నవతెలంగాణ-హైదరాబాద్: భారతదేశ ఆర్థిక వ్యవస్థ నిర్జీవ స్థితిలో ఉందని ప్రధాని మోడీ, ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ మినహా అందరికీ తెలుసునని లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ గురువారం వ్యాఖ్యానించారు. దేశ ఆర్థిక వ్యవస్థను బీజేపీ నాశనం చేసిందని ధ్వజమెత్తారు. భారత ఆర్థిక వ్యవస్థపై ట్రంప్ విమర్శ గురించి పార్లమెంట్ ఎదుట మీడియా అడిగిన ప్రశ్నకు ఆయన పైవిధంగా స్పందించారు. అవును, ట్రంప్ చెప్పింది వాస్తవమేనని, ప్రధాని ఆర్థిక మంత్రికి తప్ప అందరికీ ఈవిషయం తెలుసునని అన్నారు. ట్రంప్ వాస్తవాన్ని వెల్లడించినందుకు సంతోషిస్తున్నానని అన్నారు.
ఇందులో ఆశ్చర్యం లేదని, అదానీకి సహాయం అందించడం కోసం బిజెపి ఆర్థిక వ్యవస్థను నాశనం చేసిందని అన్నారు. అమెరికాతో భారత్ వాణిజ్య ఒప్పందం కుదుర్చుకుంటుందని, ఆవిషయాన్ని ట్రంప్ స్పష్టం చేస్తారని, ట్రంప్ చెప్పినట్లు ప్రధాని మోడీ చేస్తారని అన్నారు.
భారతదేశ దిగుమతులపై 25శాతం సుంకం విధిస్తున్నట్లు ప్రకటించిన తర్వాత, భారత్-రష్యాల ఆర్థిక వ్యవస్థలు నిర్జీవమైనవని అమెరికా అధ్యక్షులు ప్రకటించిన సంగతి తెలిసిందే.