నవతెలంగాణ-హైదరాబాద్: ఐదు T20 మ్యాచ్‌ల సందర్బంగా నేడు ఒడిషాలోని కటక్ వేదికగా తొలి మ్యాచ్ జరగనుంది. మరికాసేపట్లో స్టేడియాంలో భారత్, సౌతాఫిక్రా జట్లు తలపడనున్నాయి. భారత్ పర్యటనలో భాగంగా మూడు టెస్టు మ్యాచ్‌ల సిరీస్‌ను సఫారీ జట్టు కైవసం చేసుకుంది. ఆ తర్వాత జరిగిన వన్డే ట్రోఫిని టీమిండియా కైవసం చేసుకుంది. మూడు వన్డే మ్యాచ్‌ల్లో రెండు ఇండియా గెలువగా, ఒక్క మ్యాచ్‌లో సఫారి జట్టు విజయం సాధించి వన్డే సిరీస్‌ను కోల్పోయింది. అయితే తాజాగా నేటి నుంచి ప్రారంభం కానున్న ఐదు T20 మ్యాచ్‌ల సందర్బంగా తొలి ఆటలో బోణి కొట్టాలని ఇరు జట్లు ఊవ్విళ్లూరుతున్నాయి. ఐదు మ్యాచ్‌ల టీ20 సిరీస్ విజయంతో టూర్‌ను విజయవంతంగా ముగించాలని సఫారీలు ఎదురుచూస్తుండగా.. సొంతగడ్డపై మెగా ఈవెంట్ ముంగిట ప్రత్యర్థిని చిత్తు చేయాలనే పట్టుదల టీమ్ ఇండియాలో కనిపిస్తోంది
ఈడెన్‌గార్డెన్స్ టెస్టులో మెడ నొప్పితో టెస్టు, వన్డే సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్ టీ20 సిరీస్‌లో ఆడనున్నాడు. మెడ నొప్పి నుంచి కోలుకున్న గిల్ నేడు కటక్‌లో అభిషేక్ శర్మతో కలిసి ఓపెనర్‌గా ఆడనున్నాడు. సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, జితేశ్ శర్మలు మిడిల్ ఆర్డర్‌లో ఆడనుండగా.. ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్య సైతం తిరిగి జట్టులోకి రానున్నాడు. హార్దిక్ పాండ్య, అక్షర్ పటేల్ పేస్, స్పిన్ ఆల్‌రౌండర్లుగా జట్టులో ఉండనున్నారు. కుల్‌దీప్ యాదవ్, వరుణ్ చక్రవర్తి స్పిన్ విభాగంలో.. జశ్‌ప్రీత్ బుమ్రా పేస్ బాధ్యతలు చూసుకోనుండగా.. మరో స్పెషలిస్ట్ పేసర్, పేస్ ఆల్‌రౌండర్‌గా ఎవరిని తీసుకోవాలనే మీమాంశ జట్టు మేనేజ్‌మెంట్‌లో కనిపిస్తోంది. సంజు శాంసన్ ఓపెనర్‌గా శతకాలు బాదినా.. మిడిల్ ఆర్డర్‌లో మళ్లీ సత్తా చాటాల్సి రావటంపై విమర్శలు వస్తున్నాయి. దీంతో తుది జట్టు కూర్పుపై అభిమానుల్లో, విశ్లేషకుల్లో ఆసక్తి నెలకొంది.
బలహీనంగా సఫారీ?
ఈ ఫార్మాట్‌లో సఫారీలు బలహీనంగా కనిపిస్తున్నారు. జట్టులో చోటు, బాధ్యతలపై స్పష్టత లేకపోవటం సహా విధ్వంసక బ్యాటర్ హెన్రిచ్ క్లాసెన్ వీడ్కోలు తీసుకోవటం దక్షిణాఫ్రికాపై ప్రతికూల ప్రభావం చూపిస్తోంది. క్వింటన్ డికాక్, మార్‌క్రామ్, హెండ్రిక్స్, డెవిడ్ మిల్లర్, ట్రిస్టన్ స్టబ్స్ నిలకడగా రాణించటం లేదు. టీ20ల్లో జట్టుగా రాణించటంతో సఫారీ ఇటీవల విఫలం అవుతోంది. ఈ సిరీస్‌లో ఆ లోపాలను సఫారీలు దిద్దుకుంటారా? అదే బాటలో నడుస్తారా? చూడాలి.


