నవతెలంగాణ-హైదరాబాద్: ఓ ప్రయాణికురాలికి అపరిశుభ్రమైన, అసౌకర్యవంతమైన సీటును కేటాయించినందుకుగాను ఇండిగో ఎయిర్ లైన్స్‌కు ఢిల్లీ వినియోగదారుల ఫోరం రూ. 1.5 లక్షల జరిమానా విధించింది. ఈ మొత్తాన్ని సదరు ప్రయాణికురాలికి చెల్లించాల్సిందిగా ఆదేశించింది. ఈ ఏడాది జనవరి 5వ తేదీన తాను ప్రయాణించిన బాకు-న్యూఢిల్లీ ఇండిగో విమానంలో తనకు అపరిశుభ్రమైన సీటు కేటాయించినట్లు పింకీ అనే మహిళ ఢిల్లీలోని వినియోగదారుల ఫోరంను ఆశ్రయించారు.
దీని వల్ల తాను శారీరకంగా, మానసికంగా ఇబ్బందిపడినట్లు తెలిపారు. ఫిర్యాదుపై విచారణ జరిపిన కమిషన్ ప్రయాణికురాలు ఎదుర్కొన్న అసౌకర్యం, మానసిక వేదనకు పరిహారం చెల్లించాలని ఇండిగోను ఆదేశించింది. ఈ కేసుకు సంబంధించి ఆమె ఖర్చు చేసిన రూ.25,000 కూడా చెల్లించాలని పేర్కొంది.
అయితే.. ఈ ఆదేశాలను ఇండిగో వ్యతిరేకించింది. ప్రయాణికురాలికి కేటాయించిన సీటు సరిగ్గా లేకపోడంతో ఆమె అభ్యర్థన మేరకు తాము వేరే సీటు కేటాయించినట్లు తెలిపింది. అనంతరం ఆమె సౌకర్యవంతంగా తన ప్రయాణాన్ని పూర్తి చేసినట్లు పేర్కొంది. అయినప్పటికీ వినియోగదారుల ప్రయాణ సమాచారాన్ని తెలిపే అంతర్గత కార్యాచరణ రికార్డులలో భాగమైన సిట్యువేషన్ డేటా డిస్‌ప్లే నివేదికను సమర్పించడంలో ఎయిర్‌లైన్స్ విఫలమైనందున జరిమానాను చెల్లించాల్సిందేనని వినియోగదారుల ఫోరం స్పష్టం చేసింది.