విదేశాంగ విధానాన్ని మార్చుకోవాలనీ, బలపడాలని ఆకాంక్షించారు.

అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా ఉద్యమించడమే ఏచూరికి ఇచ్చే నిజమైన నివాళి అని అన్నారు. ఇది బహుళధ్రువ ప్రపంచమనీ, ఏకధ్రువ ప్రపంచం కాదని చెప్పారు. వ్యూహాత్మక స్వయంప్రతిపత్తిని కాపాడాలని సూచించారు. రష్యా-ఇండియా-చైనా కూటమి మరింత బలపడాలని కోరారు. అధ్యయనం, పోరాటం స్ఫూర్తితో లౌకికవాదం కోసం ఉద్యమించాలని ఎస్‌ఎఫ్‌ఐ అఖిల భారత ప్రధాన కార్యదర్శి శ్రీజన్‌ భటాచార్య పిలుపునిచ్చారు. కమ్యూనిస్టులు సామ్రాజ్యవాదం గురించి ఎప్పుడూ మాట్లాడతారంటూ జోకులు వేసిన వారే ట్రంప్‌ టారిఫ్‌లను పెంచాక సోషల్‌ మీడియాలో దానికి వ్యతిరేకంగా స్పందిస్తున్నారని వివరించారు. పాకిస్తాన్‌-ఇండియా మధ్య యుద్ధాన్ని ఆపానంటూ ట్రంప్‌ ప్రకటించినా మోడీ స్పందించడం లేదన్నారు. అమెరికాకు మోడీ లొంగిపోయారని విమర్శించారు. రష్యా, చైనాతో భారత్‌ సంబంధాలను కొనసాగించాలని కోరారు. సరిహద్దు దేశాలతో సత్సంబంధాలు ఉండాలని సూచించారు.

అమెరికా విధానాలు భారత విద్యారంగంపై ప్రభావం పడుతున్నదనీ, వాటికి వ్యతిరేకంగా ఉద్యమించాలని ఆయన పిలుపునిచ్చారు. రాష్ట్రంలో ఉపాధి అవకాశాల కోసం విద్యలో అసమానతలు రూపుమాపడం కోసం ఏచూరి స్ఫూర్తితో ఉద్యమాలు చేపట్టాలని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర మాజీ కార్యదర్శి టి సాగర్‌ అన్నారు. అమెరికా సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా నికరంగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అమెరికా ఆంక్షలకు తలొగ్గితే అన్ని వస్తువులపై విదేశాలపై ఆధారపడాల్సి వస్తుందన్నారు. ఆహార ధాన్యాల దిగుబడి పెరుగుతుందనే కారణంతోనే యూరియా కొరతను సృష్టిస్తున్నారని విమర్శించారు. అప్పుడే అమెరికా నుంచి ఆహార ధాన్యాలను దిగుమతి చేసుకునే పరిస్థితి వస్తుందన్నారు. విద్యార్థుల హక్కుల కోసం నికరంగా నిలబడి ఎమర్జెన్సీలో సైతం నాటి ప్రధాని ఇందిరాగాంధీని రాజీనామా చేయాలని నిలదీసిన ధీశాలి సీతారాం ఏచూరి అని ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర కార్యదర్శి టి నాగరాజు అన్నారు.

ఆకర్షణీయమైన నినాదాలు రూపొందించి, పోరాటాలకు విద్యార్థులను కదిలించిన యోధుడని చెప్పారు. ఆయన స్ఫూర్తితో ప్రజాస్వామ్య హక్కులు కోసం, విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఉద్యమించాలని పిలుపునిచ్చారు. ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్షుడు ఎస్‌ రజనీకాంత్‌ అధ్యక్షత వహించిన ఈ కార్యక్రమంలో ఎస్‌ఎఫ్‌ఐ రాష్ట్ర సహాయ కార్యదర్శులు మమత, కె శంకర్‌, శ్రీకాంత్‌, రంజిత్‌ ఉపాధ్యక్షులు కిరణ్‌, అశోక్‌ రెడ్డి, ప్రశాంత్‌, బి శంకర్‌, డీవైఎఫ్‌ఐ రాష్ట్ర అధ్యక్ష్య, కార్యదర్శులు కోట రమేష్‌, ఆనగంటి వెంకటేష్‌, ఉపాధ్యక్షులు ఎండి జావేద్‌, రైతుసంఘం రాష్ట్ర నాయకులు అరిబండి ప్రసాదరావు, రాష్ట్ర సహాయకార్యదర్శి శోభన్‌, టీపీటీఎల్‌ఎఫ్‌ రాష్ట్ర నాయకులు విజరు తదితరులు పాల్గొన్నారు.

- Advertisement -
spot_img
RELATED ARTICLES
- Advertisment -

తాజా వార్తలు

- Advertisment -spot_img
Ad
Ad